నా భార్య కాలు, చెయ్యి పని చేయలేదు.. ఏడాది పాటు బెడ్ పైనే.. ఎమోషనల్ అయిన జబర్దస్త్ నటుడు
ప్రేక్షకులను ఆకట్టుకున్న టీవీ షోలు చాలా ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకునే షో పేరు జబర్దస్త్. సినిమాలకు మించి ఈ టీవీ షో పాపులర్ అయ్యింది. కామెడీ స్కిట్స్ ప్రేక్షకులను తెగ నవ్వించాయి. ఇక జబర్దస్త్ ద్వారా చాలా మంది కమెడియన్స్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.

జబర్దస్త్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వారిలో చాలా మందిలో ఫణి ఒకరు. జబర్దస్త్ షో ద్వారానే కాదు పలు సినిమాల్లోనూ నటించి మెప్పించారు. ప్రస్తుతం ఆయన సినిమాల స్పీడ్ తగ్గించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఫణి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. జబర్దస్త్ ఫణి ఈ ఇంటర్వ్యూలో తన సినిమా అప్డేట్స్ తో పాటు వ్యక్తిగత జీవితంగురించి కూడా ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. జబర్దస్త్ వంటి విజయవంతమైన షోలలో పాల్గొన్నప్పటికీ, ప్రస్తుతం అవకాశాలు తగ్గడంపై ఫణి ఆవేదన వ్యక్తం చేశారు. ఇండస్ట్రీలో బిజీగా ఉన్నవారికే అవకాశాలు వస్తాయని, వెనుకబడిన వారిని పట్టించుకునే వారు ఉండరని ఆయన అన్నారు. సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ గురించి కూడా ఫణి మాట్లాడారు.
అదేవిధంగా బిగ్ బాస్ షో గురించి మాట్లాడుతూ.. అది మంచా చెడా అనేది పక్కన పెడితే, పేరున్నవారు తగ్గుతుంటే కొత్తవారు వెలుగులోకి వస్తున్నారని తెలిపారు. బిగ్ బాస్ కంటెస్టెంట్ సుమన్ పట్ల తన ఆప్యాయతను వ్యక్తం చేస్తూ, సుమన్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించినందుకు సంతోషంగా ఉంది అని అన్నారు ఫణి. తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన కష్టాల గురించి కూడా ఫణి పంచుకున్నారు. తన భార్య సర్వైకల్ స్పాండిలైటిస్‌తో బాధపడింది, ఒక చెయ్యి, ఒక కాలు పనిచేయలేదు. దాదాపు ఒక సంవత్సరం పాటు బెడ్ రెస్ట్ లో ఉండాల్సి వచ్చిందని అన్నారు. ఆ సమయంలో ఆమెను ఎలా చూసుకున్నారో వివరిస్తూ, మహిళల త్యాగాలకు పాదాభివందనం చేస్తున్నా అన్నారు. తల్లిదండ్రులతో సమయం గడపడం, వారిని తరచుగా పలకరించడం ఎంత ముఖ్యం అని అన్నారు. తాను బిజీగా ఉన్నప్పుడు తన తండ్రిని చూసుకోలేకపోయాను అని, ఇప్పుడు ఆయన లేనప్పుడు తాను ఖాళీగా ఉన్నానని బాధపడ్డారు ఫణి. కళాకారులు చాలా సున్నిత మనస్కులని, బయట గంభీరంగా కనిపించినా లోపల చాలా భావోద్వేగాలతో ఉంటారని ఫణి అన్నారు.
తన పిల్లలు కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారని, తన కుమారుడు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, నటుడిగా రాణిస్తున్నాడని తెలిపారు. తన కుమార్తె ఇంజనీరింగ్ చదువుతోందని, ఆమె కష్టపడి చదువుతున్నందుకు గర్వపడుతున్నానని చెప్పారు. చివరగా, జబర్దస్త్ షోకు తిరిగి రావాలని, పాత టీమ్ అందరూ కలిసి మళ్ళీ కామెడీ చేయాలని తన కోరికను ఫణి వ్యక్తం చేశారు. మల్లెమాల ప్రొడక్షన్స్ పట్ల కృతజ్ఞతలు తెలుపుతూ, శ్యాం ప్రసాద్ రెడ్డిని తిరిగి అవకాశం ఇవ్వమని అభ్యర్థించారు ఫణి.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.
