ఆ హీరోకు పురాణాలపై, కథలపై అపారమైన జ్ఞానం ఉండేది.. ఫ్రెండ్స్ అంటే ఆయన ప్రాణం
ఓ స్టార్ హీరోతో తన అనుబంధాన్ని పంచుకున్నారు ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. ఆయన వ్యక్తిత్వం, స్నేహితుల పట్ల చూపిన ప్రేమ, విలువలతో కూడిన జీవితం, వృత్తిపట్ల ఆయన నిబద్ధత, అలాగే కొన్ని ప్రత్యేకమైన సంఘటనలను భరద్వాజ గుర్తు చేసుకున్నారు. ఇవి ఆయనకు నటుడిగానే కాకుండా ఒక మంచి మనిషిగా ప్రత్యేక గుర్తింపును తెచ్చాయని అన్నారు.

రెబెల్ స్టార్, మాజీ కేంద్రమంత్రి కృష్ణంరాజు ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, ఆయనతో తన సుదీర్ఘ అనుబంధాన్ని, అనేక స్మృతులను పంచుకున్నారు. కృష్ణంరాజు గారు అద్భుతమైన నటుడిగానే కాకుండా, ఉన్నతమైన వ్యక్తిత్వంతో జీవించిన మహానుభావుడని భరద్వాజ వివరించారు. అలాగే తొలి రోజుల్లో సినిమా అవకాశాల కోసం స్ట్రగుల్ అవుతున్నప్పుడు, కృష్ణంరాజు గారు తోటి నటుల పట్ల విశేషమైన దయ చూపేవారట. “నేను బానే ఉన్నాను కదా, చంద్రమోహన్ కష్టాల్లో ఉన్నాడు, అతనికి వేషాలు ఇవ్వండి” అని చెప్పిన ఆయన ఔదార్యం ఎంత గొప్పదో తమ్మారెడ్డి భరద్వాజ గుర్తు చేసుకున్నారు. అప్పట్లో కృష్ణ, శోభన్ బాబులతో పాటు ఆయన కూడా మూడో టాప్ స్టార్ గా ఎదిగారని, తన సొంత బ్యానర్ గోపీకృష్ణలో అనేక క్లాసిక్ చిత్రాలను నిర్మించారని భరద్వాజ అన్నారు. కృష్ణంరాజు గారు తన వృత్తిలో కొన్ని ప్రత్యేక నియమాలను పాటించేవారు.
కృష్ణంరాజు గారిపై పాటలు అంతగా పండవని తాను మొదట భావించానని, అయితే “చిన్ననాటి కలలు” లో “ఎలా తెలుపను” వంటి పాటలు సూపర్ హిట్ కావడంతో తన అభిప్రాయం తప్పని నిరూపితమైందని భరద్వాజ నవ్వుతూ చెప్పారు. ఆయనకు పురాణాలపై, కథలపై అపారమైన జ్ఞానం ఉండేదని “కన్నప్ప” వంటి కథలను వివరించేటప్పుడు అర్థమైందని తెలిపారు. స్నేహితుల పట్ల కృష్ణంరాజు గారికి అపారమైన ఆప్యాయత ఉండేది. “అమరదీపం” సినిమా విడుదలైనప్పుడు, భారీ వర్షం కారణంగా థియేటర్‌లో జనం రారేమోనని, తమ్మారెడ్డి భరద్వాజకు నష్టం వస్తుందేమోనని ఆయన చూపిన ఆందోళన, ఆయన గొప్ప మానవతా విలువలకు నిదర్శనం. ఒక సాధారణ హీరో తన సినిమా హిట్ అవుతుందని అంటాడని, కానీ కృష్ణంరాజు గారు మాత్రం “నీ పెట్టుబడికి నష్టం వస్తుందేమో” అని ఆలోచించారని భరద్వాజ గుర్తు చేసుకున్నారు.
రాజకీయాల్లోకి రావడం ఆలస్యమైనా, కేంద్రమంత్రిగా రెండుసార్లు ఎం.పి.గా సేవ చేసినా, ఆయనపై ఎప్పుడూ ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవని భరద్వాజ స్పష్టం చేశారు. సొంత అవసరం కోసం కాకుండా, ప్రజాసేవ కోసమే ఆయన రాజకీయాల్లోకి వచ్చారని, స్వతహాగా మంచి మనిషి కాబట్టే ఆయన ఎలాంటి మరకలు లేకుండా రాజకీయ జీవితాన్ని కొనసాగించారని ఆయన ప్రశంసించారు. షూటింగ్‌లకు పంక్చువల్‌గా వచ్చేవారు కానీ, డబ్బింగ్ విషయంలో మాత్రం కొంచెం బద్దకస్తులని, “గొంతు పోయింది” అంటూ వాయిదా వేసేవారని సరదాగా గుర్తు చేసుకున్నారు. కృష్ణంరాజు గారు గొప్ప భోజనప్రియుడని, అంతేకాకుండా తోటివారికి తినిపించడం ఆయనకు అలవాటని భరద్వాజ చెప్పారు. అయ్యప్పమాల వేసినప్పుడు, పడిపూజల సమయంలో వాళ్ళ ఆఫీస్‌లో ఎన్నో రకాల టిఫిన్లు ఉండేవని, వాటిని తినడానికి పిలవకపోయినా తాము వెళ్ళిపోయేవాళ్ళమని అన్నారు. ప్రభాస్ కూడా కృష్ణంరాజు గారిలాగే సెట్‌లో అందరికీ భోజనం పెట్టే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారని, ఇది ఒక రకమైన వారసత్వమని భరద్వాజ తెలిపారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




