Waltair Veerayya Movie Review: వీరయ్య వాల్తేరు వీరయ్య.. ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే మూవీ

చాలా ఏళ్ళ తర్వాత చిరంజీవిలోని అసలైన కామెడీని వాడుకుంటూ వాల్తేరు వీరయ్య సినిమా చేసామని చెప్పారు దర్శక నిర్మాతలు. ఈ సినిమా పూర్తిగా చిరుకు ట్రిబ్యూట్ అంటూ చెప్పుకొచ్చాడు దర్శకుడు బాబీ.

Waltair Veerayya Movie Review: వీరయ్య వాల్తేరు వీరయ్య.. ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే మూవీ
Waltair Veerayya
Follow us

| Edited By: Rajeev Rayala

Updated on: Jan 13, 2023 | 1:22 PM

మూవీ రివ్యూ: వాల్తేరు వీరయ్య

నటీనటులు : చిరంజీవి, రవితేజ, శృతి హాసన్, కేథరిన్, రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, బాబీ సింహా, నాజర్, సత్యరాజ్, ‘వెన్నెల’ కిశోర్ తదితరులు

సినిమాటోగ్రఫర్ : ఆర్థర్ ఎ విల్సన్

సంగీత దర్శకుడు : దేవి శ్రీ ప్రసాద్

నిర్మాతలు : నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్

స్క్రీన్ ప్లే : కోన వెంకట్, కె. చక్రవర్తి రెడ్డి

కథ, మాటలు, దర్శకత్వం : బాబీ కొల్లి (కె.ఎస్. రవీంద్ర)

విడుదల తేదీ: జనవరి 13, 2022

చాలా ఏళ్ళ తర్వాత చిరంజీవిలోని అసలైన కామెడీని వాడుకుంటూ వాల్తేరు వీరయ్య సినిమా చేసామని చెప్పారు దర్శక నిర్మాతలు. ఈ సినిమా పూర్తిగా చిరుకు ట్రిబ్యూట్ అంటూ చెప్పుకొచ్చాడు దర్శకుడు బాబీ. ఆయన్ని ఎలా స్క్రీన్ మీద చూపిస్తే బాగుంటుందో అలాగే చూపించామని చెప్పారు. మరి వాల్తేరు వీరయ్య ఎలా ఉంది..? నిజంగానే అంచనాలు అందుకుందా..?

కథ:

వాల్తేరు వీరయ్య(చిరంజీవి) వైజాగ్‌లోని జాలరిపేటలో చేపలు పడుతుంటాడు. అక్కడ సామ్రాజ్యానికి అతడే కింగ్. అంతర్జాతీయ డ్రగ్ డీలర్స్‌ను పట్టుకోడానికి నేవి అధికారులు సైతం వీరయ్యనే సాయం అడుగుతుంటారు. ఆయన గురించి తెలిసిన పోలీస్ ఆఫీసర్ సీతాపతి (రాజేంద్ర ప్రసాద్) ఇంటర్నేషనల్ మాఫియా డాన్ సోలొమాన్ సీజర్ (బాబీ సింహా)ను కిడ్నాప్ చేసి ఇండియాకు తీసుకొచ్చేందుకు వీరయ్యతో డీల్ మాట్లాడుకుంటాడు. దానికోసం మలేషియా వెళ్ళిన వీరయ్య.. అక్కడ సోలొమాన్ సీజర్‌ను కాదని.. అతడి అన్నయ్య మైకెల్‌ను టార్గెట్ చేస్తాడు. అసలు అతడిని ఎందుకు వీరయ్య టార్గెట్ చేసాడు..? ఈ కథలోకి ఏసిపి విక్రమ్ సాగర్ (రవితేజ) ఎందుకు వచ్చాడు..? వీరయ్య, విక్రమ్ సాగర్ మధ్య గొడవేంటి..? అనేది అసలు కథ..

కథనం:

