
మాస్ మహారాజ రవితేజ త్వరలో మాస్ జాతర అనే ఊర మాస్ సినిమాతో రాబోతున్నాడు. కొత్త దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ ఊర మాస్ ఎంటర్ టైనర్ అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో సినిమా ప్రమోషన్లలో స్పీడ్ పెంచాడు రవి తేజ. తనే స్వయంగా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు . ఈ నేపథ్యంలో లక్కీ భాస్కర్ మూవీ డైరెక్టర్ వెంకీ అట్లూరితో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. అలాగే తన కుమారుడు, కూతురు గురించి కూడా చెప్పుకొచ్చాడు. రవి తేజ కుమారుడు మహాధన్ గతంలో రాజా ది గ్రేట్ సినిమాలో ఛైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు. రవితేజ చిన్నప్పటి పాత్రలో కనిపించాడు. అయితే ఆ తర్వాత చదువుకు ప్రాధాన్యమివ్వడంతో మళ్లీ కెమెరా ముందుకు రాలేదు. అయితే రవితేజ లాగే మహాధన్ కూడా సినిమా హీరో అయిపోతాడని అభిమానులు అనుకుంటున్నారు.
రవితేజ కొడుకు మహాధన్ గతంలో రాజా ది గ్రేట్ సినిమాలో రవితేజ చిన్నప్పటి పాత్రలో నటించాడు. దీంతో మహాధన్ కూడా హీరో అవుతాడని అందరూ అనుకుంటున్నారు. ఇప్పుడిదే విషయమై డైరెక్టర్ వెంకీ అట్లూరి ఒక ఆసక్తికర విషయం చెప్పాడు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో తాను తెరకెక్కిస్తున్న సినిమాకు రవితేజ కొడుకు మహాధన్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడన్న విషయాన్ని బయట పెట్టాడు. ‘మహాధన్ చిన్నప్పటి నుంచి సినిమా సెట్స్ లోనే పెరిగాడు. అతనితో ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. చాలా న్యాచురల్ గా పని చేసుకుంటూ పోతాడు’ అని చెప్పుకొచ్చాడు వెంకీ అట్లూరి.
ఇక ఇదే ఇంటర్వ్యూలో రవితేజ తన కూతురు గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. మోక్షద ఓ పక్క రవితేజ మల్టీప్లెక్స్ ఏఆర్ టీ బాధ్యతలు చూసుకుంటూనే, మరో పక్క ఓ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేస్తుందట. అంతేకాదు త్వరలోనే రవితేజ పేరు మీద గానే ఓ ప్రొడక్షన్ హౌస్ ను ప్రారంభించి సినిమాలు నిర్మిస్తుందట. మొత్తానికి రవితేజ పిల్లలిద్దరూ సినిమా ఇండస్ట్రీలోనే సెటిల్ అవ్వనున్నారన్నమాట. అయితే రవితేజ తన కుమారుడి, కూతురు ఫొటోలు బయటకు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.