AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ తరం ఈయన గురించి తెలుసుకోవాలి.. టాలీవుడ్ టాప్ యాక్టర్స్ తండ్రి…

పాత సినిమాలను పరిశీలనగా చూసేవారికి బాగా గుర్తుండే నటుడు పి.జె.శర్మ. లాయర్‌గా, జడ్జిగా వంటి ఎన్నో పాత్రలతో పాటు ఎం.జి.ఆర్, శివాజీగణేశన్‌లకు డబ్బింగ్ చెప్పి గంభీరమైన గొంతుతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. సాయికుమార్, రవిశంకర్, అయ్యప్ప పి. శర్మ వంటి ప్రతిభావంతులైన కుమారులను సినిమా రంగానికి అందించిన పి.జె.శర్మ జీవిత విశేషాలను ఈ కథనంలో చూడండి.

ఈ తరం ఈయన గురించి తెలుసుకోవాలి.. టాలీవుడ్ టాప్ యాక్టర్స్ తండ్రి...
P.J. Sarma
Ram Naramaneni
|

Updated on: Sep 09, 2026 | 4:13 PM

Share

పాత సినిమాలను నిశితంగా పరిశీలనగా చూసేవారికి బాగా గుర్తుండే నటుడు పి.జె.శర్మ. తెరమీద లాయర్‌గా, జడ్జిగా, పోలీస్ అధికారిగా ఓ పెద్దమనిషి పాత్రల్లో ఆయన అభినయం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కేవలం నటుడిగానే కాకుండా, ఎం.జి.ఆర్, శివాజీగణేశన్‌, నంబియార్, మనోహర్, అశోకన్‌ వంటి తమిళ హీరోలు, విలన్లకు తన గంభీరమైన గొంతుతో తెలుగులో డబ్బింగ్ చెప్పి డబ్బింగ్ కళకు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిన ప్రతిభావంతుడు పి.జె.శర్మ. ఆయన కుటుంబ నేపథ్యం కూడా చిత్ర పరిశ్రమతో విడదీయరానిది. డబ్బింగ్ కళకు హీరో ఇమేజ్ తెచ్చిపెట్టిన సాయికుమార్ పి.జె.శర్మ పెద్దకుమారుడు. ఇక వదల బొమ్మాళీ నిన్ను వదలా అంటూ తన స్వరంతో భయపెట్టిన రవిశంకర్ ఆయన రెండవ కుమారుడు. కేజీఎఫ్ వంటి చిత్రాల్లో నటించిన అయ్యప్ప పి. శర్మ ఆయన మూడవ కుమారుడు. ఇలా చిత్ర పరిశ్రమకు అంకితమైన కుటుంబానికి మూలపురుషుడు పి.జె.శర్మ. శర్మ  పూర్తి పేరు పూడిపెద్ది జోగీశ్వర శర్మ. ఆయన 1933 మే 24న విజయనగరం జిల్లా కళ్లేపల్లిలో జన్మించారు. విజయనగరంలో చదువుకున్నారు. 12వ ఏట నుంచే రంగస్థల అనుభవం కలిగిన ఆయన, ప్రముఖ రచయిత ఆరుద్రకు దగ్గర బంధువు. జే.వి.సోమయాజులు, రమణమూర్తి బృందంలో చేరి కన్యాశుల్కం, కాటమరాజు వంటి అనేక నాటకాల్లో నటించారు.

