AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Keedaa Cola Review: కీడా కోలా మూవీ ఫుల్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..

పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది లాంటి డిఫెరెంట్ సినిమాల తర్వాత తరుణ్ భాస్కర్ నుంచి వచ్చిన సినిమా కీడా కోలా. ఫస్ట్ రెండు సినిమాలు ఫ్యామిలీ అండ్ ఫన్ ఎంటర్‌టైనర్లతో వస్తే.. ఈ సారి తనకు ఇష్టమైన క్రైమ్ కామెడీని తెరకెక్కించారు తరుణ్. మరి ఈ సినిమా ఎలా ఉంది.. ప్రేక్షకులను అలరించిందా లేదా అనేది రివ్యూలో చూద్దాం..

Keedaa Cola Review: కీడా కోలా మూవీ ఫుల్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..
Keedaa Cola
Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: |

Updated on: Nov 03, 2023 | 12:52 PM

Share

మూవీ రివ్యూ: కీడా కోలా

నటీనటులు: తరుణ్ భాస్కర్, చైతన్య రావు, మయూర్ రాగ్, జీవన్, బ్రహ్మానందం, జీవన్, రఘురామ్, విష్ణు, రవీంద్ర విజయ్‌ తదితరులు

సినిమాటోగ్రఫర్: ఏజే ఆరోన్‌

ఎడిటర్: ఉపేంద్ర వర్మ

సంగీతం: వివేక్ సాగర్

కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: తరుణ్ భాస్కర్

నిర్మాతలు: కె. వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీపాద్

పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది లాంటి డిఫెరెంట్ సినిమాల తర్వాత తరుణ్ భాస్కర్ నుంచి వచ్చిన సినిమా కీడా కోలా. ఫస్ట్ రెండు సినిమాలు ఫ్యామిలీ అండ్ ఫన్ ఎంటర్‌టైనర్లతో వస్తే.. ఈ సారి తనకు ఇష్టమైన క్రైమ్ కామెడీని తెరకెక్కించారు తరుణ్. మరి ఈ సినిమా ఎలా ఉంది.. ప్రేక్షకులను అలరించిందా లేదా అనేది రివ్యూలో చూద్దాం..

కథ:

వరదరాజు (బ్రహ్మానందం) తన మనవడు వాసు ( చైతన్య రావు)తో కలిసి బతుకుతుంటాడు. వాసుకు క్లోజ్ ఫ్రెండ్ కౌశిక్ (మయూర్ రాగ్) లాయర్. ఓరోజు వాళ్లు తెచ్చుకున్న ఇచ్చిన కీడా కోలా కూల్ డ్రింక్ బాటిల్‌లో ఓ బొద్దింక కనిపిస్తుంది. దాన్ని పెట్టి కన్జ్యూమర్ కోర్టులో కేసు వేసి కోట్లలో డబ్బు సంపాదించాలని ప్లాన్ చేస్తారు. అదే సమయంలో నాయుడు (తరుణ్ భాస్కర్) జైలు నుంచి బయటికి వస్తాడు.. ఆయన తమ్ముడు జీవన్ (జీవన్) ఎలాగైనా కార్పోరేటర్ అవ్వాలనుకుంటాడు. అసలు వాసు, వరద కథలోకి నాయుడు ఎందుకొచ్చాడు.. కోలాలోకి అసలు కీడా ఎలా వచ్చింది..? ఆ ఐడియాతో నిజంగానే వాళ్లకు కోట్లు వచ్చాయా అనేది అసలు కథ..

కథనం:

రొటీన్ సినిమాలు వారానికి ఒకటి రిలీజ్ అవుతుంటాయి. కాస్త డిఫరెంట్ సబ్జెక్టుతో ఉన్న సినిమాలు మాత్రం అరుదుగా వస్తుంటాయి. తరుణ్ భాస్కర్ కీడా కోలా మాదిరి. ఈ సినిమాలో బాగా నచ్చిన అంశం స్క్రీన్ ప్లే. అనుకుంటే పరమ రోటీన్ క్రైమ్ కామెడీగా కూడా దీన్ని తీయొచ్చు. కానీ తరుణ్ భాస్కర్ ఆ ఛాన్స్ తీసుకోలేదు. ఉన్న కథనే కొత్తగా చెప్పాలని చూసాడు. ఫస్ట్ సీన్ నుంచే తరుణ్ భాస్కర్ మార్క్ కామెడీ మొదలైపోయింది. లాస్ట్ సీన్ వరకు అది ఆగలేదు.. కొన్ని సీన్స్ అయితే పడి పడి నవ్వించాడు. ఫస్ట్ హాఫ్ అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. అక్కడక్కడ కొన్ని పంచ్ లు తప్పిస్తే పెద్దగా ఏం అనిపించదు. సెకండాఫ్ మాత్రం మామూలుగా లేదు.. ఒక్క నిమిషం కూడా ఆగకుండా పరిగెత్తింది.. క్రేజీ కామెడీతో సినిమాను పరుగులు పెట్టించాడు తరుణ్ భాస్కర్. ముఖ్యంగా రీమిక్స్ పాటలు వచ్చేసి సీన్స్ అయితే పగలబడి నవ్వుతారు. కూల్ డ్రింక్ లో బొద్దింక పడిందని.. కన్జ్యూమర్ కోర్టులో కేసు వేసి డబ్బులు లాగుదాం అనేది ఈ సినిమా కథ. లైన్ చాలా సింపుల్ అయినా తన స్క్రీన్ ప్లేతో స్పెషల్ చేశాడు తరుణ్ భాస్కర్. ఈ సినిమాకు డైలాగ్స్ ప్రాణం.. అలాగే రీ రికార్డింగ్ కూడా అదిరిపోయింది. సెకండాఫ్‌లో తరుణ్ రాసుకున్న సన్నివేశాలు అదిరిపోయాయి. ముఖ్యంగా కథ అక్కడక్కడే తిరుగుతున్నట్లు అనిపించినా.. దాన్ని డీల్ చేసిన విధానం చాలా బాగుంది. క్రైమ్ కామెడీలో ఇంతకంటే ఎం‌టర్‌టైన్మెంట్ ఇవ్వలేరనేంతగా దీన్ని తెరకెక్కించారు తరుణ్ భాస్కర్. క్లైమాక్స్ కూడా చాలా బాగా కుదిరింది. లాజిక్స్ పక్కనబెట్టి చూస్తే కీడా కోలా బాగానే ఎంజాయ్ చేయొచ్చు.

నటీనటులు:

తరుణ్ భాస్కర్ దర్శకుడుగానే కాకుండా నటుడిగానూ అలరించాడు. ముఖ్యంగా ఆయన కారెక్టరైజేషన్ బాగుంది. ఇంగ్లీష్ మాట్లాడే సీన్స్‌లో బాగా నవ్వించాడు తరుణ్. ఇక చైతన్య రావు కూడా ఉన్నంతలో మెప్పించాడు. బ్రహ్మానందం కొత్తగా కనిపించాడు. హీరో ఫ్రెండ పాత్రలో మయూర్ రాగ్ బాగా నటించాడు. జీవన్ కుమార్ మరో కీలక పాత్రలో అదరగొట్టాడు. ఆయనను నమ్మి పెద్ద పాత్ర ఇచ్చాడు తరుణ్. రఘు రామ్, రవీంద్ర విజయ్ అంతా తమ పాత్రలకు న్యాయం చేసారు.

టెక్నికల్ టీం:

వివేక్ సాగర్ అందించిన నేపథ్య సంగీతం బాగా ఆకట్టుకుంది. ఫస్టాఫ్ అంతా ఆయన ఆర్ఆర్ చెవుల్లో మోగుతూనే ఉంటుంది. ఇక సినిమాటోగ్రఫర్ ఏజే ఆరోన్‌ అందించిన సినిమాటోగ్రఫీ సినిమాకే హైలెట్. చాలా సీన్స్ ఆయన వర్క్‌తో నిలబడ్డాయి. ముఖ్యంగా కూల్ డ్రింక్‌లో కీలా వచ్చే సన్నివేశాలు చాలా బాగున్నాయి. ఎడిటర్ ఉపేంద్ర వర్మ వర్క్ సినిమాకి తగ్గట్లు ఉంది. నిడివి కూడా తక్కువగానే ఉంది. తరుణ్ భాస్కర్ మంచి కథను తీసుకున్నా కూడా ఫస్టాఫ్ ఎందుకో వదిలేసినట్లు అనిపించింది. కానీ కీలకమైన సెకండాఫ్ మాత్రం అదరగొట్టాడు. అందరికీ నచ్చకపోవచ్చు కానీ.. ఈ సినిమాను క్రేజీగా తీశాడు తరుణ్.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా కీడా కోలా.. ఫుల్ ఆఫ్ ఎంటర్ టైన్మెంట్..