Kaikala Satyanarayana: అధికారిక లాంఛనాలతో కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు: తలసాని శ్రీనివాస్ యాదవ్
కైకాల ఈరోజు తెల్లవారు జామున కన్నుమూశారు. కైకాల మరణ వార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పిస్తున్నారు.

దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణ మరణ వార్త సినీ ఇండస్ట్రీని దిగ్బ్రాంతికి గురిచేసింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కైకాల ఈరోజు తెల్లవారు జామున కన్నుమూశారు. కైకాల మరణ వార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పిస్తున్నారు. వెంకటేష్, రాఘవేంద్రరావు, మోహన్ బాబు , మెగాస్టార్ చిరంజీవి తదితరులు కైకాల భౌతికాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అలాగే తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కైకాల సత్యనారాయణ పార్థివదేహాన్ని దర్శించుకున్నారు. జూబ్లీహిల్స్ లోని నివాసంలో కైకాల సత్యనారాయణ మృతదేహం పై పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అధికారిక లాంఛనాలతో నటులు కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారని తెలిపారు మంత్రి. మూడు తరాల పాటు అనేక చిత్రాలలో వివిధ పాత్రలలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సత్యనారాయణ మృతి తెలుగు చలనచిత్ర పరిశ్రమ కు తీరని లోటు అని తలసాని అన్నారు. కైకాల సత్యనారాయణ మూడు తరాలకు గుర్తుండే గొప్ప నటుడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా తనదైన శైలిలో అలరించారు. 777 సినిమాల్లో నటించడం గర్వించదగ్గ విషయం. పాలిటిక్స్ లోను తనదైన ముద్ర వేశారు. చాలా మందికి ఇష్టమైన నటుడు. పాత్ర ఏదైనా అందులో జీవించే గొప్ప వ్యక్తి, నటుడు అంటూ తలసాని కొనియాడారు.