యవ్వనంలో ఉంగరాల జుట్టు, పొడగరి, అందగాడు కావడంతో అందరినీ ఇట్టే ఆకర్షించేవారు. నాటకానుభవం ఉన్నవారికి సినిమాల్లో అవకాశాలు లభించే ఆ రోజుల్లో, తను సినిమాల్లో నటించాలని 1958లో మద్రాస్ చేరుకున్నారు పి.జె.శర్మ. మద్రాసులో కళాకారుల అడ్డగా పేరుపొందిన పాండీబజార్‌లో నారాయణ కేఫ్, గీతా కేఫ్‌ల వద్ద భవిష్యత్తు గురించి కలలు కనేవారు. అక్కడే నటుడు, రచయిత రావికొండలరావుతో పరిచయం ఏర్పడింది. రావికొండలరావు రాసిన కథ కంచికి నాటకంలో విలన్ వేషం వేసి, కంగుమనే తన కంఠంతో, అభినయంతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ నాటకం ఉత్తమ నాటకంగా ఎన్నికై, మద్రాస్ ఆకాశవాణి కేంద్రం ద్వారా ప్రసారమై ఎంతోమంది శ్రోతల్ని ఆకట్టుకుంది. అప్పటి నుంచి ఆకాశవాణి ప్రసారం చేసే ఎన్నో రేడియో నాటకాల్లో పి.జె.శర్మ పాల్గొన్నారు. కథ కంచికి నాటకాన్ని చూసిన దర్శకుడు కె.వి.రెడ్డి, అందులో నటించిన రాజబాబుకు, పి.జె.శర్మకు ఉమా చండీ గౌరీ శంకరుల కథ చిత్రంలో అవకాశాలు ఇచ్చారు. అలా అప్పటి నుంచి చిన్న, పెద్ద వేషాలు వేస్తూ వచ్చారు. ఆరుద్ర తనకు బంధువు కావడంతో, ఆయన రాసిన పలు డబ్బింగ్ చిత్రాలకు సహాయకుడిగా పనిచేశారు. కొన్ని పాత్రలకు తనే డబ్బింగ్ చెప్పారు. ఆ రోజుల్లో డబ్బింగ్ స్టూడియోల్లో తోటి కళాకారులైన కుమ్మినేని అప్పారావు (తర్వాత చక్రవర్తి), రావికొండలరావు, డబ్బింగ్ సత్యం, కె.వి.ఎస్.శర్మ, వెంపటి రాధాకృష్ణ, మద్దాళి కృష్ణమూర్తిలతో కలిసి గంటల తరబడి తమ వంతు కోసం ఎదురుచూసేవారు. ఇల్లరికం, బంగారు పంజరం, కళ్యాణ మండపం, మానవుడు దానవుడు, మెరుపు వీరుడు వంటి ఎన్నో చిత్రాల్లో గుర్తించదగిన పాత్రలు పోషించారు. అయితే కలెక్టర్ జానకి చిత్రంలో ఆయన పోషించిన కలెక్టర్ పి.ఏ. వేషం ఆయనకు మంచి గుర్తింపు తెచ్చింది. అక్కడి నుంచి ఆయనకు కొంచెం గుర్తింపు ఉన్న వేషాలు దొరికాయి.

తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో దాదాపు 500 చిత్రాల్లో నటించి, ఎందరికో గాత్రదానం చేశారు. శర్మ సతీమణి పేరు కృష్ణజ్యోతి. మైసూర్ మహారాజుల దగ్గర పనిచేసిన కుటుంబం నుంచి వచ్చిన ఆమె, ఈయన కోసం అన్నీ వదులుకొని వచ్చేశారు. నాటకమే వీరిద్దరినీ కలిపింది. ఒకసారి స్టేజి మీద ఓ నాటకంలో శ్రీకృష్ణదేవరాయలుగా శర్మ నటిస్తుంటే చూసి కృష్ణజ్యోతి మనసిచ్చారు. స్నేహితులంతా కలిసి వీరి పెళ్లి జరిపించారు. సంపన్నుల కుటుంబం నుంచి వచ్చినా సర్దుకుపోయి, భర్తతో హాయిగా సంసారం సాగించారు కృష్ణజ్యోతి. వచ్చే అతి తక్కువ డబ్బుతో గుట్టుగా సంసారం నడుపుతూ, పిల్లల్ని తీర్చిదిద్దిన మహా ఇల్లాలు కృష్ణజ్యోతి. చిత్రరంగంలోకి ప్రవేశించి తను అనుకున్నదానిలో సగమే సాధించిన పి.జె.శర్మ, తన కుమారుల ద్వారా తన ఆశయాలను పూర్తి చేసుకున్నారు. ఆయన పెద్దకుమారుడు సాయికుమార్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, నటుడిగా, హీరోగా ఎదిగి 100 శాతం విజయం సాధించారు. సాయికుమార్ తనయుడు ఆది కూడా ఇప్పుడు హీరో అయ్యి విజయాలు సాధిస్తున్నారు. సాయికుమార్ హీరోగా నటించి, నిర్మించిన ఈశ్వర్ అల్లా చిత్రంలో పి.జె.శర్మ విలన్ గా నటించడం విశేషం కాగా, ఆయన చిన్న కుమారుడు అయ్యప్ప ఆ సినిమాకు దర్శకుడు కావడం మరో విశేషం. ఆణిముత్యాల వంటి పిల్లల్ని, అందరితో ఉన్న మైత్రిని వదిలిపెట్టి, 2014 డిసెంబర్ 14న ఈ గంభీర గాత్రధారి పి.జె.శర్మ తుదిశ్వాస విడిచారు. ఆయన జ్ఞాపకాలు, ఆయన అందించిన కళా సేవలు సదా సినీ ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి.

Follow Us