AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thug Life Movie Review: కమల్ హాసన్ థగ్ లైఫ్ మూవీ రివ్యూ.. మణిరత్నం సినిమా ఎలా ఉందంటే..

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ అంటే ఉండే అంచనాలు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాయకుడు లాంటి క్లాసిక్ తర్వాత 38 ఏళ్ళు గ్యాప్ తీసుకుని ఈ ఇద్దరూ చేసిన సినిమా థగ్ లైఫ్. తాజాగా ఈ సినిమా విడుదలైంది. మరి మణిరత్నం, కమల్ మరోసారి మాయ చేసారా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..

Thug Life Movie Review: కమల్ హాసన్ థగ్ లైఫ్ మూవీ రివ్యూ.. మణిరత్నం సినిమా ఎలా ఉందంటే..
Thug Life
Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: |

Updated on: Jun 05, 2025 | 1:43 PM

Share

మూవీ రివ్యూ: థగ్ లైఫ్

నటీనటులు: కమల్ హాసన్, శింబు, త్రిష, అభిరామి, తణికెళ్ళ భరణి, ఐశ్వర్య లక్ష్మి, నాజర్, అశోక్ సెల్వన్, జోజు జార్జ్ తదితరులు

సినిమాటోగ్రఫీ: రవి కే చంద్రన్

సంగీతం: ఏఆర్ రెహమాన్

ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్

కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: మణిరత్నం

నిర్మాత: కమల్ హాసన్, మణిరత్నం, ఆర్ మహేంద్రన్, శివ ఆనంత్

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ అంటే ఉండే అంచనాలు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాయకుడు లాంటి క్లాసిక్ తర్వాత 38 ఏళ్ళు గ్యాప్ తీసుకుని ఈ ఇద్దరూ చేసిన సినిమా థగ్ లైఫ్. తాజాగా ఈ సినిమా విడుదలైంది. మరి మణిరత్నం, కమల్ మరోసారి మాయ చేసారా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..

కథ:

రంగరాయ శక్తిరాజా (కమల్ హాసన్) పేరు మోసిన గ్యాంగ్ స్టర్. ఓసారి పోలీస్ షూటౌట్‌లో అమర్ (శింబు) వాళ్ళ నాన్న చనిపోతాడు. దానికి కారణం తనే అని తెలిసి అమర్‌ను తీసుకెళ్లి సొంత కొడుకులా పెంచుకుంటాడు శక్తి. తనకు కుడి భుజంలా మారిపోతాడు అమర్. శక్తి వ్యాపారాలు, దందా కూడా అమర్ చూసుకుంటాడు. ఇది శక్తిరాజా చుట్టూ ఉన్న మాణిక్యం (నాజర్), పాత్రోస్ (జోజు జార్జ్)లకు నచ్చదు. దాంతో అమర్ మనసు మార్చేస్తారు.. మీ నాన్నను చంపించి శక్తి అని నమ్మిస్తారు. శక్తిని చంపడానికి ఉసిగొల్పుతారు. ఆ తర్వాత శక్తి ప్రియురాలు ఇంద్రాని (త్రిష)ను కూడా తీసుకుని వెళ్తాడు అమర్. మరి నిజంగానే శక్తిని అమర్ చంపేసాడా..? అసలు లక్ష్మి (అభిరామి) ఎవరు.. శక్తి రివేంజ్ తీర్చుకున్నాడా లేదా అనేది అసలు కథ..

కథనం:

