Irumudi: అయ్యో.. ఎంత పనైంది! చూస్తుండగానే వరదల్లో కొట్టుకుపోయిన ‘ఇరుముడి’ బ్రిడ్జి.. వీడియో వైరల్
మాస్ మహారాజా రవితేజ నటించిన 'ఇరుముడి' సినిమా కారణంగా ఈ జలపాతాన్ని సందర్శించే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. అంతకు ముందు ఇక్కడికి కేవలం వందల సంఖ్యలో వచ్చే పర్యాటకులు ఇరుముడి సినిమా తర్వాత వేల సంఖ్యలో టూరిస్టులు ఇక్కడికి వస్తున్నారు.

మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ సినిమా ‘ఇరుముడి’. శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ డివోషినల్ థ్రిల్లర్ తెలుగు రాష్ట్రాల్లో ఎంత సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత నెలలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రూ.250 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అంతేకాదు తెలుగులో అత్యధిక లాభాలు తీసుకొచ్చిన సినిమాల్లో ఒకటిగా ఇరుముడి నిలిచింది. ఇక ఇటీవలే ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా ఇక్కడ కూడా రికార్డులు బద్దలు కొడుతోంది. ఇండియాతో పాటు విదేశాల్లోనూ టాప్ లో ట్రెండ్ అవుతోంది. కాగా ఇరుముడి సినిమాలోని కొన్ని సన్నివేశాలను అల్లూరి జిల్లా చింతూరు మండలంలోని పొల్లూరు జలపాతం దగ్గర తీశారు. ఈ ప్రాంతం ప్రకృతి అందాలకు నిలయంగా పేరుంది. ఈ నేపథ్యంలో ఇరుముడి సినిమా విడుదలైన తర్వాత ఈ ప్రదేశానికి పర్యాటకుల రాక గణనీయంగా పెరిగింది. గతంలో వందల సంఖ్యలో మాత్రమే వచ్చేవాళ్లు కాస్త ఇప్పుడు వేల సంఖ్యలో తరలివస్తున్నారు. ముఖ్యంగా పొల్లూరు జలపాతం దగ్గర షూటింగ్ కోసం ఏర్పాటు చేసిన చెక్క బ్రిడ్జి పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంది.
ఇదిలా ఉంటే ఇటీవల అల్లూరి జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో కొండవాగుల నుంచి భారీగా వరదనీరు వస్తుండటంతో పొల్లూరు జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో జలపాతం వద్ద ఏర్పాటు చేసిన బ్రిడ్జి వరద తాకిడికి కుప్పకూలిపోయింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. వీటిని చూసి పొల్లూరు వచ్చే పర్యాటకులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జి ఉన్న సమయంలో తీసుకున్న ఫొటోలు, వీడియోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇరుముడి సినిమా విషయానికి వస్తే.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఇరుముడి సినిమాను నిర్మించారు. రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించగా, కూతురిగా బేబీ నక్షత్ర క్యూట్ యాక్టింగ్ తో మెప్పించింది. సాయికుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక తదితరులు కీలక పాత్రలు పోషించారు. జీవీ ప్రకాశ్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో టాప్ లో ట్రెండ్ అవుతోంది.
వీడియో ఇదిగో..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




