AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pragathi: ప్రగతి అంటే కేవలం నటి అనుకుంటివా.. అంతకుమించి.. ఇంటర్నేషన్ లెవల్‌లో

ఓ వైపు యాక్టింగ్... మరోవైపు క్రీడారంగంలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు నటి ప్రగతి. పవర్‌లిఫ్టింగ్‌లో అద్భుతమైన ప్రతిభ కనబరుస్తూ జాతీయ స్థాయిలో పతకాల పంట పండిస్తున్న ఆమె, ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై సత్తా చాటారు. ఆ డీటేల్స్ కథనం లోపల తెలుసుకుందాం ..

Pragathi: ప్రగతి అంటే కేవలం నటి అనుకుంటివా.. అంతకుమించి.. ఇంటర్నేషన్ లెవల్‌లో
Pragathi
Ram Naramaneni
|

Updated on: Dec 07, 2025 | 6:10 AM

Share

నటిగా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న ప్రగతి గత రెండు మూడేళ్లుగా మాత్రం పవర్ లిఫ్టింగ్‌లో రాణిస్తూ ఉన్నారు. జిల్లా, రాష్ట్ర, దేశ స్థాయిలో పలు పోటీల్లో పాల్గొని పతకాలు సాధించారు. అంతర్జాతీయ స్థాయిలోనూ ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. టర్కీలో జరిగిన ఏషియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో నాలుగు పతకాలు సాధించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఇన్‌స్టా వేదికగా పోస్ట్‌ పెట్టారు. తాజా గేమ్స్‌లో ఓవరాల్‌గా సిల్వర్‌ మెడల్‌ సాధించగా, డెడ్‌ లిఫ్ట్‌నకు గోల్డ్‌ మెడల్‌ దక్కింది. ఇక బెంచ్‌, స్క్వాట్‌ లిఫ్టింగ్‌లో మరో రెండు సిల్వర్‌ మెడల్స్‌ సాధించినట్లు ప్రగతి తెలిపారు.

2023లో పవర్‌లిఫ్టింగ్ క్రీడలోకి అడుగుపెట్టిన ప్రగతి, అతి తక్కువ సమయంలోనే అసాధారణ విజయాలు సాధించారు. తన ప్రయాణాన్ని హైదరాబాద్ జిల్లా స్థాయి పోటీల్లో స్వర్ణ పతకంతో ప్రారంభించి, ఆపై తెలంగాణ రాష్ట్ర స్థాయి ఛాంపియన్‌షిప్‌లోనూ బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు. అదే ఏడాది తెనాలిలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో ఐదో స్థానంలో నిలిచినప్పటికీ, వెనుదిరగలేదు. బెంగళూరులో జరిగిన నేషనల్ లెవెల్ బెంచ్ ప్రెస్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచి తన సత్తాను చాటారు. ఆ తర్వాత 2024లో సౌత్ ఇండియన్ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించారు.

ఇక 2025 సంవత్సరం ప్రగతి కెరీర్‌లో అత్యంత కీలకంగా మారింది. హైదరాబాద్ జిల్లా, తెలంగాణ రాష్ట్ర స్థాయి పోటీల్లో వరుసగా స్వర్ణ పతకాలు గెల్చుకున్న ఆమె, కేరళలో జరిగిన ప్రతిష్ఠాత్మక జాతీయ స్థాయి పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లోనూ బంగారు పతకాన్ని ముద్దాడారు. ఈ అద్భుత ప్రదర్శనతో ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో మెరిశారు. నటనలో రాణిస్తూనే, క్రీడల్లోనూ పట్టుదలతో శిక్షణ పొంది జాతీయ ఛాంపియన్‌గా నిలవడం ఆమె అంకితభావానికి నిదర్శనం అంటున్నారు ఆమె అభిమానులు, క్రీడా ప్రేమికులు ఆకాంక్షిస్తున్నారు.