Devi Movie: అతడు పవర్ ఫుల్ SI.. కట్ చేస్తే.. దేవి సినిమాలో విలన్.. అసలు విషయాలు చెప్పిన డైరెక్టర్..
డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన సూపర్ హిట్ చిత్రాల్లో దేవి ఒకటి. ఇందులో హీరోయిన్ ప్రేమ టైటిల్ పాత్రను పోషించగా, వనిత , షిజు , అబు సలీం, భానుచందర్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. అప్పట్లో ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన తొలి సినిమా ఇది.

డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన సోషియో ఫాంటసీ చిత్రం దేవి. 1999 మార్చి 12న విడుదలైన ఈ సినిమా విడుదలై 25 ఏళ్లు పూర్తైంది. కానీ ఇప్పటికీ ఈ సినిమా వస్తే టీవీలకు అతుక్కుపోతుంటారు. ఇందులో ప్రేమ ప్రధాన పాత్రలో నటించగా.. వనితా, షిజు , అబు సలీం, భానుచందర్ కీలకపాత్రలు పోషించారు. తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు నటుడు దేవి ప్రసాద్. అలాగే కోడి రామకృష్ణ గారి గ్రాఫిక్స్, కథా బలం గురించి చెప్పుకోచ్చారు. ‘అమ్మోరు’ చిత్రం తెలుగులో గ్రాఫిక్స్ ఉపయోగించిన మొదటి సినిమా. ఈ చిత్రం కోసం అమెరికా నుండి క్రిస్ అనే గ్రాఫిక్స్ నిపుణుడిని తీసుకువచ్చారు. అప్పట్లో గ్రాఫిక్స్ కోసం గ్రీన్ మ్యాట్, షూటింగ్ విధానంపై అవగాహన కూడా తక్కువగా ఉండేది. కోడి రామకృష్ణ గారి బలమైన నమ్మకం ఏమిటంటే, కేవలం గ్రాఫిక్స్ సినిమాను విజయవంతం చేయవు. భావోద్వేగ కనెక్టివిటీ ఉన్న కథ ఉంటేనే ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తారని ఆయన నమ్మేవారు. సాంకేతికతను భావోద్వేగాలను పెంపొందించడానికి ఉపయోగించాలి తప్ప, సాంకేతికత కోసం కథను మార్చకూడదని ఆయన సిద్ధాంతం. విఠలాచార్య గారి ‘ట్రిక్ షాట్స్’ లేదా రవికాంత్ నాగాయిచ్ గారి ‘ట్రిక్ ఫోటోగ్రఫీ’ సినిమాలను ప్రేక్షకులు ఆదరించడానికి కూడా వాటిలోని కథా గమనం, భావోద్వేగాలే కారణమని దేవి ప్రసాద్ అన్నారు. కంటెంట్ లేకపోతే ఎంత అద్భుతమైన గ్రాఫిక్స్ ఉన్నా సినిమా విజయం సాధించదని ఆయన స్పష్టం చేశారు. కథ, స్క్రీన్‌ప్లే, భావోద్వేగాలు బలంగా ఉంటే, ఒకటి రెండు గ్రాఫిక్స్ షాట్స్ బాగోకపోయినా ప్రేక్షకులు క్షమించేస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.
‘అమ్మోరు’ చిత్రంలో తాను పనిచేయలేదని, అయితే ‘దేవి’ సినిమాకు తాను కో-డైరెక్టర్‌గా పనిచేశానని దేవి ప్రసాద్ తెలిపారు. ‘అమ్మోరు’ గ్రాఫిక్స్ అమెరికా వంటి విదేశాల్లో చేయించగా, ‘దేవి’ సినిమాకు వచ్చేసరికి బాంబే (ముంబై), చెన్నైలలో గ్రాఫిక్స్ నిపుణులు అందుబాటులోకి వచ్చారు. ‘దేవి’ చిత్రానికి సంబంధించిన గ్రాఫిక్స్ పనిని బాంబేలోని క్రస్ట్ కమ్యూనికేషన్స్ నిర్వహించింది. సీజీ గ్రాఫిక్స్ ఎక్కడ, ఎందుకు ఉపయోగించాలనే విషయంలో కోడి రామకృష్ణ గారికి స్పష్టమైన అవగాహన ఉండేదని, అది ఆయన విజయ రహస్యమని దేవి ప్రసాద్ వివరించారు.
‘దేవి’ సినిమా విలన్ అబూ సలీం ఎంపిక కూడా ఆసక్తికరంగా జరిగింది. నిజానికి అబూ సలీం కేరళకు చెందిన ఒక ఎస్.ఐ. మొదటిగా, ఎం.ఎస్. రాజు గారు ఒక ఆఫ్రికన్ వ్యక్తిని విలన్ పాత్ర కోసం తీసుకువచ్చారు. అయితే, అతనికి తెలుగు రాకపోవడం, పాత్రను అర్థం చేసుకోలేకపోవడంతో ఆ ప్రయత్నం విరమించుకున్నారు. షూటింగ్ కోసం వైజాగ్‌కు వెళ్ళిన తర్వాత కూడా విలన్ ఎంపికపై అనిశ్చితి కొనసాగింది. చివరికి, ఒక కొత్త వ్యక్తిని ఎంపిక చేయాలనే ప్రయత్నంలో అబూ సలీం వచ్చారు. షర్ట్ తీసినప్పుడు అతని బాడీబిల్డర్ ఫిజిక్ చిత్ర యూనిట్‌ను ఆకట్టుకుంది. అతనికి కాంటాక్ట్ లెన్స్, విగ్గు పెట్టి, తెలుగు రాకపోయినా ఆ పాత్రకు తగ్గట్లుగా నటింపజేశారు. అబూ సలీం నిజమైన ఎత్తు 6 అడుగుల లోపే ఉన్నా, వాటర్ లోంచి రావడం వంటి షాట్స్‌లో ఫోటోగ్రఫీ టెక్నిక్స్‌తో అతన్ని భారీకాయుడిగా చూపించగలిగారు. అతనికి రవి (బొమ్మాళి రవి) డబ్బింగ్ చెప్పారు. ఈ విధంగా, సాంకేతిక నైపుణ్యాన్ని, కథాబలాన్ని సమన్వయం చేస్తూ కోడి రామకృష్ణ తన సినిమాలను అద్భుతంగా రూపొందించారని దేవి ప్రసాద్ పేర్కొన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Trivikram : ఆ పాట విని ఆశ్చర్యపోయా.. తెలుగు డిక్షనరీ కొని మరీ అర్థం వెతికాను.. త్రివిక్రమ్ శ్రీనివాస్..