వాల్తేరు వీరయ్య రొటీన్ ఎంటర్‌టైనర్.. స్వయంగా చిరంజీవి చెప్పిన మాట ఇది. ఆయన చెప్పిందే నిజం.. కచ్చితంగా రొటీన్ సినిమానే.. భూతద్దం వేసి వెతికినా కొత్త దనం లేని రొటీన్ కమర్షియల్ సినిమా. కానీ దాన్ని ఎలా స్క్రీన్ మీద ప్రజెంట్ చేసారనే విషయంలోనే దర్శకుడి టాలెంట్ తెలుస్తుంది. అందులో బాబీ చాలా వరకు సక్సెస్ అయ్యాడు. చిరంజీవిని ఎలా చూపించాలనుకున్నాడో.. అభిమానులు ఆయన్ని ఎలా చూడాలని కోరుకుంటున్నారో అలాంటి సీన్స్ రాసుకున్నాడు. 20 ఏళ్ళ తర్వాత మెగాస్టార్‌లోని కామెడీని బయటికి తీసుకొచ్చాడు. అయితే దానికి తగ్గ కథ, కథనం రాసుకోవడంలో మాత్రం ఫెయిల్ అయ్యాడు బాబీ. ముఖ్యంగా రొటీన్ కథ కావడంతో.. కొత్తగా చెప్పుకోడానికేం లేదు. అందుకే చిరంజీవిలోని వింటేజ్ మెగా మ్యాజిక్ ఫుల్లుగా వాడేసాడు బాబీ. ఫస్టాఫ్ అంతా చెప్పడానికి ఏం కథ లేదు కాబట్టే.. మలేసియాలో చిరుతో కామెడీ చేయించాడు.. అలాగే సెకండాఫ్‌లో పూర్తిగా రవితేజకు ఇచ్చేసాడు మెగాస్టార్. తను సైలెంట్‌గా కామన్ ఆడియన్ అయిపోయాడు. కామెడీ చేసాడు.. ఇలాంటి సీన్స్ అన్ని చిరులో చాలా ఏళ్ల నుంచి చూడాలనుకుంటున్నారు మెగాస్టార్. చిరంజీవి ఇంట్రడక్షన్ సీన్ అదిరిపోయింది.. అలాగే రవితేజను కూడా చాలా చక్కగా చూపించాడు బాబీ. ముఖ్యంగా వాళ్లిద్దరి మద్య సీన్స్ అద్భుతంగా రాసుకున్నాడు బాబీ. రవితేజ ఉన్నంత సేపు చిరు చేసిన కామెడీ బాగా వర్కవుట్ అయింది. ముఖ్యంగా చాలా ఏళ్ళ తర్వాత చిరులోని వన్ లైనర్స్ బయటికి వచ్చాయి. అలాంటి మెగాస్టార్‌ను చూసి అభిమానులు అయితే మురిసిపోతున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ రెగ్యులర్ కమర్షియల్ సినిమా అయినా చిరు మ్యాజిక్ నిలబెడుతుంది.. ముఖ్యంగా పండక్కి కావాల్సిన ఎంటర్‌టైన్మెంట్ అయితే ఇచ్చేస్తుంది.. శృతి హాసన్ కారెక్టర్ సినిమాలో బాగా ఇమిడిపోయింది. ఓవరాల్‌గా రొటీన్ సినిమానే కానీ మెగా మ్యాజిక్ వర్కవుట్ అయ్యింది.

నటీనటులు:

వాల్తేరు వీరయ్యగా చిరంజీవి బాగా చేసాడని ఇప్పుడు కొత్తగా ఏం చెప్పాలి..? అక్కడున్నది మెగాస్టార్ కాబట్టి కచ్చితంగా బాగానే చేస్తాడు. ముఖ్యంగా చిరు చాలా ఏళ్ళ తర్వాత కామెడీ టచ్ ఇచ్చాడు. రవితేజ ఉన్నంత సేపు స్క్రీన్ షేక్ అయిపోయింది. ఈ కారెక్టర్‌కు పక్కా ఫిట్ మాస్ రాజా. ప్రకాశ్ రాజ్ మరో రొటీన్ విలన్‌గా నటించాడు. శృతి హాసన్ కారెక్టర్ బాగుంది. కేవలం హీరోయిన్‌గానే కాకుండా కాస్త ముఖ్యమైన పాత్ర పడింది. రాజేంద్రప్రసాద్ కారెక్టర్‌కు సరిపోయాడు. బాబీ సింహా ఉన్నంత వరకు బాగా చేసాడు. మిగిలిన వాళ్లంతా ఓకే..

టెక్నికల్ టీం:

దేవీ శ్రీ ప్రసాద్ అందించిన పాటలు అంతగా కిక్ ఇవ్వలేదు కానీ బ్యాగ్రౌండ్ స్కోర్ అయితే బాగుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్‌లో పూనకాలు తెప్పించాడు. ఆర్థర్ ఏ విల్సన్ కెమెరా పనితనం అద్భుతంగా ఉంది. ఎడిటింగ్ కాస్త వీక్ అనిపిస్తుంది. ముఖ్యంగా ఫస్టాఫ్ కొన్ని సీన్స్ ల్యాగ్ అయ్యాయి. స్క్రీన్ ప్లే పరంగా బాబీ అండ్ టీం బాగానే కష్టపడ్డారు. బాబీ దర్శకుడిగా కంటే స్క్రీన్ మీద అభిమానిగానే కనిపించాడు. ఆయన కథ కంటే కూడా మెగాస్టార్‌ను కోరుకున్నట్లు చూపించాలనే తాపత్రయమే కనిపించింది. దర్శకుడిని అభిమాని అయితే డామినేట్ చేసాడు.

పంచ్ లైన్:

వాల్తేరు వీరయ్య.. ఫ్యాన్స్‌కు పూనకాలు.. కామన్ ఆడియన్‌కు రొటీన్ యాక్షన్ ఎంటర్‌టైనర్..