పాముల్లో ఆడ, మగ అని ఎలా కనిపెట్టాలి..? ఈ ట్రిక్స్ తెలిస్తే అవాక్కే..
పాము కనిపించగానే మనకు మొదట వచ్చే ఆలోచన... అది కాటేస్తుందా? విషపూరితమైనదా కాదా? అని మాత్రమే. కానీ ఆ కనిపించిన పాము ఆడదా లేక మగదా అని ఎప్పుడైనా గమనించారా? పాముల రూపాన్ని చూసి అవి ఆడో మగో గుర్తించడం సాధ్యమేనా? స్నేక్ క్యాచర్లు, శాస్త్రవేత్తలు పాము లింగాన్ని చిటికెలో ఎలా కనిపెడతారు? ఈ రహస్యాల వెనుక ఉన్న ఆసక్తికరమైన సైంటిఫిక్ నిజాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రకృతి సృష్టించిన వింత జీవుల్లో పాములు అత్యంత రహస్యమయమైనవి. పాము కనిపిస్తేనే ఆమడదూరం పరిగెట్టేవాళ్లు ఎంతో మంది. అయితే ఎదురుపడిన పాము విషపూరితమైనదా కాదా అని ఆలోచించడమే తప్ప, అది ఆడ పామా లేక మగ పామా అనే సందేహం చాలామందికి రాదు. సాధారణ కంటితో చూస్తే పాములన్నింటి శరీర నిర్మాణం ఒకేలా కనిపిస్తుంది. కానీ శాస్త్రవేత్తలు, స్నేక్ రెస్క్యూయర్లు పాము లింగాన్ని ఎలా నిర్ధారిస్తారో తెలుసా? వాటి వెనుక ఉన్న కొన్ని ఆసక్తికరమైన సైంటిఫిక్ అంశాల గురించి తెలుసుకోవడం ఎంతో అవసరం.
తోక ఆకారం.. స్పష్టమైన తేడా
పాము ఆడదా, మగదా అని ప్రాథమికంగా గుర్తించడానికి నిపుణులు చూసే మొదటి భాగం దాని తోక. పాము పొట్ట భాగం ముగిసి, విసర్జక రంధ్రం మొదలయ్యే ప్రాంతం నుంచే తోక ప్రారంభమవుతుంది.
మగ పాములు: మగ పాముల్లో ప్రత్యుత్పత్తి అవయవాలు తోక లోపలి భాగంలో దాగి ఉంటాయి. అందువల్ల మగ పాము తోక మొదలయ్యే చోట కాస్త లావుగా ఉండి, చివరికి వెళ్లేకొద్దీ నెమ్మదిగా సన్నబడుతుంది. తోక పొడవు కూడా శరీరంతో పోలిస్తే కాస్త ఎక్కువగా ఉంటుంది.
ఆడ పాములు: ఆడ పాములకు ఇలాంటి అవయవాలు లోపల ఉండవు కాబట్టి, వాటి తోక విసర్జక రంధ్రం దాటగానే ఒక్కసారిగా సన్నబడిపోతుంది. మగ పాములతో పోలిస్తే ఆడ పాముల తోక పొడవు తక్కువగా, కాస్త మొద్దుగా కనిపిస్తుంది.
పొలుసుల లెక్కింపు
జీవశాస్త్రవేత్తలు పాము చర్మంపై ఉండే పొలుసులను లెక్కించడం ద్వారా కూడా లింగాన్ని గుర్తిస్తారు. పాము విసర్జక రంధ్రం నుంచి తోక చివరి వరకు ఉండే పొలుసులను సబ్ కాడల్ స్కేల్స్ అంటారు. సాధారణంగా మగ పాములకు తోక పొడవుగా ఉండటం వల్ల ఈ పొలుసుల సంఖ్య ఆడ పాముల కంటే ఎక్కువగా ఉంటుంది.
ప్రొఫెషనల్ పద్ధతులు ప్రోబింగ్ – పాపింగ్
కేవలం కంటి చూపుతోనే కాకుండా, జూ పార్కులు, రీసెర్చ్ సెంటర్లలో కచ్చితమైన నిర్ధారణ కోసం అధునాతన పద్ధతులు ఉపయోగిస్తారు.
ప్రోబింగ్: ఇది ఎక్కువగా పెద్ద పాములకు వాడే పద్ధతి. ప్రత్యేకమైన రౌండ్-టిప్ కలిగిన మెటల్ స్టిక్‌ను పాము క్లోయెకా రంధ్రంలోకి సున్నితంగా పంపిస్తారు. అది లోపలికి ఎక్కువ లోతుగా వెళ్తే దానిని మగ పాముగా, కొద్దిగా మాత్రమే వెళ్తే ఆడ పాముగా గుర్తిస్తారు.
పాపింగ్: ఈ పద్ధతిని ప్రధానంగా చిన్న పాము పిల్లలకు ఉపయోగిస్తారు. తోక మొదట్లో చేతి వేళ్లతో సున్నితంగా ఒత్తిడి తీసుకురావడం ద్వారా అవయవాల ఉనికిని గమనిస్తారు.
