Ravi Teja: ‘ప్రేమతో కాదు బాధతో రాస్తున్న లేఖ..’ రవితేజకు ఫ్యాన్ ఎమోషనల్ లెటర్
ఈ మధ్య కాలంలో రవితేజ సినిమాల్లో బలమైన పాత్రలు కానీ యాక్టింగ్ కానీ కనిపించడం లేదు. రవితేజ తలుచుకుంటే.. 100 కోట్ల సినిమాలు చేయడం ఆయనకు మంచినీళ్లు తాగినంత ఈజీ. అంత వర్త్, మార్కెట్ ఉన్న స్టార్ యాక్టర్ ఆయన. కానీ ఎక్కడో తేడా కొడుతోంది. ఈ క్రమంలో మా అభిమాన హీరో రవితేజను మేము మిస్ అవుతున్నామంటూ ఓ ఫ్యాన్ రాసిన లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రవితేజ అంటే సెల్ఫ్ మేడ్ స్టార్. తనను తాను చెక్కుకున్న వ్యక్తి రవితేజ. చిరంజీవి తర్వాత స్వయంకృషితో వచ్చి.. శిఖరాగ్రానికి చేరిన స్టార్. కులం, మతం, ప్రాంతం.. ఇలాంటి తారతమ్యాలకు అతీతంగా రవితేజకు ఫ్యాన్స్ ఉంటారు. రవితేజ అంటే ఎంతోమందికి స్ఫూర్తి. సినిమాల మీద పిచ్చితో.. అసిస్టెంట్‌గా స్టార్టయి.. క్యారెక్టర్ వేషాలు వేసి.. ఆపై హీరోగా మారి.. మాస్ మహారాజాగా అవతరించాడు రవితేజ. రవితేజ సినిమా చేశాడంటే.. మినిమం గ్యారెంటీ ఎంటర్టైన్‌మెంట్ అనే పేరు ఉండేది. కానీ వరుస సినిమాలు చేస్తున్న రవితేజ.. ఫ్యాన్స్‌ను మాత్రం నిరాశపరుస్తున్నాడు. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్.. ఇలా వరసగా నాలుగు సినిమాలు కూడా ప్లాప్ అయ్యాయి. ముఖ్యంగా మిస్టర్ బచ్చన్ సినిమాను ఫ్యాన్స్ అసలు తీసుకోలేకపోతున్నారు. కేవలం డైరెక్టర్ హరీశ్ శంకర్‌తో ఉన్న రిలేషన్‌తో ఈ సినిమా చేశాడని.. సినిమాలో పస లేదన్నది అభిమానుల వెర్షన్. ఈ క్రమంలో ఓ అభిమాని రవితేజకు ఏకంగా లేఖ రాశాడు.
“రవి అన్న ఇది ప్రేమతో రాస్తున్న లేఖ కాదు.. బాధతో రాస్తున్న లేఖ. నాకు చిన్నప్పటి నుంచి సినిమా అంటే రవితేజనే. నాకు చిన్నప్పటి నుంచి అన్నీ మీరే.. మీకు సినిమా తప్ప మరొకటి తెలియనట్లే.. మాకు నువ్వు తప్ప ఇంకొకటి తెలియదు అన్నా.. 2011లో మిరపకాయ్ సినిమా తర్వాత నుంచి క్రాక్ సినిమాలో మాత్రమే మా అసలైన రవి అన్నను చూశాం. ఈ మధ్యలో వచ్చిన మూవీస్ కొన్ని హిట్ అవ్వొచ్చు.. కానీ అవి నీ స్థాయి సినిమాలైతే కాదు. నువ్వు మాకు దగ్గరగా ఉంటే గట్టిగా కౌగలించుకొని ఏడ్చి.. బాధ చెప్పుకోవాలని ఉంది. దయచేసి కథల మీద ఫోకస్ పెట్టన్నా. రవితేజ అభిమానులందరూ కాలర్ ఎగరేసేలా హిట్లు ఇవ్వు. సగటు రవితేజ అభిమాని థియేటర్ నుంచి కన్నీళ్లతో బయటికి వస్తున్నాడు.. సినిమా సినిమాకి మా బాధ పెరిగిపోతుంది. చుట్టుపక్కల వాళ్లు నిన్ను ఎగతాళి చేస్తుంటే తట్టుకోలేకపోతున్నా. మీ చిత్రాల్లో నన్ను ఆకర్షించిన మేజిక్ ఇప్పుడు కనుమరుగైంది. అలాంటి రోజుల కోసం ఎదురుచూస్తున్నాను రవన్నా.” అంటూ ఓ అభిమాని రాసిన ఈ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




