Directors: మీకో దండం దూత.. త్వరగా కమ్ బ్యాక్ ఇవ్వండి సామీ..!
ఇండస్ట్రీలో వరుస హిట్స్‌తో ఒకప్పుడు ఓ రేంజ్‌లో వెలిగిన దర్శకులు. ఇప్పుడు ఒక్క హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇండస్ట్రీలో మళ్లీ తలెత్తుకుని తిరగాలంటే ఆ హిట్ వాళ్లకు చాలా అవసరం. అందుకే ఆ హిట్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. తేడా వస్తే ఆడియన్స్ తమను మర్చిపోయే పరిస్థితి ఉండటంతో వారు కెరీర్ పట్ల కాస్త ఆందోళన కూడా చెందుతున్నారు.

ఇండస్ట్రీలో టైమ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు.. ఒక్క శుక్రవారంతో జాతకాలు మారిపోతుంటాయి. చక్రం తిప్పిన వాళ్లు కూడా సింగిల్ శుక్రవారానికే చుక్కలు చూస్తుంటారు. ఇప్పుడు కొందరు దర్శకుల విషయంలోనూ ఇదే జరుగుతుంది. వాళ్లను చూస్తుంటే.. ఎలా ఉండేవాళ్లు ఎలా అయిపోయార్రా అనిపిస్తుంది పాపం. ఒకప్పుడు వాళ్లతో సినిమాలు చేయడానికి ఎగబడిన హీరోలు.. ఇప్పుడు వాళ్లు కనిపిస్తే చాలు ఎలా తప్పించుకోవాలా అని చూస్తున్నారు. అసలు సిసలైన కమ్ బ్యాక్ కోసం చూస్తున్న లెజెండరీ దర్శకులు చాలా మంది ఉన్నారు మన దగ్గర. సీనియర్ దర్శకులు శంకర్, మురుగదాస్, గౌతమ్ మీనన్ లాంటి లెజెండరీ దర్శకులకు ఇదే జరుగుతుంది. సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు సెన్సేషన్స్ క్రియేట్ చేసిన ఈ దర్శకులు.. ఇప్పుడు మాత్రం బాగా ఇబ్బంది పడుతున్నారు.
రాజమౌళి కంటే ముందే ఇండియన్ సినిమాకు విజువల్ వండర్స్ ఇచ్చిన దర్శకుడు శంకర్. అలాంటి డైరెక్టర్ నుంచి వచ్చిన భారతీయుడు 2, గేమ్ ఛేంజర్ సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి. ఇండియన్ 2కు అయితే కాస్త ఎక్కువగానే క్రిటిసిజం అందుకున్నాడు శంకర్. ఒక భాగంలో ముగించాల్సిన సినిమాను.. బలవంతంగా మూడో భాగానికి లాగి.. ల్యాగ్ చేసారంటూ శంకర్‌ను ఆడుకున్నారు. గేమ్ ఛేంజర్ డిజాస్టర్‌తో శంకర్ పూర్తిగా రేసులో వెనకబడిపోయాడు. శంకర్ కెరీర్ ఇప్పుడు టోటల్‌గా ఇండియన్ 3పై ఆధారపడి ఉంది. కానీ అది వస్తుందా లేదా అనే అనుమానాలు చాలానే ఉన్నాయి.
మరోవైపు మురుగదాస్ పరిస్థితి కూడా అలాగే ఉంది. అప్పట్లో సెన్సేషనల్ సినిమాలు చేసిన మురుగదాస్.. కొన్నేళ్లుగా ట్రాక్ తప్పారు. ప్రస్తుతం శివకార్తికేయన్‌తో మదరాసి సినిమా.. హిందీలో సల్మాన్ ఖాన్‌తో సికిందర్ సినిమాలు చేస్తున్నారు. వీటిపైనే ఈ దర్శకుడి కెరీర్ ఆధారపడి ఉంది. తాజాగా విడుదలైన మదరాసి టీజర్ చూస్తుంటే మురుగదాస్ మళ్లీ ట్రాక్ ఎక్కినట్లే కనిపిస్తున్నారు. తుపాకి రేంజ్‌లో దీన్ని డిజైన్ చేస్తున్నారు ఈ దర్శకుడు.
గౌతమ్ మీనన్ సైతం సరైన కమ్‌బ్యాక్ కోసం చూస్తున్నారు. కొన్నేళ్లుగా ఈయన నుంచి వచ్చిన సినిమాలు కనీసం వచ్చినట్లు కూడా గుర్తించట్లేదు ఆడియన్స్. ప్రస్తుతం మమ్ముట్టితో ఓ సినిమా చేస్తున్నారీయన. ఈ ముగ్గురు మాత్రమే కాదు.. తెలుగులో వినాయక్, పూరీ జగన్నాథ్, శ్రీను వైట్ల లాంటి దర్శకులను పూర్తిగా మరిచిపోయారు మన ఆడియన్స్.