AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 : ఐపీఎల్ 2026పై యుద్ధ నీడలు.. గ్యాస్ కొరతతో క్రికెట్ పండుగకు బ్రేక్ పడుతుందా?

IPL 2026 : ప్రపంచ రాజకీయాల్లో జరుగుతున్న యుద్ధ సెగలు ఇప్పుడు క్రికెట్ మైదానాన్ని కూడా తాకాయి. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు భారతీయ క్రీడాభిమానుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. ముఖ్యంగా దేశవ్యాప్తంగా పండుగలా జరుపుకునే ఐపీఎల్ 2026 (IPL 2026) నిర్వహణపై ఈ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.

IPL 2026 : ఐపీఎల్ 2026పై యుద్ధ నీడలు.. గ్యాస్ కొరతతో క్రికెట్ పండుగకు బ్రేక్ పడుతుందా?
Ipl 2026 Bcci
Rakesh
|

Updated on: Mar 10, 2026 | 5:54 PM

Share

IPL 2026 : ప్రపంచ రాజకీయాల్లో జరుగుతున్న యుద్ధ సెగలు ఇప్పుడు క్రికెట్ మైదానాన్ని కూడా తాకాయి. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు భారతీయ క్రీడాభిమానుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. ముఖ్యంగా దేశవ్యాప్తంగా పండుగలా జరుపుకునే ఐపీఎల్ 2026 (IPL 2026) నిర్వహణపై ఈ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్‌పీజీ (LPG) సరఫరాలో ఏర్పడిన అంతరాయం కారణంగా ఈ మెగా టోర్నీకి ఆటంకాలు కలిగేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం గృహ అవసరాలకే గ్యాస్ సరఫరాకు ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించడంతో, కమర్షియల్ రంగాలపై దాని ప్రభావం తీవ్రంగా పడింది.

ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ ఈ పరిణామాలపై స్పందించారు. పరిస్థితులు క్షణక్షణానికి మారుతున్నాయని, తాము ప్రతి అడుగును జాగ్రత్తగా గమనిస్తున్నామని ఆయన తెలిపారు. యుద్ధం కారణంగా రోజుకో కొత్త సమస్య పుట్టుకొస్తోందని, ఐపీఎల్ ప్రారంభమయ్యే సమయానికి పరిస్థితుల తీవ్రతను బట్టి తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‎తో పేర్కొన్నారు. మార్చి 28 నుంచి ఐపీఎల్ ప్రారంభం కావాల్సి ఉండగా, ఈ గందరగోళం వల్ల షెడ్యూల్ ప్రకటనలో జాప్యం జరుగుతోంది.

యుద్ధం వల్ల చమురు సరఫరా దెబ్బతినడంతో బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లోని హోటళ్లు గ్యాస్ కొరతను ఎదుర్కొంటున్నాయి. హోటల్ యజమానుల సంఘాలు తమ వద్ద కేవలం ఒకటి లేదా రెండు రోజులకు సరిపడా గ్యాస్ మాత్రమే ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని హోటళ్లు ఇప్పటికే గ్యాస్ వినియోగాన్ని తగ్గించేందుకు తమ మెనూను కుదించేశాయి. ఐపీఎల్ మ్యాచులు జరిగినప్పుడు వేలాది మంది అభిమానులు, క్రీడాకారులు హోటళ్లలోనే ఉంటారు కాబట్టి, ఈ కొరత టోర్నీ నిర్వహణకు పెద్ద సవాలుగా మారింది.

కేవలం గ్యాస్ సరఫరా మాత్రమే కాదు, విమాన ప్రయాణాలపై కూడా ఈ యుద్ధం తీవ్ర ప్రభావం చూపుతోంది. టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత కూడా జింబాబ్వే, వెస్టిండీస్, సౌతాఫ్రికా వంటి జట్లు విమాన మార్గాల్లో అంతరాయం కలగడంతో భారత్ నుంచి వెళ్లలేక ఇక్కడే చిక్కుకుపోయాయి. ఐపీఎల్ ప్రారంభమైతే విదేశీ ఆటగాళ్లు భారత్ కు రావడం, దేశంలోని వివిధ నగరాలకు ప్రయాణించడం క్లిష్టంగా మారే అవకాశం ఉంది. మరోవైపు కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉండటంతో బీసీసీఐపై ఒత్తిడి పెరుగుతోంది.

ఇంత గందరగోళం ఉన్నప్పటికీ, ఐపీఎల్ ఫ్రాంచైజీలు మాత్రం తమ పనిలో తాము ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాజస్థాన్ రాయల్స్ ఇప్పటికే ట్రైనింగ్ క్యాంప్స్ మొదలుపెట్టగా, పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లు ధర్మశాలలో ప్రాక్టీస్ చేస్తున్నారు. టోర్నీ నిర్ణీత సమయానికే ప్రారంభం కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నప్పటికీ, అంతర్జాతీయ పరిస్థితులు, ఇంధన కొరత ఐపీఎల్ 2026 భవితవ్యాన్ని తేల్చాల్సి ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండ

Follow Us