
‘జిన్నా’ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న మంచు విష్ణు లేటెస్ట్‌గా తన డ్రీమ్‌ప్రాజెక్టును ప్రారంభించిన సంగతి తెలిసిందే. ముక్కంటి క్షేత్రమైన శ్రీకాళహస్తిలో ప్రత్యేక పూజలు నిర్వహించి మరీ కన్నప్ప సినిమాను పట్టాలెక్కించారు. అయితే షూటింగ్ ఇంకా ప్రారంభం కాకముందే ఈ సినిమాకు పెద్ద దెబ్బ తగిలింది. కన్నప్ప సినిమా నుంచి హీరోయిన్ నుపుర్ సనన్ తప్పుకుంది. హీరో మంచు విష్ణునే సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని ప్రకటించాడు. ‘ మా సినిమాకు డేట్స్ సర్దుబాటు చేయడంలో సమస్యలు తలెత్తడం వల్ల హీరోయిన్ నుపుర్ సనన్ మా ప్రాజెక్ట్ నుంచి వైదొలిగారు. ఈ విషయం చెబుతున్నందుకు బాధగా ఉంది. ఆమెను మేము ఎంతో మిస్ అవుతున్నాం. అలాగే కొత్త హీరోయిన్ కోసం వెతుకులాట మొదలు పెట్టాం. నుపుర్ సనన్ నటిస్తోన్న ఇతర ప్రాజెక్టులన్నీ మంచి విజయాన్ని అందుకోవాలని మనసారా కోరుకుంటున్నాం. త్వరలోనే మేమిద్దరం కలిసి మళ్లీ పని చేసే అవకాశం వస్తుందని ఆశిస్తున్నాను. ఆసక్తికరమైన రోజులు ముందు రానున్నాయి. అప్‌డేట్స్ కోసం వేచి చూడండి’ అని ట్విట్టర్‌లో రాసుకొచ్చారు మంచు విష్ణు. దీంతో ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఉన్నట్లుండి మంచు విష్ణు సినిమా నుంచి నుపుర్ తప్పుకోవడానికి కారణాలేంటా? అని ఆరా తీస్తున్నారు.
కాగా నుపుర్ సనన్ మరెవరో కాదు.. ప్రభాస్ ఆదిపురుష్ సినిమాలో జానకిగా నటించిన కృతి సనన్ సోదరే. గతంలో మహేష్ బాబుతో కలిసి వన్, నాగచైతన్యతో కలిసి దోచేయ్ సినిమాల్లో నటించింది కృతి. ఇక అక్క బాటలోనే పయనిస్తోన్న నుపుర్ సనన్ హిందీలో ఇప్పటికే చాలా సినిమాలు చేస్తోంది. అక్షయ్ కుమార్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇక రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాతో త్వరలోనే టాలీవుడ్ ప్రేక్షకులను కూడా పలకరించనుందీ అందాల తార. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తికావొచ్చింది. అయితే ఇంతలోనే కన్నప్ప సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ రావడం, ఆ వెంటనే తప్పుకోవడం జరిగిపోయాయి. టైగర్ నాగేశ్వరరావుతో పాటు నూరాని చేహ్రా అనే మరో హిందీ సినిమాలో నుపుర్ నటిస్తోంది. ఇది కూడా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకొంటోంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఈ రెండు సినిమాలు మాత్రమే ఉన్నాయి. పైగా ఎండింగ్‌కు కూడా వచ్చేశాయి. మరి కన్నప్ప సినిమా నుంచి ఎందుకు బయటకు వచ్చింది? అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. మరోవైపు కన్నప్ప సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. మణిశర్మ, స్టీఫెన్ దేవాసి సంగీతం అందించనున్నారు. ఇక ఈ సినిమాకు కీలకమైన శివుడి పాత్రలో ప్రభాస్ నటించనున్నారంటూ వార్తలు వస్తున్నాయి.
Sad to announce that lovely @NupurSanon had to step down from #Kannappa due to scheduling conflicts. We’ll miss her, but the hunt for our new leading lady begins! Sending Nupur our best wishes on her other commitments. Hope to work with her in the near future
Exciting times…
— Vishnu Manchu (@iVishnuManchu) September 20, 2023
రవితేజ తో నుపుర్ సనన్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.