Junior Movie Review: జూనియర్ మూవీ రివ్యూ.. గాలి జనార్థన్ రెడ్డి కొడుకు హిట్టు కొట్టాడా..?
గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరీటి హీరోగా పరిచయమైన సినిమా జూనియర్. ఈ సినిమా కోసం టాప్ టెక్నీషియన్స్ అంతా కలిసి పని చేసారు. తెలుగు, కన్నడలో ఏకకాలంగా ఈ సినిమాను రూపొందించారు దర్శకుడు రాధాకృష్ణా రెడ్డి. జూనియర్ విడుదలైందిప్పుడు.. మరి ఆ సినిమా ఎలా ఉంది..? కిరీటిని హీరోగా నిలబెట్టిందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..

మూవీ రివ్యూ: జూనియర్
నటీనటులు: కిరీటి, శ్రీలీల, రవిచంద్రన్, జెనీలియా, అచ్యుత్ కుమార్, సుధారాణి, వైవా హర్ష, సత్య తదితరులు
సినిమాటోగ్రఫర్: సెంథిల్ కుమార్
ఎడిటర్: నిరంజన్ దేవరమానే
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
మాటలు: కళ్యాణ చక్రవర్తి త్రిపురనేని
నిర్మాత: సాయి కొర్రపాటి
దర్శకుడు: రాధాకృష్ణా రెడ్డి
కథ:
లైఫ్‌లో ఎక్స్‌పీరియన్స్ కంటే ఎగ్జైట్‌మెంట్‌తో కూడిన ఎక్స్‌పీరియన్స్ కావాలనుకునే కుర్రాడు అభి (కిరీటీ). అన్నింట్లోనూ అనుభవాలతో పాటు మెమోరీస్ వెతుక్కుంటూ ఉంటాడు. దానికి కారణం ఆయన తండ్రి కోదండపాణి (రవిచంద్రన్). ఆయనకు 50 ఏళ్లున్నపుడు అభి పుడతాడు. పుట్టిన వెంటనే అమ్మ చనిపోతుంది. దాంతో కొడుకును కంటికి రెప్పలా పెంచుతాడు కానీ జనరేషన్ గ్యాప్ కనబడుతుంది. అభికి ఏం కావాలనేది కోదండపాణికి అర్థం కాదు. తండ్రి చూపించే అమితమైన ప్రేమతో చిన్న చిన్న సరదాలు కోల్పోతున్న అభి.. హైదరాబాద్ కాలేజీలో జాయిన్ అయి అక్కడ అన్నీ తిరిగి పొందడానికి చూస్తాడు. ఈ క్రమంలోనే స్పూర్థి (శ్రీలీల)ను చూసి ప్రేమలో పడతాడు. చదువు అయిపోయిన తర్వాత రైస్ సొల్యూషన్స్ అనే కంపెనీలో ఉద్యోగం సంపాదిస్తాడు. అయితే ఆ కంపెనీకి కాబోయే సీఈవో, కంపెనీ ఓనర్ (రావు రమేష్) కుమార్తె విజయ సౌజన్య (జెనీలియా)తో గొడవ పడి ఆమె దృష్టిలో బ్యాడ్ అవుతాడు. అప్పుడే వాళ్ల కంపెనీ విషయం కోసం విజయనగరం వెళ్లాల్సి వస్తుంది టీం. కానీ ఆ ఊరు అంటే విజయ సౌజన్యకు కోపం. అసలెందుకు ఆమెకు విజయనగరం అంటే కోపం.. అభి అక్కడికి వెళ్లి ఏం చేసాడు..? అసలు కోదండపాణి, విజయ సౌజన్యకు ఉన్న సంబంధమేంటి అనేది అసలు కథ..