కొందరు దర్శకులను మనస్పూర్తిగా విమర్శించాలన్నా మనసు రాదు.. వాళ్ళ చుట్టూ ఆరా అలా ఉంటుంది.. మణిరత్నం అలాంటి గొప్ప దర్శకుడు. ఒకప్పుడు ఈయన తీసిన సినిమాలన్నీ క్లాసిక్సే. అప్పట్లో మణిరత్నం సినిమా వస్తే ఎలాగైనా చూడాలి అనిపించేది.. ఇప్పుడు ఎందుకిలాంటి సినిమాలు చేస్తున్నారీయన అనిపిస్తుంది. కొన్నేళ్ల తర్వాత ఎంత పెద్ద డైరెక్టర్‌కు అయినా మార్క్ మిస్ అవుతుంది. మణి సార్ విషయంలో ఇదే జరుగుతుంది.. ఒకే కథ మళ్లీ తిప్పి తిప్పి తీస్తున్నారీయన. థగ్ లైఫ్ చూస్తుంటే నవాబ్‌కు మరో వర్షన్ చూస్తున్నట్లు అనిపిస్తుంది. ఓ నాయకుడు.. అతడి సామ్రాజ్యం.. చుట్టూ మంది మార్బలం.. అదే గ్యాంగ్ స్టర్స్.. అదే గొడవలు.. అదే సొంత మనుషుల మధ్య యుద్ధం.. నాయకుడు కాలం నుంచి ఇదే కథ చెప్తున్నారు మణిరత్నం. అప్పట్లో ఆయన స్క్రీన్ ప్లే నెక్ట్స్ లెవల్.. నవాబ్ కూడా పర్లేదు. తెలిసిన కథ తీసినా.. ఆకట్టుకునే స్క్రీన్ ప్లేతో మాయ చేసేవారు మణి. కానీ ఇప్పుడా మ్యాజిక్ మిస్ అయింది. థగ్ లైఫ్ మాత్రం భరించలేం.. చాలా నెమ్మదిగా సాగే స్క్రీన్ ప్లే మన సహనానికి పరీక్షే. మణిరత్నం అనే బ్రాండ్ అని గుర్తు చేసుకుంటున్నా.. ఈ సినిమాను చూడటం కాస్త కష్టమే. సినిమా నిండా స్టార్స్ ఉన్నారు కానీ వాళ్ళకు సరైన క్యారెక్టర్స్ పడలేదు. ఐకానిక్ క్యారెక్టర్స్ క్రియేట్ చేసిన మణి.. ఇప్పుడు స్క్రీన్‌ను తన బ్రాండ్‌తో నింపేసారంతే. థగ్ లైఫ్ అని పేరు పెట్టినా.. అక్కడ ఆ థగ్స్‌లో లైఫ్ లేదు.. ఓ గ్యాంగ్ స్టర్‌కు వెన్నుపోటు పొడిచి.. అతడి స్థానాన్ని తీసుకుంటాడు పెంపుడు కొడుకు. వాళ్లిద్దరి మధ్య యుద్ధమే థగ్ లైఫ్.. సింపుల్‌గా ఇదే కథ. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్స్ పర్లేదు అనిపిస్తాయి. సెకండాఫ్ అయితే మరీ దారుణంగా ఉంది. బోరింగ్ స్క్రీన్ ప్లేతో సహనానికి పరీక్ష పెడుతుంది. క్లైమాక్స్ కూడా తూతూ మంత్రంగా ముగించేసారు.

నటీనటులు:

కమల్ హాసన్ నటన గురించి మనం మాట్లాడాల్సిన పనిలేదు. ఎలాంటి పాత్రలో అయినా ప్రాణం పోస్తాడాయాన. శింబు కూడా బాగా చేసాడు.. అమర్ క్యారెక్టర్‌లో ఒదిగిపోయాడు. త్రిష క్యారెక్టర్ టిపికల్‌గా రాసుకున్నారు మణిరత్నం. అలాగే అభిరామి, తణికెళ్ళ భరణి, నాజర్, ఐశ్వర్య లక్ష్మి, అశోక్ సెల్వన్, జోజు జార్జ్ ఇలా చాలా మంది స్టార్స్ ఉన్నారు సినిమాలో. కానీ ఎవరినీ సరిగ్గా వాడుకోలేదేమో అనిపించింది.

టెక్నికల్ టీం:

ఏఆర్ రెహమాన్ నేపథ్య సంగీతం వరకు ఓకే గానీ పాటలు మాత్రం పెద్దగా ఆకట్టుకోలేదు. పెళ్లి పాట తప్పిస్తే ఏదీ అంతగా గుర్తుండదు కూడా. రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫీ నెక్ట్స్ లెవల్. ఫ్రేమ్స్ అయితే అదిరిపోయాయి. ఇక శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ చాలా వీక్.. 2.45 గంటల సినిమా చాలా నెమ్మదిగా సాగుతుంది. కాకపోతే మణిరత్నం లాంటి దర్శకుడి ఆర్డర్ ఫాలో అవ్వాలి కాబట్టి ఆప్షన్ లేదు ఆయనకు. నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడిగా మణిరత్నం ఆకట్టుకోలేదు. తన నవాబ్ సినిమానే మళ్లీ తీసినట్లు అనిపిస్తుంది..

పంచ్ లైన్:

ఓవరాల్‌గా థగ్ లైఫ్.. మణిరత్నం మార్క్ మిస్సైన గ్యాంగ్ స్టర్ డ్రామా..