Nazriya Nazim: వెంటనే మరో తెలుగు సినిమా చేయాలని వుంది.. మనసులో మాట బయటపెట్టిన నజ్రియా
మలయాళీ ముద్దుగుమ్మ నజ్రియా నజీమ్. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే అట్లీ దర్శకత్వం వహించిన మొదటి సినిమా రాజారాణి సినిమాతో ఇక్కడి ప్రేక్షకులకు పరిచయం అయ్యింది నజ్రియా.
మలయాళీ ముద్దుగుమ్మ నజ్రియా నజీమ్(Nazriya Nazim). తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే అట్లీ దర్శకత్వం వహించిన మొదటి సినిమా రాజారాణి సినిమాతో ఇక్కడి ప్రేక్షకులకు పరిచయం అయ్యింది నజ్రియా. ఈ అమ్మడి అందానికి నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఈ ముద్దుగుమ్మ తెలుగులో ఎప్పుడెప్పడు నటిస్తుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు నజ్రియా ఫ్యాన్స్. ఆ కోరిక ఇప్పుడు నాని నటించిన అంటే సుందరానికి సినిమాతో నెరవేరింది. నాని హీరో వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అంటే సుందరానికి ఈ సినిమాతో నేరుగా తెలుగులో తొలిసారి నటిస్తుంది నజ్రియా. జూన్ 10న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. దాంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది చిత్రయూనిట్. ఈ క్రమంలో మీడియాతో ముచ్చటించింది నేచురల్ బ్యూటీ నజ్రియా..
నజ్రియా మాట్లాడుతూ.. నాకు డ్యాన్స్ అంటే భయం. నటిస్తాను కానీ డ్యాన్స్ చేయమంటే మాత్రం అది సహజంగా రాదు. నాని డ్యాన్స్ అద్భుతంగా చేస్తారు. నాని డ్యాన్స్ చూసి కంగారు పడ్డా. నేను ఎలాంటి స్టెప్ వేసినా బావుందని నాని, వివేక్ ఆత్రేయ ఎంకరేజ్ చేసేవారు. డ్యాన్స్ విషయంలో చాలా కష్టపడ్డాను. అయితే యాక్టర్ ని కాబట్టి ఆ కష్టాన్ని కనిపించనీయకుండా మ్యానేజ్ చేశా..లీలా థామస్ పాత్రలో చాలా లేయర్ వున్నాయి. లోపల బాధ వున్నా అది బయటికి కనిపించనీయకూడదు. దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ పాత్రని అద్భుతంగా డిజైన్ చేశారు. లీలా థామస్ కి నజ్రియాకి ఒక్క పోలిక కూడా లేదు అన్నారు. అలాగే నాని గురించి మాట్లాడుతూ.. నాని గ్రేట్ కోస్టార్. ‘అంటే సుందరానికీ’ ప్రయాణంలో మేము మంచి ఫ్రండ్స్ అయిపోయాం. నాని గారికి స్టార్ అనే ఫీలింగ్ వుండదు. చాలా సపోర్ట్ చేశారు. నా గురించి చాలా కేర్ తీసుకున్నారు. ఈ ప్రాజెక్ట్ కి నన్ను సంప్రదించిన మొదటి వ్యక్తి నాని. ”కథ వినండి.. టైం తీసుకోండి.. కానీ వద్దని మాత్రం చెప్పకండి” అని చెప్పారు. నాని గారు చాలా నిజాయితీ గల యాక్టర్. అలాగే నరేష్ గారు, నదియా గారితో పని చేయడం కూడా గొప్ప అనుభవం. వారి నుండి చాలా నేర్చుకున్నా. వివేక్ చాలా నిజాయితీ గల దర్శకుడు. ఇకపై ఆయన దర్శకత్వంలో సినిమా అంటే ఓపెన్ డేట్స్ ఇచ్చేస్తా. ఆయన రైటింగ్ అద్భుతం. వివేక్ తో మరో సినిమా చేయడానికి ఎదురుచూస్తున్నా అన్నారు నజ్రియా .
కొత్త భాష అన్నప్పుడు తప్పకుండా సవాల్ వుంటుంది. అయితే ఈ సినిమా షూటింగ్ కి ముందే పూర్తి స్క్రిప్ట్ నా దగ్గర వుంది. దివ్య అనే ట్రాన్స్ లేటర్ సహాయంతో ప్రతి డైలాగ్ ని నేర్చుకున్నాను. నా డైలాగే కాదు స్క్రిప్ట్ లో వున్న అన్ని పాత్రల డైలాగులు నేర్చుకున్నా. ప్రతి పదానికి అర్ధం తెలుసుకున్నా. షూటింగ్ కి ముందే ప్రిపేర్ అవ్వడంతో షూటింగ్ చాలా సులువుగా అనిపించింది. డబ్బింగ్ విషయంలో చాలా పర్టికులర్ గా వుంటాను. నటించగానే నా పని అయిపోయిందని అనుకోను. మనం నటించిన దానికి మనమే డబ్బింగ్ చెబితేనే సంపూర్ణమని భావిస్తా. నేను ఏ భాషలో చేసినా సొంతగా డబ్బింగ్ చెప్పడానికే ప్రాధాన్యత ఇస్తా.. నాకు వెంటనే మరో తెలుగు సినిమా చేయాలని వుంది. మంచి స్క్రిప్ట్ రావాలని బలంగా కోరుకుంటున్నాను.