కథనం:
కిరీటిని కమర్షియల్ హీరోగా లాంఛ్ చేయాలని ముందుగానే ఫిక్సైపోయినట్లు ఈ సినిమా చూస్తుంటే అర్థమవుతుంది. టిపికల్ ఫార్మాట్ సినిమాలో ఏమేం అయితే ఉంటాయో అన్నీ జూనియర్ సినిమాలో ఉన్నాయి. ముఖ్యంగా హీరోకు ఓ ఇంట్రో ఫైట్.. హీరోయిన్ కనబడగానే ఇంట్రో సాంగ్.. ఇంటర్వెల్‌కు ముందు ఓ ట్విస్ట్.. సెకండాఫ్‌లో మెయిన్ స్టోరీ.. చివర్లో ఓ మాస్ సాంగ్.. ఇలా లెక్కలేసుకుని మరీ తీసారు జూనియర్ సినిమాను. కథ విషయంలో అస్సలు కొత్తదన అంటూ లేదు. ఫస్టాఫ్ అంతా రొటీన్ కాలేజ్ డ్రామాగా వెళ్లిపోతుంది. పాటలు ఇరికించినట్లు అనిపిస్తాయి. అలాగే సెకండాఫ్ చాలా వరకు మహేష్ బాబు నటించిన ‘శ్రీమంతుడు’, ‘మహర్షి’ సినిమాలు స్పూర్తి ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా హీరో వాళ్లు ఊరికి వచ్చి.. అక్కడ మంచి పనులు చేస్తున్నపుడు శ్రీమంతుడు ఎక్కువగా గుర్తుకొస్తుంది. సినిమా నిండా టాప్ టెక్నిషియన్స్, పెద్ద పెద్ద నటులున్నా కూడా చాలా సాదాసీదా సినిమాతో సరిపెట్టాడు దర్శకుడు రాధాకృష్ణా రెడ్డి. సెకండాఫ్ అసలు హీరోయిన్ లేదంటే కథ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కేవలం ఓ సాంగ్ కోసం వచ్చి వెళ్లిపోయింది. నీకేం వచ్చు అంటే డాన్స్ వచ్చు సర్.. ఫైట్స్ వచ్చు సార్.. ఓకే వాడేద్దాం.. కథ తర్వాత.. ముందు అవన్నీ వాడేద్దాం.. జూనియర్ సినిమా సెట్స్‌పైకి రాకముందు హీరో, డైరెక్టర్ మధ్య ఈ డిస్కషన్ జరిగిందేమో..? కథ, కథనాలు పక్కనబెట్టి.. ముందు తనకేం వచ్చు అనేది.. మొత్తం ఒక్క సినిమాతోనే చేసి చూపించేసాడు కొత్తబ్బాయి కిరీటీ. సినిమా విషయానికి వస్తే.. ఫస్టాఫ్ అంతా ఫిల్లర్.. బలవంతంగా వచ్చే కాలేజ్ ఎపిసోడ్స్, లవ్ ట్రాక్.. పెట్టాలని పెట్టే పాటలు.. ఇంటర్వెల్ వరకు ఇలాగే లాక్కొచ్చాడు దర్శకుడు రాధాకృష్ణా రెడ్డి. సెకండాఫ్‌లో మెయిన్ ప్లాట్ అంతా ఓపెన్ చేసాడు.. కొన్ని సీన్స్ అయితే అస్సలు లాజిక్‌కు అందవు.. కానీ కమర్షియల్ కథ కాబట్టి సర్దుకుపోవాలి అంతే. జెనీలియా, కిరీటి మధ్య సెంటిమెంట్ సీన్స్ కొన్ని బాగానే పండాయి. అదే ఎమోషన్ సినిమాలో ఇంకాస్త ఉంటే బాగుండేది.. కానీ మిస్ ఫైర్ అయింది. చిన్న ట్విస్టుతో రొటీన్ టెంప్లేట్ కమర్షియల్ ఫార్మాట్‌లోనే వచ్చాడు జూనియర్. రవిచంద్రన్ క్యారెక్టర్ ఇంకాస్త డెప్త్ ఉండుంటే బాగుండేదేమో..?
నటీనటులు:
కిరీటీ ఎనర్జిటిక్‌గా ఉన్నాడు.. ఏమాటకామాటే.. మనోడు స్క్రీన్ మీద వైల్డ్ ఫైర్‌లా ఉన్నాడు.. యాక్టింగ్‌కు ఇంకా టైమ్ పడుతుందేమో గానీ డాన్స్ మాత్రం ఇరగ్గొట్టేసాడు. వైరల్ వయ్యారిలో శ్రీలీలను కూడా డామినేట్ చేసాడు.. అలాగే ఫైట్లు, యాక్షన్ సీన్స్ కూడా ఓకే.. చెప్పానుగా యాక్టింగ్‌కు టైమ్ పడుతుంది. శ్రీలీల పాటల కోసమే ఉంది.. సెకండాఫ్‌లో కనబడలేదు ఈ అమ్మాయి. రవిచంద్రన్ ఓకే.. జెనీలియా చాలా రోజుల తర్వాత మంచి పాత్రే చేసింది. వైవా హర్ష, సత్య ఉన్నంతలో కాస్త పర్లేదు. కన్నడ నటుడు అచ్యుత్ కుమార్ కూడా ఓకే. మిగిలిన వాళ్లంతా తమ పాత్రలకు న్యాయం చేసారు.
టెక్నికల్ టీం:
దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకు ప్లస్. పాటలు జస్ట్ ఓకే అనిపించినా.. బ్యాగ్రౌండ్ స్కోర్ బాగా ఇచ్చారు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో వచ్చే ట్యూన్ బాగుంది. వైరల్ వయ్యారి అదిరిపోయింది. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ టాప్ నాచ్. ఎడిటింగ్ ఫస్టాఫ్ వీక్.. సెకండాఫ్ పర్లేదు. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. దర్శకుడు రాధాకృష్ణ తమ హీరోకు ఏం వచ్చు అని లెక్కలేసుకుని మరీ ఈ సినిమా తీసాడు. రొటీన్‌గానే ఉన్నా.. కిరీటిలోని టాలెంట్ అంతా బయటపెట్టాడు.
పంచ్ లైన్:
ఓవరాల్‌గా జూనియర్.. సినిమా కష్టమే గానీ కుర్రాడు మాత్రం ఓకే..!




