AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trivikram Srinivas: “సీతారామశాస్త్రి గారు నాకు తెలిసిన అద్భుతం”.. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

సీతారామశాస్త్రి గారితో చాలా వెన్నెల రాత్రులు గడిపాను. కానీ వెన్నెల లేని ఆయన గదిలో ఆయన ధూమ మేఘాల మధ్యలో ఆయన్నే చంద్రుడిలా చూశాను చాలాసార్లు.

Trivikram Srinivas: సీతారామశాస్త్రి గారు నాకు తెలిసిన అద్భుతం.. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Trivikram
Rajitha Chanti
|

Updated on: May 21, 2022 | 1:40 PM

Share

సినీ గేయ రచయిత సీతారామశాస్త్రి తనకు తెలిసిన ఓ అద్భుతమని.. పాటలో ఉన్న భావం కన్న లోతైన మనిషని..ఆయనతో గడిపిన సమయం చాలా విలువైనదన్నారు డైరక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్.. సిరివెన్నెల జయంతి వేడుకలను హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో శుక్రవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.. గరికపాటి నరసింహారావు, ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి, తోటకూర ప్రసాద్ విశిష్ట పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతారామశాస్త్రితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్.

ఈ సందర్భంగా డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ” సీతారామశాస్త్రి గారితో చాలా వెన్నెల రాత్రులు గడిపాను. కానీ వెన్నెల లేని ఆయన గదిలో ఆయన ధూమ మేఘాల మధ్యలో ఆయన్నే చంద్రుడిలా చూశాను చాలాసార్లు. చాలా సంవత్సరాల పాటు మరుపురాని క్షణాలు, గొప్ప గొప్ప పాటలు. నా సినిమాలోవి మాత్రమే కాదు వేరే వాళ్ళ సినిమాలో పాటలు రాసినా సరే అర్థరాత్రి ఫోన్ చేసి శ్రీను మంచి ఒక లైన్ వచ్చింది విను అని చెప్పేవారు. అలాంటి ఎన్నో గొప్ప వాక్యాలను విన్నాను. ఒక కవి పాట పాడుతున్నప్పుడు విని ఆనందించగలడం గొప్ప అదృష్టం. అంతకు మించిన విలాసం మరొకటి ఉండదని నేను అనుకుంటున్నాను.

ఎందుకంటే కవి గొంతు గొప్పగా లేకపోయినా.. అతని గుండె గొప్పగా ఉంటుంది. ఇప్పటికీ ఆయన పాడి వినిపించిన గొప్ప గొప్ప పాటలు నా మదిలో మెదులుతున్నాయి. ఆయనతో గడిపిన సమయం చాలా గుర్తుపెట్టుకోగలిగినది. పాటలో ఉన్న భావం కన్నా లోతైన మనిషి. అది మనకు అర్థమైన దానికన్నా విస్తారమైన మనిషి. దానిని మనం విశ్లేషించే దానికన్నా గాఢమైన మనిషి. అలాంటి మనిషితోటి కొన్ని సంవత్సరాలు గడపటం ఆనందం.. ఇంకా కొన్ని సంవత్సరాలు గడపలేకపోవడం బాధాకరం. కొన్ని కావ్యాలకు ముగింపు ఉండకూడదు అనిపిస్తుంది. కొన్ని పుస్తకాలకు ఆఖరి పేజీ రాకూడదు అనిపిస్తుంది. సీతారామశాస్త్రి గారు కూడా అలాంటి ఒక కావ్యం, అలాంటి ఒక పుస్తకం, అలాంటి ఒక చిత్రం. కళ్ళకి రంగులుంటాయి గానీ కన్నీరుకి రంగు ఉండదు. అలాగే పదాలకు రకరకాల భావాలు ఉంటాయి. కానీ ఆయన వాటన్నింటిని కలిపి ఒక మనిషిగా తయారు చేసి, ఒక మనిషి గుండెకి తగిలించే బాణంలా చేసి మన మీదకు విసరగలిగిన కవిగా ఆయనను చూస్తాను.

తన ఉనికిని చాటడానికి ఆయన రెండు చేతుల్ని పైకెత్తి, ఆకాశం వైపు చూసి ఒక్కసారి ఎలుగెత్తి అరిచాడు. నా ఉఛ్వాసం కవనం అన్నాడు.. నా నిశ్వాసం గానం అన్నాడు. శబ్దాన్నే సైన్యంగా చేశాడు.. నిశ్శబ్దంతో కూడా యుద్ధం చేశాడు. అలాంటి గొప్ప కవి మనల్ని విడిచి వెళ్ళిపోయారు. కానీ ఆయన తాలూకు అక్షరాలు మనతోనే ఉన్నాయి. అందుకే ఆయన పాటలు ఇప్పటికీ ఎప్పటికీ మనకి రెలెవెంట్ గానే ఉంటాయి. సీతారామశాస్త్రి గారు నాకు తెలిసిన అద్భుతం.” అన్నారు.