Chalaki Chanti: “వాళ్లు సర్వనాశనం అవుతారు.. ఇది నేను కడుపు మంటతో పెడుతున్న శాపం”
నటుడు చలాకీ చంటి తన ఆరోగ్య పుకార్లపై, కెరీర్ అడ్డంకులపై తీవ్రంగా స్పందించారు. ఆసుపత్రిలో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో తనపై తప్పుడు వార్తలు రాశారని, కొందరు తన ఎదుగుదలను అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి శాపాలు పెట్టారు. ఇండస్ట్రీలో అవకాశాలు కోల్పోవడానికి గల కారణాలను వివరిస్తూ, తనపై వచ్చిన ఇగో ప్రచారాన్ని ఖండించారు.

జబర్దస్త్ ఫేమ్ చలాకీ చంటి గతంలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. 2023లో ఆయన గుండె రక్తనాళాల్లో పూడికలు ఉన్నట్లు తేలడంతో వైద్యులు స్టంట్ వేసి.. కాపాడారు. ఆ పరిస్థితుల నుంచి కోలుకున్న ఆయన ఇప్పుడు మళ్లీ బుల్లితెర షూటింగ్స్‌తో బిజీ అవుతున్నారు. ఆయన గతంలో ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలోని పలు సున్నితమైన అంశాలను పంచుకున్నారు. తన ఆరోగ్యంపై వచ్చిన పుకార్లు, కెరీర్ అడ్డంకులు.. పరిశ్రమలోని కొన్ని విషయాలపై ఆయన భావోద్వేగంగా స్పందించారు. చంటి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో, కొన్ని యూట్యూబ్ ఛానెల్‌లు, ఇతర మీడియా సంస్థలు ఆయన ఆరోగ్య పరిస్థితిపై తప్పుడు సమాచారాన్ని, కాస్త శృతిమంచి కథనాలను టెలికాస్ట్ చేశాయని తెలిపారు. తనకు గుండెపోటు వచ్చిందని, బైపాస్ సర్జరీ జరిగిందని, ఇక చంటి లేడా అంటూ కూడా వార్తలు వచ్చాయని ఆయన ప్రస్తావించారు. అయితే, ఈ వార్తలు తనను బాధపెట్టినప్పటికీ, కనీసం ఆ ఛానెల్‌ల ద్వారా ప్రజలకు తాను హాస్పిటల్‌లో ఉన్నాననే విషయం తెలిసిందని, అందుకే వారికి ధన్యవాదాలు చెప్పాలనిపించిందని పేర్కొన్నారు. తన వల్ల వాళ్లు పొట్ట నింపుకునే అవకాశం వచ్చినందుకు సంతోషమే అని చంటి చెప్పారు.
అలాగే తన కెరీర్‌లో ఎదురైన సమస్యలపై చంటి తీవ్రంగా మాట్లాడారు. తనకు ఈగో ఉందని, షూటింగ్‌లకు వస్తే డిమాండ్లు చేస్తానని కొందరు తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు. ఈ ప్రచారం వల్ల తన కెరీర్‌లో జరగాల్సిన కొన్ని సంఘటనలు ఆగిపోయాయని, అవకాశాలు కోల్పోయానని స్పష్టం చేశారు. తనకు సంబంధం లేని విషయాల్లో ఇరికించి, తన కెరీర్‌ను అడ్డుకున్న ప్రతి ఒక్కరూ సర్వనాశనం కావాలని తీవ్రమైన శాపాలు పెట్టారు. “నేను తినే తిండి సాక్షిగా, నా ఒంటి మీద ఉండే వస్త్రం మీద ఒట్టేసి చెప్తున్నా… సర్వనాశనం అయిపోతారు ఆ వెదవలు. నేల నాకేస్తారు. ఇది నా శాపం, కడుపు మంటతో చెప్తున్న శాపం” అని ఆయన హెచ్చరించారు. తనను నాశనం చేయాలని కోరుకున్న వారికి తాను కూడా చెడు కోరుకోవడంలో తప్పులేదని, ఇది మానవ స్వభావమని చంటి విశ్లేషించారు. సముద్రంలో చెత్త వేస్తే అది తిరిగి కొట్టినట్టే, తనపై చెత్త వేసిన వారికి తాను తిప్పి కొడుతున్నానని చంటి ఎమోషనల్‌గా చెప్పారు. వారు నాశనమవ్వడాన్ని తాను బ్రతికుండగానే చూడాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు.
పరిశ్రమలో అవకాశాల గురించి చంటి మాట్లాడుతూ, తనకు ఇగో అనే ప్రచారం తనను ఎలా ప్రభావితం చేసిందో వివరించారు. ఒక ఆర్టిస్ట్ ప్రతిసారి తలుపు తీయగానే వంగి వంగి రాలేడని, అలాంటి వైఖరి కొందరికి నచ్చకపోవచ్చని పేర్కొన్నారు. టీమ్‌లోని ఎవరికైనా నచ్చకపోతే, అది తమ టైమ్ స్లాట్‌పై ప్రభావం చూపవచ్చని, వేరొకరిని తమ స్థానంలో పెట్టుకోవచ్చని వివరించారు. ఒకే ఆఫీస్‌కు వంద రోజులు తిరగడం సాధ్యం కాదని, దర్శకులతో మంచి పరిచయాలు, తమపై వారికి ఉండే నమ్మకం వల్లే అవకాశాలు వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. కో-డైరెక్టర్లు లేదా ఇతర సిబ్బంది ఎంత నెగెటివ్‌గా చెప్పినా, తమ గురించి తెలిసిన డైరెక్టర్స్ అవకాశాలు ఇస్తారని, కానీ కొత్త దర్శకులకు తమ గురించి తెలియకపోతే సమస్యలు వస్తాయని చంటి తెలియజేశారు.
Also Read: తన రెండు కీడ్నీలు పాడవడానికి రీజన్ ఏంటో చెప్పిన పంచ్ ప్రసాద్..




