
మాలాశ్రీ కూతురు ఆరాధన రామ్ ‘కటేరా’ సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో దర్శన్ హీరోగా నటించాడు. తెలుగులోనూ ఈ సినిమా రిలీజైంది. ఇప్పుడు రెండో సినిమాకు సంతకం చేసింది ఆరాధన. ‘తరుణ్ స్టూడియోస్’ బ్యానర్ పై తరుణ్ శివప్ప ‘నెక్స్ట్ లెవల్’ అనే సినిమాను నిర్మించనున్నారు . కన్నడ ‘రియల్ స్టార్’ ఉపేంద్ర ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు . అరవింద్ కౌశిక్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో ఆరాధన రామ్ కథానాయికగా ఎంపికైంది.
ఇది పాన్ ఇండియా సినిమా కావడం విశేషం. ఆరాధన ‘కటేరా’ సినిమాలో తన నటనతో ఆడియెన్స్ ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఆమెకు ‘నెక్స్ట్ లెవెల్’ అవకాశం వచ్చింది. తన మొదటి సినిమాలో దర్శన్ లాంటి స్టార్ హీరో సరసన నటించిన ఆరాధన ఇప్పుడు తన రెండవ సినిమాలో కూడా ఒక స్టార్ హీరోతో జత కట్టనుంది.
‘నెక్స్ట్ లెవల్’ సినిమా ముహూర్తం బెంగళూరులోనే గ్రాండ్ గా జరగనుంది. తరువాత బెంగళూరు, హైదరాబాద్, ముంబై మొదలైన ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను వీఎఫ్ ఎక్స్ తో తెరకెక్కిస్తున్నారు. ఇందు కోసం కెనడాతో సహా అనేక విదేశీ గ్రాఫిక్స్ స్టూడియోలు, భారతదేశంలోని ప్రతిష్టాత్మక గ్రాఫిక్స్ నిర్మాణ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నారు.
‘ఏ’, రా, ‘ఉపేంద్ర’, ‘రక్త కన్నీరు’ సినిమాల తరహాలో ‘నెక్స్ట్ లెవల్’ సినిమాను కూడా ఓ వైవిధ్యమైన కథతో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అనూప్ కట్టుకరన్ ‘నెక్స్ట్ లెవల్’ సినిమాకు పనిచేస్తున్నారు. నిర్మాత తరుణ్ శివప్ప ఇప్పటికే 5 సినిమాలు నిర్మించారు. ‘రోజ్’ సినిమా ద్వారా నిర్మాతగా మారారు, ఆ తర్వాత శివరాజ్ కుమార్ నటించిన ‘మాస్ లీడర్’ సినిమాను నిర్మించారు. ఆ తర్వాత ‘విక్టరీ 2’, ‘ఖాకి’, ‘ఛూ మంతర్’ సినిమాలు నిర్మించారు. ఇప్పుడు ‘నెక్స్ట్ లెవల్’ సినిమాను నిర్మిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..