CHIRANJEEVI: ఆ 2 సినిమాలను రీమేక్ చేయాలనుకుంటున్న చిరంజీవి! ఏ సినిమాలు తెలుసా?
బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలైందంటే ఆ పేరు వినబడాల్సిందే. డ్యాన్స్ లో గ్రేస్, ఫైట్స్ లో వేగం, నటనలో గాంభీర్యం.. ఇవన్నీ కలగలిపిన ఒకే ఒక్క పేరు అది. అభిమానం అంటే ఎలా ఉంటుందో దానికి ఎల్లలు ఉండవని, ఆయన ప్యాన్స్‌ను చూస్తే తెలుస్తుంది.

అందుకు తగినట్టుగానే అభిమానుల కోసం ఆయన సినిమాలతోపాటు సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ అగ్ర కథానాయకుడు అద్దం ముందు నిలబడి తనని తాను చూసుకున్నప్పుడు ఒక వింత అనుభూతికి లోనయ్యారట. పక్కన వాళ్ళు జోకులు వేస్తున్నా నవ్వు రాకపోవడం, లోపల ఏదో వెలితిగా అనిపించడంతో ఆయన వేసుకున్న ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “ఏంటి నీలో హాస్య గ్రంధులు చచ్చిపోయాయా?” అని ఆయన తనని తాను ప్రశ్నించుకున్నారట. ఇంతకీ ఆ ప్రశ్న వేసుకున్నది ఎవరో కాదు.. మన మెగాస్టార్ చిరంజీవి!
హాస్యం కోసం వెతుకులాట
రాజకీయాల కోసం సినిమా పరిశ్రమకు దాదాపు ఏడేళ్లు దూరంగా ఉన్న మెగాస్టార్, మళ్ళీ వెండితెరపై అడుగుపెట్టిన తర్వాత వరుసగా సీరియస్ రోల్స్ చేస్తూ వచ్చారు. ‘ఖైదీ నెంబర్ 150’, ‘సైరా నరసింహారెడ్డి’, ‘ఆచార్య’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించినా కామెడీ చేసే స్కోప్ లేకపోవడంతో తనలోని అసలైన వింటేజ్ కామెడీ టైమింగ్ మరుగున పడిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రం చేయాలని ఆయన అనుకుంటున్నారట.
ఆ రెండు చిత్రాల రీమేక్ పై మనసు
రీసెంట్ గా ఒక క్రేజీ డైరెక్టర్ తో జరిగిన ఇంటర్వ్యూలో మెగాస్టార్ తన మనసులోని మాటను బయటపెట్టారు. తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి. ఒకవేళ తన పాత సినిమాల్లో వేటినైనా మళ్ళీ రీమేక్ చేయాల్సి వస్తే, ఆ ఛాన్స్ ఎంచుకునేది కేవలం కామెడీ ప్రధానంగా సాగే సినిమాలనేనని స్పష్టం చేశారు. ఆ జాబితాలో ‘దొంగ మొగుడు’, ‘రౌడీ అల్లుడు’ వంటి చిత్రాలు ఉండటం విశేషం. ఈ చిత్రాల్లో మెగాస్టార్ చేసిన అల్లరి, బాడీ లాంగ్వేజ్ అప్పట్లో ఓ ఊపు ఊపాయి. మళ్ళీ అలాంటి పాత్రలే చేయాలని ఆయన ఉవ్విళ్లూరుతున్నారు.

Movie Posters
అనిల్ రావిపూడితో సందడి
ప్రస్తుతం మెగాస్టార్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ అనే చిత్రంలో నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తోంది. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ ఈ సినిమాలో పుష్కలంగా ఉంటుందని, వింటేజ్ మెగాస్టార్ ని ఈ చిత్రంలో చూడబోతున్నామని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో చూడాలి.
మెగాస్టార్ చిరంజీవి తనలోని వినోదాన్ని మళ్ళీ ప్రేక్షకులకు పంచాలని తపన పడుతుండటం చూస్తుంటే, రాబోయే రోజుల్లో ఆయన నుంచి మరింత ఫన్ డోస్ ఆశించవచ్చు. ముఖ్యంగా ఆయన కోరుకున్నట్లు ‘దొంగ మొగుడు’, ‘రౌడీ అల్లుడు’ వంటి కథలతో మళ్ళీ మ్యాజిక్ చేస్తారో లేదో కాలమే నిర్ణయించాలి.
