‘నేను ఆరు భాషలు మాట్లాడగలను’! పవన్ కళ్యాణ్ కోసం కథ వినకుండానే ఆ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చానంటున్న స్టార్ హీరోయిన్
ఆమె ఒకప్పుడు కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం అనుకున్నారు.. కానీ తన అద్భుతమైన నటనతో ఆ మాటను తప్పని నిరూపించింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ‘ఊహలు గుసగుసలాడే’ అంటూ ఎంట్రీ ఇచ్చి, నేడు సౌత్ నుంచి నార్త్ వరకు బిజీ హీరోయిన్‌గా ఎదిగింది.

సాధారణంగా హీరోయిన్లు తమ మాతృభాషకే ప్రాధాన్యత ఇస్తారు, ఇతర భాషల్లో నటించినప్పుడు కేవలం మేనేజర్ల మీద ఆధారపడతారు. కానీ ఈ ముద్దుగుమ్మ మాత్రం ఒక అడుగు ముందుకు వేసి ఏకంగా ఆరు భాషల్లో ప్రావీణ్యం సంపాదించింది. అంతేకాదు, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేంజ్ ఏంటో తెలియక ముందే ఆయన కోసం ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. షూటింగ్ స్పాట్‌లో ‘పవనిజం’ టీ షర్టులు చూసి ఆమెకు మైండ్ బ్లాక్ అయిందట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ఆమెకు తెలిసిన ఆ ఆరు భాషలు ఏంటి? పవన్ సినిమా గురించి ఆమె బయటపెట్టిన ఆసక్తికర సీక్రెట్స్ ఏంటో తెలుసుకుందాం..
అరుదైన రికార్డ్..
హీరోయిన్ రాశీ ఖన్నా కేవలం అందగత్తె మాత్రమే కాదు, మంచి తెలివైన నటి కూడా. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు ఆరు భాషలపై పట్టు ఉందని గర్వంగా చెప్పుకొచ్చింది. “నాకు భాషలు నేర్చుకోవడం ఒక హాబీ. హిందీ, ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళం ఇప్పుడు అనర్గళంగా మాట్లాడగలను. తాజాగా పంజాబీ కూడా నేర్చుకున్నాను. అలాగే నాకు కొంచెం బెంగాలీ కూడా తెలుసు” అని వెల్లడించింది. ప్రేక్షకుల మనసు గెలవాలంటే వారు మాట్లాడే భాష తెలిసి ఉండాలని, అందుకే తాను ఏ భాషలో నటిస్తే ఆ భాషను నేర్చుకుంటానని ఆమె స్పష్టం చేసింది.
కథ వినకుండానే..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి రాశీ ఖన్నా మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకుంది. “పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో నటించే అవకాశం రాగానే కథ కూడా వినకుండా ఓకే చెప్పేశాను. కేవలం పవన్ కోసం మాత్రమే ఆ నిర్ణయం తీసుకున్నాను. షూటింగ్ సమయంలో వేలాది మంది అభిమానులు ‘పవనిజం’ రాసి ఉన్న టీ షర్టులు ధరించి రావడం చూసి ఆశ్చర్యపోయాను. ఆయనకు ఉన్న డెడికేటెడ్ ఫ్యాన్ బేస్ చూసి నాకు మతిపోయింది” అని రాశీ ఖన్నా పేర్కొంది.

Raashi Khanna.1
భాషా భేదం లేకుండా భారతీయ సినిమాకు సేవలందించాలని కోరుకుంటున్న రాశీ ఖన్నా తన డ్రీమ్ డైరెక్టర్ల గురించి కూడా వెల్లడించింది. సంజయ్ లీలా భన్సాలీ సినిమాల్లో మహిళా పాత్రలకు ఇచ్చే ప్రాధాన్యత అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆయన దర్శకత్వంలో కనీసం ఒక్క పాటలోనైనా నటించాలని ఉందని ఆకాంక్షించింది. అలాగే దర్శకధీరుడు రాజమౌళి, రిషబ్ శెట్టిల జాబితాలో కూడా తాను ఉన్నట్లు తెలిపింది. కేవలం డైరెక్టర్లే కాదు, బాలీవుడ్ హీరోలు రణబీర్ కపూర్, విక్కీ కౌశల్ ఎంచుకునే విభిన్నమైన కథలంటే తనకు ఎంతో క్రేజ్ అని, వారితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉందని మనసులో మాట బయటపెట్టింది.
సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేస్తారని, భాషా భేదాలు తనను ఏమాత్రం ప్రభావితం చేయవని రాశీ ఖన్నా తెలిపింది. నటిగా తనకు సవాలు విసిరే పాత్రలు చేయడమే లక్ష్యమని చెప్పుకొచ్చింది. ఆమె నటించిన ‘ఇమైక్క నోడిగల్’, ‘అడంగ మారు’ వంటి సినిమాలు ఇప్పటికే ఆమెలోని నటిని నిరూపించాయి. రాబోయే రోజుల్లో మరిన్ని భాషల్లో, వైవిధ్యమైన పాత్రల్లో రాశీ ఖన్నా మెరవాలని అభిమానులు కోరుకుంటున్నారు. భాషా ప్రావీణ్యంతో పాటు పవన్ కళ్యాణ్ పట్ల ఆమెకున్న గౌరవం రాశీ ఖన్నాను మిగతా హీరోయిన్ల కంటే ప్రత్యేకంగా నిలబెట్టింది.
