AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL : లంక టూర్‌కు ముందు గంభీర్ మాస్టర్ ప్లాన్.. ఇద్దరు కొత్త ఆటగాళ్లకు కీలక బాధ్యతలు

IND vs SL : శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు ముందు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కీలక సూచనలు చేశారు. బుమ్రా, వాషింగ్టన్ సుందర్ గైర్హాజరీలో సారాంశ్ జైన్, ఆకిబ్ నబీకి అవకాశం దక్కింది. కొత్త ఫీల్డింగ్ కోచ్ శుభదీప్ ఘోష్‌తో భారత జట్టు సరికొత్త సవాళ్లకు సిద్ధమవుతోంది.

IND vs SL : లంక టూర్‌కు ముందు గంభీర్ మాస్టర్ ప్లాన్.. ఇద్దరు కొత్త ఆటగాళ్లకు కీలక బాధ్యతలు
Gautam Gambhir (1)
Rakesh
|

Updated on: Aug 06, 2026 | 4:06 PM

Share

IND vs SL : భారత్, శ్రీలంక జట్ల మధ్య అత్యంత ఉత్కంఠభరితంగా జరగనున్న టెస్టు సిరీస్ ప్రారంభానికి మరికొద్ది రోజులే సమయం ఉంది. ఈ చారిత్రాత్మక సిరీస్ ప్రారంభానికి ముందే టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పూర్తి జట్టును ఉద్దేశించి ప్రసంగించారు. జట్టులోకి కొత్తగా వచ్చిన ఆటగాళ్లను ఆహ్వానిస్తూనే, రాబోయే సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని గంభీర్ హెచ్చరించారు. ఆగస్టు 15 నుంచి ప్రారంభమయ్యే మొదటి టెస్ట్ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు టీమిండియా పూర్తి స్థాయి సామర్థ్యంతో సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

వాషింగ్టన్ సుందర్ స్థానంలో సారాంశ్ జైన్

భారత ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయపడటంతో మధ్యప్రదేశ్‌కు చెందిన 33 ఏళ్ల ఆల్ రౌండర్ సారాంశ్ జైన్‌కు తొలిసారిగా భారత టెస్టు జట్టులో చోటు లభించింది. ఇటీవల శ్రీలంక ‘ఎ’ జట్టుపై ఇండియా ‘ఎ’ తరఫున సారాంశ్ జైన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. బంతితో 6 వికెట్లు తీయడంతో పాటు కీలకమైన సమయంలో 70 పరుగుల ఆల్ రౌండ్ ఇన్నింగ్స్ ఆడి సెలక్టర్ల నమ్మకాన్ని గెలుచుకున్నారు. గౌతమ్ గంభీర్ సారాంశ్‌ను అభినందిస్తూ.. “ఇక్కడిదాకా రావడానికి ఎంతో కష్టపడ్డావ్, ఇప్పుడు లభించిన అవకాశాన్ని ఉపయోగించుకుని దేశానికి, నీ కుటుంబానికి మంచి పేరు తీసుకురావాలి” అని పిలుపునిచ్చారు.

బుమ్రా లేని లోటు తీర్చేందుకు ఆకిబ్ నబీ

టీమిండియా మెయిన్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయపడటంతో ఆయన స్థానంలో జమ్మూ కాశ్మీర్ స్పీడ్‌స్టర్ ఆకిబ్ నబీని జట్టులోకి తీసుకున్నారు. గత రంజీ సీజన్‌లో ఆకిబ్ నబీ ఏకంగా 60 వికెట్లు పడగొట్టి టోర్నీలోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించారు. రంజీ ట్రోఫీని జమ్మూ కాశ్మీర్ గెలుచుకోవడంలో ఆయన అత్యంత కీలక పాత్ర పోషించారు. ప్రారంభంలో ఎంపిక కాకపోవడంపై విమర్శలు వచ్చినప్పటికీ, చివరికి ఆయన ప్రతిభకు తగ్గ గుర్తింపు దక్కి టీమిండియా పిలుపు లభించింది. ఆకిబ్ నబీని ప్రత్యేకంగా అభినందించిన గంభీర్, ఇదే ఫామ్‌ను అంతర్జాతీయ స్థాయిలో కూడా కొనసాగించాలని కోరారు.

కొత్త ఫీల్డింగ్ కోచ్‌గా శుభదీప్ ఘోష్

జట్టు ఆటగాళ్లతో పాటు టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌లో కూడా కీలక మార్పు జరిగింది. గత కొంతకాలంగా జట్టు ఫీల్డింగ్ ప్రమాణాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో టి.దిలీప్ స్థానంలో 57 ఏళ్ల శుభదీప్ ఘోష్‌ను నూతన ఫీల్డింగ్ కోచ్‌గా నియమించారు. గౌతమ్ గంభీర్ శుభదీప్ ఘోష్‌ను కూడా జట్టులోకి సాధరంగా ఆహ్వానించారు. ఆయన అనుభవం, పనిపట్ల ఉన్న అంకితభావం, ఎనర్జీ జట్టుకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయని, రాబోయే రోజుల్లో భారత జట్టు ఫీల్డింగ్ విభాగాన్ని ఆయన సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తారని గంభీర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us