ప్రేమ కథా సినిమాల్లో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది ప్రేమమ్. మలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచన ఈ ఫీల్ గుడ్ లవ్ ఎంటర్‌టైనర్ తెలుగుతో సహా పలు భాషల్లోనూ రీమేక్‌గా వచ్చింది. తెలుగులో అక్కినేని నాగ చైతన్య, శ్రుతి హాసన్ జంటగా ‘ప్రేమమ్’ పేరుతో వచ్చి ఇక్కడ కూడా సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా మాతృకను తెరకెక్కించి మాలీవుడ్‌లో క్రేజీ డైరెక్టర్‌గా మారిపోయారు అల్ఫోన్స్ పుత్రేన్. ప్రేమమ్ తర్వాత (2016), గోల్డ్ (2022), గిఫ్ట్ (2023) వంటి సినిమాలతో మాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్‌గా గుర్తింపు పొందారు. అయితే గత కొన్ని రోజులుగా డైరెక్టర్ అల్ఫోన్స్ సినిమాలను చాలా ఆలస్యంగా పూర్తి చేస్తున్నాడని విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రేమమ్ డైరెక్టర్ ఇప్పుడు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి సినిమాలు చేయనని ప్రకటించారు. ఈ వార్త విని ఆయన అభిమానులు షాక్ అవుతున్నారు. అల్ఫోన్స్ తీసుకున్న ఈ షాకింగ్ నిర్ణయానికి కారణం ఆయన అనారోగ్యమే. చాలా మందికి ఇష్టమైన దర్శకుడిగా ఎదిగిన ఆయన ఇండస్ట్రీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకోవడం అభిమానులను కలిచివేసింది. అలాగే డైరెక్టర్ ఆరోగ్యంపై ఆందోళన మొదలైంది. కాగా తన ఆరోగ్య పరిస్థితి గురించి అల్ఫోన్స్ పుత్రన్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ‘నా సినిమా కెరీర్‌ను ఆపేస్తున్నాను. నాకు అటిజం స్పెక్ర్టమ్ డిజార్డర్ ఉందని ఇటీవలే తెలిసింది. అందుకే నేను ఎవరికీ భారంగా ఉండాలనుకోను. ఇకపై పాటలు, వీడియోలు, షార్ట్ ఫిల్మ్స్ మాత్రమే చేస్తాను. సినిమా ఇండస్ట్రీని వదిలేయాలని లేదు. కానీ నాకు వేరే మార్గం లేదు. నేను నిలబెట్టుకోలేని వాగ్దానాలు చేయడం నాకు ఇష్టం లేదు. ఆరోగ్యం బలహీనంగా ఉన్నప్పుడే జీవితం ఇంటర్వెల్ పంచ్ లాంటి ట్విస్ట్ ఇచ్చింది’ అని ఎమోషనల్‌గా రాసుకొచ్చారు ప్రేమమ్ డైరెక్టర్.
ప్రస్తుతం అల్ఫోన్స్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పోస్ట్‌ను చూసి అభిమానులు, నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ‘దయచేసి సరైన చికిత్స తీసుకోండి. మీకు చాలా ట్యాలెంట్ ఉంది. మీరు సినిమాలకు డైరెక్షన్ చేయాలి’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ‘మంచి వైద్యులను సంప్రదించండి. చికిత్స తీసుకోండి. డైరెక్షన్ నుంచి తప్పుకున్నా ఫర్వాలేదు. మీ నిర్ణయాన్ని మేము గౌరవిస్తున్నాం’ అని అభిమానులు రాసుకొచ్చారు. అయితే షేర్ చేసిన కొన్ని గంటల్లోపే అల్ఫోన్స్ పుత్రన్ తన పోస్ట్‌ను తొలగించారు. మరి ఈ స్టార్ డైరెక్టర్ తన నిర్ణయాన్ని మార్చుకుంటారేమో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..