టాలీవుడ్ సీనియర్ సంగీత దర్శకుడు కేఎస్ చంద్రశేఖర్ తనువు చాలించారు. గత కొద్దిరోజుల నుంచి కరోనాతో బాధపడుతున్న ఆయన.. బుధవారం తుదిశ్వాస విడిచారు. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతిపై సంతాపం తెలియజేస్తున్నారు. కె.ఎస్.చంద్రశేఖర్ స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా రాయలం. సినిమాల కంటే ముందు ఈయన రేడియోలో పని చేసారు. 1990లో ఆల్ ఇండియా రేడియోలో గ్రేడ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా చేరి విశాఖపట్నం వాసులకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత అల్లు రామలింగయ్య ‘బంట్రోతు భార్య’ చిత్రంతో నేపథ్య గాయకుడిగా ఇండస్ట్రీకి వచ్చారు చంద్రశేఖర్. ఆ తర్వాత లెజెండరీ సంగీత దర్శకుడు చక్రవర్తి వద్ద 70కి పైగా చిత్రాలకు చీఫ్ అసోసియేట్‌గా వర్క్ చేసి.. చిరంజీవి హీరోగా నటించిన ‘యమకింకరుడు’ చిత్రంతో సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యారు. యమకింకరుడు, ఆణిముత్యం , భోళాశంకరుడు, ఆత్మ బంధువులు, ఉదయం, అదిగో అల్లదిగో లాంటి హిట్ చిత్రాలకు చంద్రశేఖర్ మ్యూజిక్ అందించారు. ఎం.ఎం.కీరవాణి, కోటి, మణిశర్మ లాంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు ఈయన దగ్గరే శిష్యరికం చేశారు.
కరోనా మహమ్మారి మానవులపై పగబట్టింది. సామాన్యులతో పాటు ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎందరో చిత్ర సీమకు చెందిన ప్రముఖులు ఈ వైరస్ బారినపడి ప్రాణాలు విడిచారు. తాజాగా నటుడు, సినీ జర్నలిస్ట్ టీ.ఎన్.ఆర్ కూడా కరోనాతో ఈ లోకాన్ని వీడారు. మరోవైపు సెకండ్ వేవ్ వీరవిహారం చేస్తుండటంతో ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేసే జూనియర్ ఆర్టిస్టులు, సినీ కార్మికులు విపరీతమైన కష్టాలు ఎదుర్కొంటున్నారు.
Also Read: ఇద్దరు లేడీ సూపర్ స్టార్లు.. విజయ్ సేతుపతి హీరో.. క్రేజీ కాంబో.. ఇప్పుడు పక్కన పెట్టేశారు!