AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krishnam Raju: ఆ విషయంలో ఏకైక హీరోగా నిలిచిన కృష్ణంరాజు.. స్టార్ హీరో అయినా తెరను పంచుకోవడంలోనూ ముందే..

కథ.. పాత్ర నచ్చితే సహయనటుడిగానూ మెప్పించారు. అలా తన సుధీర్ఘ సినీ ప్రయాణంలో ఎంతోమంది తారలతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.

Krishnam Raju: ఆ విషయంలో ఏకైక హీరోగా నిలిచిన కృష్ణంరాజు.. స్టార్ హీరో అయినా తెరను పంచుకోవడంలోనూ ముందే..
Krishnam Raju
Rajitha Chanti
| Edited By: Ravi Kiran|

Updated on: Sep 12, 2022 | 2:39 PM

Share

సీనియర్ హీరో రెబల్ స్టార్ కృష్ణంరాజు (Krishnam Raju) మృతితో తెలుగు చిత్రపరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన మృతితో సినీతారలు దిగ్ర్భాంతికి గురయ్యారు. కృష్ణంరాజుతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఆయన మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఐదు దశాబ్దాలకు పైగా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించారు కృష్ణంరాజు. అంతేకాదు..కేవలం హీరోయిజం మాత్రమే చూసుకోకుండా కంటెంట్ ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకున్నారు. అప్పటికే స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కృష్ణంరాజు తన తోటి హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోవడంలోనూ ముందున్నారు. కథ.. పాత్ర నచ్చితే సహయనటుడిగానూ మెప్పించారు. అలా తన సుధీర్ఘ సినీ ప్రయాణంలో ఎంతోమంది తారలతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.

అక్కినేని నాగేశ్వరరావు అంటే కృష్ణంరాజుకు ఎంతో అభిమానం. ఆయనతో కలిసి తెర పంచుకున్న మొదటి సినిమా బుద్ధిమంతుడు. 1969లో విడుదలైన ఈ సినిమా మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత వీరిద్దరి కాంబోలో జై జవాన్, పవిత్ర బంధం, రైతు కుటుంబం, మంచి రోజులు వచ్చాయి, కన్నకొడుకు, యస్పీ భయంకర్ సినిమాలు వచ్చాయి. అలాగే.. సూపర్ స్టార్ కృష్ణతోనూ రెబల్ స్టార్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆయనతో కలిసి దాదాపు 17కి పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన మొదటి సినిమా నేనంటే నేనే. 1968లో విడుదలైన ఈ మూవీకి విజయం సాధించింది. అనంతరం వీరిద్దరి కలయికలో హంతకులు దేవాంతకులు, ఇల్లు ఇల్లాలు, మాయదారి మల్లిగాడు, కురుక్షేత్రం, అడవి సింహాలు, యుద్దం, విశ్వనాథనాయకుడు, మనుషులు చేసిన దొంగలు, ఇంద్రభవనం, సుల్తాన్ వంటి చిత్రాలొచ్చాయి.

Krishnam Raju `1

Krishnam Raju `1

ఇండస్ట్రీలో కృష్ణంరాజుకు అత్యంత ఆత్మీయుడు శోభన్ బాబు. వీరిద్దరు కలిసి అనేక చిత్రాల్లో నటించారు. బంగారు తల్లి, మానవుడు దానవుడు, జీవనతరంగాలు వంటి చిత్రాల్లో శోభన్ బాబుకు ప్రతినాయకుడిగా కనిపించారు. ఆ తర్వాత హీరోలుగా ఇద్దరు కలిసి కురుక్షేత్రం, రామబాణం, జీవితం, ఇద్దరూ ఇద్దరే వంటి సినిమాల్లో నటించారు. అలాగే దివంగత నటుడు ఎన్టీఆర్‏తోనూ కృష్ణం రాజు తెర పంచుకున్నారు. 1969లో వీరిద్దరి కలయికలో వచ్చిన మొదటి సినిమా భలే మాస్టారు. ఆ తర్వాత బడిపంతులు, మనుషుల్లో దేవుడు, మంచికి మరోపేరు, పల్లెటూరి చిన్నోడు, వాడే వీడు, సతీ సావిత్రి వంటి సినిమాలొచ్చాయి. ఇవే కాకుండా యువతరం కథానాయకుల చిత్రాలలో ఎన్నో మర్చిపోలేని పాత్రలలో నటించి మెప్పించారు.కృష్ణం రాజు చివరగా నటించిన చిత్రం రాధేశ్యామ్. ప్రభాస్ హీరోగా నటించిన ఈ మూవీలో కీలకపాత్రలో కనిపించారు కృష్ణంరాజు.