Robo Shankar: ప్రముఖ నటుడి హఠాన్మరణం.. రోడ్డుపై డ్యాన్స్ చేసిన భార్య.. వైరల్ వీడియో
ప్రముఖ తమిళ నటుడు రోబో శంకర్ హఠాన్మరణం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ముఖ్యంగా అతని కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ క్రమంలో రోబో శంకర్ భార్య ప్రియాంక నటుడికి వినూత్నంగా నివాళులు అర్పించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

కోలీవుడ్ స్టార్ కమెడియన్, నటుడు రోబో శంకర్ (46) హఠాన్మరణం అందరనీ కలిచివేసింది. లివర్ క్యాన్సర్ తో బాధపడుతోన్న అతను ఒక సినిమా సెట్‌లో స్పృహ తప్పి పడిపోయాడు. చిత్ర బృందం వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తీసుకెళ్లగా గురువారం (సెప్టెంబర్ 18న)చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో నటుడి కుటుంబ సభ్యులందరూ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తమిళనాడు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, నటుడు ధనుష్, శివకార్తికేయన్ తదితర రాజకీయ, సినీ ప్రముఖులు రోబో శంకర్ ఇంటికెళ్లి అతని భౌతిక కాయానికి నివాళులర్పించారు. అలాగే మక్కళ్ నీది మయ్యం పార్టీ నేత కమలహాసన్, అన్నాడీఎంకే అధ్యక్షుడు పళనిస్వామి తదితరులు సోషల్ మీడియా వేదికగా ప్రగాఢ సంతాపం తెలిపారు రోబో శంకర్ భౌతిక కాయానికి శుక్రవారం (సెప్టెంబర్ 19) సాయంత్రం స్థానిక వలసరవాక్కంలోని శ్మశానంలో అంత్యక్రియలు జరిగాయి. ఈ సందర్భంగా నటుడికి వినూత్నంగా నివాళి అర్పించింది భార్య ప్రియాంక. మనసులోని ఆవేదనను డ్యాన్స్ రూపంలో వ్యక్తం చేసింది. రోబో డ్యాన్స్‌తోనే బాగా ఫేమస్ అయ్యాడు శంకర్. ఆ తర్వాత అతని పేరు రోబో శంకర్ గా స్థిర పడిపోయింది. ఈ క్రమంలోనే తన భర్త భౌతిక కాయం వెంట డ్యాన్స్ చేస్తూ నివాళి అర్పించింది ప్రియాంక. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన వారందరూ కన్నీరుమున్నీరవుతున్నారు. దేవుడు ఆమెకు మనో ధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నారు.
రోబో శంకర్ భార్య కూడా యాక్టరే. 2020లో ‘కన్ని మేడమ్’ సినిమాలో నటించిన ప్రియా శంకర్, కుక్కింగ్ రియాల్టీ షో ‘కుక్ విత్ కోమలీ సీజన్ 1’లోనూ పాల్గొంది. అలాగే ‘కలక్క పోవతు యారు సీజన్ 8’లో ఫైనలిస్టుగా నిలిచింది. ఇక సోషల్ మీడియాలో ప్రియాంక శంకర్‌కి దాదాపు 2.5 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇక కుమార్తె ఇంద్రజా శంకర్ మన తెలుగు ఆడియెన్స్ కు కూడా బాగా పరిచయమే.
2019లో విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరెకెక్కిన ‘బిగిల్’ (తెలుగులో ‘విజిల్’)మూవీలో ఇంద్రజా శంకర్ ఓ కీలక పాత్రలో నటించింది. అందులో గుండమ్మగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో విశ్వక్ సేన్ ‘పాగల్’ మూవీలో నూ, కార్తీ నటించిన ‘విరూమాన్’ సినిమాల్లోనూ కీలక పాత్రల్లో ఇంద్రజ యాక్ట్ చేసింది. సినిమాల్లో బిజీగా ఉండగానే గతేడాది మార్చిలో తన చిన్ననాటి స్నేహితుడ కార్తీక్ ను పెళ్లి చేసుకుంది ఇంద్రజ. చెన్నైలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఏడాది జనవరిలో ఈ దంపతులకు ఒక పండంటి బాబు పుట్టాడు. ఈ ఆనందంలో ఉండగానే రోబో శంకర్ కన్నుమూశాడు.
రోబో శంకర్ అంత్యక్రియల్లో డ్యాన్స్ చేస్తోన్న భార్య ప్రియాంక.. వీడియో..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








