AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Papam Pasivaadu: పాపం పసివాడు సినిమాలో లీడ్ రోల్ చేసిన ఈ బాలుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు..?

తెలుగు సినిమా "పాపం పసివాడు"లో బాలనటుడిగా నటించి, ప్రేక్షకుల మన్ననలు పొందిన మాస్టర్ రాము పూర్తి జీవిత విశేషాలు. అట్లూరి పూర్ణచంద్రరావు నిర్మించిన ఈ ప్రయోగాత్మక చిత్రంలో గోపి పాత్రతో స్టార్‌డమ్ సాధించిన రాము, ఆయన బాలనటుడి ప్రస్థానం, ఆ తర్వాత సినీ జీవితం, ప్రస్తుత స్థితి గురించి ఈ కథనం వివరిస్తుంది.

Papam Pasivaadu: పాపం పసివాడు సినిమాలో లీడ్ రోల్ చేసిన ఈ బాలుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు..?
Papam Pasivaadu Child Actor
Ram Naramaneni
|

Updated on: Jan 31, 2026 | 6:46 PM

Share

తెలుగు చిత్ర పరిశ్రమలో పాపం పసివాడు సినిమా తెరకెక్కించడం ఎంతో రిస్క్‌తో చేసిన పని అని అప్పటి ఫిల్మ్ జర్నలిస్టులు చెబుతున్నారు. హీరో, హీరోయిన్లు లేకుండా కేవలం ఆరేళ్ల పసివాడిని ప్రధాన పాత్రధారిగా పెట్టి తీసిన ఈ చిత్రం ఒక ప్రయోగం. నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు ఒక పెద్ద హీరో సినిమాకు సమానంగా ఖర్చుపెట్టి, ప్రమోషన్స్ విషయంలో కూడా రాజీపడకుండా భారీ పబ్లిసిటీ చేశారు. హెలికాఫ్టర్ ద్వారా కరపత్రాలు ఊరూరా పంపి సంచలనం సృష్టించారు. ఈ సినిమాలో గోపి అనే పాత్రను మాస్టర్ రాము పోషించారు. “పాపం పసివాడు” సినిమా తర్వాత మాస్టర్ రాము ఒక స్టార్‌గా ఎదిగారు. అనేక సినిమాల్లో ఛాన్సులు దక్కించుకున్నారు. మాస్టర్ రాము పూర్తి పేరు చుక్కల వీరవెంకటరాంబాబు. ఆయన స్వస్థలం విజయవాడ. తల్లిదండ్రులకు ఏకైక కుమారుడు. చిన్నతనంలోనే సినిమాలపై ఆసక్తి పెంచుకున్న రాంబాబును, AVM స్టూడియోలో అసోసియేట్ డైరెక్టర్ రంగున్ రామారావు బాలనటుడిగా “మూగనోము” సినిమా కోసం ఎంపిక చేయడానికి వచ్చారు. మొదట రాంబాబు తల్లి అంగీకరించకపోయినా, తండ్రి పట్టుబట్టడంతో రాంబాబు మద్రాస్ వెళ్లారు. అయితే “మూగనోము” చిత్రానికి రాంబాబు చిన్నవాడు కావడంతో దర్శకుడు వద్దన్నారు. కానీ, అదే సమయంలో శివాజీ గణేశన్ నటించిన “ఎంగ మామ”లో రాంబాబుకి అవకాశం దక్కింది. “మిస్టర్ రాము”గా వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత ఎన్టీఆర్, శోభన్ బాబు, చలం కలిసి నటించిన “నిండు హృదయాలు” చిత్రంలో శోభన్ బాబు చిన్ననాటి పాత్రలో నటించారు. ఈ సినిమా విజయం సాధించడంతో రాంబాబు బిజీ అయ్యారు. హీరో కృష్ణ నటించిన “విధి విలాసం”లో కూడా నటించారు, ఈ చిత్రంలో ఆయనతో పాటు బేబీ శ్రీదేవి కూడా నటించారు.

తెలుగులో కంటే తమిళంలోనే ఎక్కువ సినిమాల్లో నటించిన రాము, కృష్ణ నటించిన “పగసాధిస్తా” తర్వాత ఆయన కెరీర్ కీలక మలుపు తిరిగింది. ఇక “పాపం పసివాడు” చిత్రం ఆయనకు తిరుగులేని గుర్తింపును తెచ్చిపెట్టింది. ఈ సినిమా తర్వాత మాస్టర్ రాము మరింత బిజీ అయ్యారు. కృష్ణ “మాయదారి మల్లిగాడు” చిత్రంలో కూడా రాము నటించారు. నటుడు జైకృష్ణ నిర్మాతగా మారి రామకృష్ణ, జమున కాంబినేషన్‌లో ప్రారంభించిన “బాలనాగమ్మ” చిత్రంలో కైకాల సత్యనారాయణ మాయల ఫకీర్‌గా నటించగా, బాలవర్ధిరాజు పాత్రను మాస్టర్ రాము పోషించారు. అయితే ఈ సినిమా విడుదల కాలేదు. రాము నటించిన ఇతర చిత్రాలలో “పసి హృదయాలు”, “సంసారం”, “చిరంజీవి రాంబాబు”, “జీవన తీరాలు”, “బంగారు తల్లి”, “చరిత్ర హీనులు”, “రామయ్య తండ్రి”, “రామదండు”, “సీతాకోకచిలుక” ముఖ్యమైనవి. బాలతారలతో దర్శకుడు తాతినేని ప్రకాశరావు నిర్మించిన “గంగాభవానీ” చిత్రంలో కూడా రాము నటించారు. జంతువులతో సినిమాలు తీయడంలో నిపుణుడైన చిన్నప్పదేవర్.. మాస్టర్ రామును హీరోగా పెట్టి తెలుగు, తమిళ భాషల్లో “సింహంతో బాలుడు” చిత్రాన్ని ప్రారంభించారు. అయితే, ఆయన ఆకస్మిక మరణంతో ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. బాలనటులకు ఒక శాపం ఉంది. చిన్నప్పుడు ఎంతో ప్రేక్షకాదరణ పొందిన వారు, యుక్త వయస్సులోకి రాగానే ప్రేక్షకుల నుంచి దూరమైపోతారు. బాలనటుల్లో శ్రీదేవి మాత్రమే అగ్రతారగా నిలదొక్కుకోగలిగారు. మాస్టర్ రాము విషయంలో కూడా ఇదే జరిగింది. యుక్త వయస్సులో “రామదండు”, “సీతాకోకచిలుక” చిత్రాల్లో నటించినా, హీరోగా మారలేకపోయారు. తాతినేని ప్రకాశరావు తనను హీరోగా పరిచయం చేస్తారని ఆశించినా, అది జరగలేదు. అవకాశాలు రాకపోవడంతో విజయవాడ తిరిగి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన వివాహం చేసుకుని అక్కడే స్థిరపడ్డారని చెబుతారు.

(ఈ కథనంలోని సమాచారం సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టులతో పాటు ఇంటర్నెట్ నుంచి సేకరించాం)

Also Read: NTR: జూనియర్ ఎన్టీఆర్ ఫోన్‌లో అత్యధిక సార్లు ప్లే అయిన పాట ఇదే.. వింటే మీరు ఫిదా