Sarath Babu: ఎన్టీఆర్ ను అలా పిలవడానికి శరత్ బాబు చాలా ఇబ్బంది పడ్డారట..
1973లో రామరాజ్యం సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. తొలి సినిమా షూటింగ్‌లో స్పాట్‌లో శరత్‌బాబును చూసి 'అరే.. యూరోపియన్ కంట్రీస్ నుంచి వచ్చినట్టున్నావ్' అని అన్నారట ఎస్వీరంగారావు.
తెలుగు సినిమా చరిత్ర ఉన్నంతకాలం గుర్తుండిపోయే నటుల్లో శరత్‌బాబు ఒకరు. ఆరడుగుల పొడవు, నిటారైన ముక్కు, ఖంగుమనే స్వరం, జమీందారుగానైనా, మధ్యతరగతి మనిషిగానైనా మెప్పించగల నైజం.. అంటూ ఆయన్ని గుర్తుచేసుకుంటున్నారు అభిమానులు. ఆముదాలవలసలో డిగ్రీ పూర్తికాగానే చెన్నై ట్రైన్ ఎక్కేశారు శరత్‌బాబు. 1973లో రామరాజ్యం సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. తొలి సినిమా షూటింగ్‌లో స్పాట్‌లో శరత్‌బాబును చూసి ‘అరే.. యూరోపియన్ కంట్రీస్ నుంచి వచ్చినట్టున్నావ్’ అని అన్నారట ఎస్వీరంగారావు. తను అంతగా ఆరాధించే నటుడు అలా అనేసరికి ఒక్కసారిగా బూస్ట్ తాగినట్టు అనిపించిందని చెబుతుండేవారు శరత్‌బాబు.
రామరాజ్యంలో శరత్‌బాబు నటనను చూసిన వారు, ఇండస్ట్రీకి కొత్త హీరో వచ్చాడని సంతోషించారు. అందరూ తనను హీరో అన్నారు కదా అని, జస్ట్ హీరోగానే ఉండాలనుకోలేదు శరత్‌బాబు. పెద్ద హీరోల సినిమాల్లో చిన్న పాత్రలు చేశారు. ఎన్టీఆర్‌తో ఒకటికి నాలుగు సినిమాలు చేశారు. కెమెరా ముందు ఎన్టీఆర్‌ని ఏరా అంటూ పిలుస్తూ ఫ్రెండ్‌గా నటించాల్సి వచ్చినప్పుడు కాస్త తడబడిన విషయాన్ని కూడా గుర్తుచేసుకునేవారు.
ఎన్టీఆర్ నుంచి క్రమశిక్షణను నేర్చుకున్నానని చెప్పే శరత్‌బాబు, ఏఎన్నార్ నుంచి కూడా చాలా విషయాలు తెలుసుకున్నానని అంటారు. అనారోగ్యాన్ని దూరం పెట్టడమనే అంశాన్ని నాగేశ్వరరావు నుంచే తెలుసుకున్నానని అంటారు. తమిళంలో శివాజీకి ఇష్టమైన నటుల్లో శరత్‌బాబు ఒకరు. కన్నడ రాజ్‌కుమార్ జీవనశైలిని చాలా సార్లు ప్రస్తావించేవారు శరత్‌బాబు. కృష్ణలా కష్టపడేతత్వం అరుదుగా చూశాననీ అనేవారు. జానపద చిత్రం సింహగర్జనలో మెప్పించారు. చారిత్రక చిత్రం విశ్వనాథ నాయకుడులో దుష్టభూమిక పోషించారు శరత్‌బాబు. మగధీరలో ఉదయగిరి మహారాజుగా నటించారు. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మహారాజుగా హుందాతనం, గాంభీర్యం ఉట్టిపడేలా కనిపించారు. ప్రతి ఏటా కార్తీకమాసం రాగానే అయ్యప్ప భక్తులందరూ శరత్‌బాబు నటించిన సినిమాను గుర్తుచేసుకుంటారు. అయ్యప్ప చిత్రంలోనే కాదు, శ్రీరామదాసులోనూ భద్రుని పాత్రలో మెప్పించారు. అందగాళ్లందరూ హీరోలుగానే ఉండాలి. విలన్లంటే మొరటుగా ఉండాలనే రూల్‌ని బ్రేక్ చేశారు శరత్‌బాబు. విలన్ అనగానే ప్రతిసారీ కత్తులూ కటార్లూ పట్టుకోనక్కర్లేదు. దుష్టబుద్ధితో వంచన చేసేవారు కూడా విలన్లే. అలాంటి క్లాసీ విలన్ పాత్రలను స్క్రీన్ మీద అద్భుతంగా ఆవిష్కరించారు శరత్‌బాబు. మానసిక సంఘర్షణ ఉన్న పాత్రలకు పర్ఫెక్ట్ గా సూటయ్యే నటుడనే పేరు తెచ్చుకున్నారు.