AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ సమాధిని చెప్పులు, బూట్లు, రాళ్లతో కొడతూనే ఉన్నారు..! 900 ఏళ్ల చరిత్ర వెనక రహస్యం ఇదే

900 ఏళ్లుగా ప్రజలు ఓ ప్రాచీన సమాధి (మజార్)ని బూట్లు, చెప్పులు, రాళ్లతో కసితీరా కొట్టి పండగ చేసుకుంటారు. ఇంతటి అవమానాన్ని ఎదుర్కొంటున్న ఆ మజార్‌ను 'చాడీకోరు సమాధి' అని పిలుస్తుంటారు. చనిపోయాక కూడా అవమాన భారాన్ని మోస్తున్న ఈ చాడీకోరు ఎవరు? అతడు చేసిన దేశ ద్రోహం ఏమిటి? ఇప్పుడు తెలుకుందాం.

ఆ సమాధిని చెప్పులు, బూట్లు, రాళ్లతో కొడతూనే ఉన్నారు..! 900 ఏళ్ల చరిత్ర వెనక రహస్యం ఇదే
Samadhi
Rajashekher G
|

Updated on: Jan 28, 2026 | 9:27 AM

Share

జీవితంలో వ్యక్తులు చేసిన మంచి చెడు పనులే వారు చనిపోయాక వారికి గౌరవం ఇవ్వాలా? లేదా అవమానించాలా? అనేది నిర్ణయిస్తాయి. ప్రజలకు, దేశానికి సేవ చేసిన వ్యక్తులకు చనిపోయిన తర్వాత కూడా ఎంతో గౌరవం ఇవ్వడం జరుగుతుంది. వారి సమాధులకు దగిన గౌరవం, గుర్తింపు ఉంటుంది. కానీ, చెడు పనులు చేసినవారికి ఎలాంటి గౌరవం ఇవ్వడం జరగదు. వారు చనిపోయిన రోజును పండగలా చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి ఒక సంఘటనలు చాలానే ఉన్నాయి మనదేశంలో. ఇప్పుడు ఒక ప్రత్యేక సమాధి గురించి తెలుసుకుందాం. 900 ఏళ్లుగా ప్రజలు ఓ ప్రాచీన సమాధి (మజార్)ని బూట్లు, చెప్పులు, రాళ్లతో కసితీరా కొట్టి పండగ చేసుకుంటారు. ఇంతటి అవమానాన్ని ఎదుర్కొంటున్న ఆ మజార్‌ను ‘చాడీకోరు సమాధి’ అని పిలుస్తుంటారు. చనిపోయాక కూడా అవమాన భారాన్ని మోస్తున్న ఈ చాడీకోరు ఎవరు? అతడు చేసిన దేశ ద్రోహం ఏమిటి? ఆ చాడీకోరు గురించి ప్రచారంలో ఉన్న ప్రధాన కథలేంటి? చరిత్రకారులు, స్థానికులు ఏమంటున్నారు? ఇప్పుడు తెలుకుందాం.

చాడీకోరు..

ఇతరులపై ఉన్నవి లేనట్లుగా.. లేనివి ఉన్నట్లుగా చెప్పేవారిని చాడికోరులు అంటారు. నమ్మిన వ్యక్తులను మోసం చేసేవారు ఈ చాడీకోరులు. నమ్మకం కోల్పోయిన మనిషికి అవమానమే ఎదురవుతుంది. మొదటి కథనం గురించిన వివరాల్లోకి వెళితే.. ఉత్తర్​‌ప్రదేశ్‌లోని ఇటావా జిల్లా దాతావలి గ్రామం ఫ్రెండ్స్ కాలనీ పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న చాడీకోరు భోలన్ సయ్యద్ సమాధే అందుకు నిదర్శనం. ఈ సమాధి వద్దకు భారీగా జనం వస్తుంటారు.

ఘోరీకి గూఢచర్యం చేసి..

ఉత్తర్ ప్రదేశ్‌లోని ఇటావా జిల్లా దాతావలి గ్రామ సమీపంలో ఉన్న “చాడీకోరు సమాధి” నేటికీ ప్రజల్లో ఆసక్తి, వివాదాలకు కారణమవుతోంది. 1194లో జరిగిన చందావర్ యుద్ధంలో మహ్మద్ ఘోరీకి అనుకూలంగా గూఢచర్యం చేసిన వ్యక్తి(భోలన్ సయ్యద్) సమాధి ఇదేనని కొంతమంది చరిత్రకారులు చెబుతున్నారు.

చరిత్రకారుడు శైలేంద్ర శర్మ కథనం ప్రకారం.. రాజా జైచంద్–మహ్మద్ ఘోరీ మధ్య జరిగిన యుద్ధంలో ఒక చాడీకోరు కీలక పాత్ర పోషించాడట. ఫకీరు వేషంలో రాజా సుమేర్ సింగ్ సైనిక వివరాలు సేకరించి ఘోరీకి చేరవేశాడని ప్రచారం ఉంది. దీంతో రాజా సుమేర్ సింగ్ యుద్ధంలో ఓటమిపాలయ్యారు. అనేక మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అయితే దీనికి పక్కా ఆధారాలు లేవు.

స్థానిక కథనాల ప్రకారం.. రాజ్యానికి ద్రోహం చేసిన ఆ వ్యక్తిని మరణశిక్ష అనంతరం రోడ్డుపక్కనే ఖననం చేశారని, ప్రజలు అతడిని అవమానించేందుకు సమాధిపై చెప్పులు విసిరే సంప్రదాయం ప్రారంభించారని చెబుతున్నారు. ఈ సంప్రదాయం 900 ఏళ్ల నుంచి నేటికీ కొనసాగుతోంది.

భోలన్ సయ్యద్, రెండు సమాధుల మిస్టరీ!

మరో కథనం ప్రకారం.. మహ్మద్ ఘోరీ దండయాత్రల కాలంలో భోలన్ సయ్యద్ అనే వ్యక్తి చాడీకోరుగా వ్యవహరించేవాడని చెబుతుంటారు. అతడి సమాధి నీలకంఠ ఆలయం వెనుక ఉందని అంటారు. అయితే చాడీకోరు సమాధి ఇటావా పట్టణం నుంచి 5 కిలోమీటర్ల దూరంలోని దాతావలి గ్రామం సమీపంలో ఉంది. ఒకే వ్యక్తికి(భోలన్ సయ్యద్‌కు) రెండు సమాధులు ఉండే అవకాశం లేదు. వీటిలో ఏది భోలన్ సయ్యద్‌ సమాధి? అనే విషయంపై నేటికీ స్పష్టత లేదు.

అయితే కొందరు రంజాన్, బక్రీద్ వంటి రోజుల్లో సయ్యద్ సమాధి వద్ద చాదర్ సమర్పించడం, ధూపం వెలిగించడం కూడా చేస్తుంటారు. సరైన చారిత్రక ఆధారాలు లేకపోయినప్పటికీ.. ఈ చాడీకోరు సమాధి ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని కొందరు స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

కాగా, ఇదే తరహాలో పంజాబ్‌ రాష్ట్రంలో నూరుద్దీన్ అనే వ్యక్తి సమాధిపైకి నేటికీ ప్రజలు చెప్పులను విసురుతుంటారు. అతడు గురు గోవింద్ సింగ్‌పై గూఢచర్యం చేశాడని చెబుతారు. అందుకే అతడి సమాధిని చెప్పులతో కొట్టి అవమానిస్తుంటారు. భారతీయ సమాజం గూఢచారులను, దేశద్రోహులను గౌరవించదు. ఇందుకు నిదర్శనాలే ఈ సమాధులు.