మన శంకరవరప్రసాద్ గారు మూవీ రివ్యూ: వింటేజ్ బాస్ ఈజ్ బ్యాక్.. పక్కా పండగ సినిమా.. టాక్ ఎలా ఉందంటే.?
Mana Shankara Varaprasad Garu: చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ అనగానే అందరికీ ఒక వైబ్రేషన్. వీళ్ళ కాంబినేషన్లో ఎలాంటి సినిమా రాబోతుందా అని అందరూ ఆసక్తిగా వేచి చూశారు. అలాంటి మన శంకరవరప్రసాద్ గారు ఈరోజు ప్రేక్షకులు ముందుకు వచ్చేశారు. మరి అది ఎలా ఉంది.. నవ్వించాడా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..

మూవీ రివ్యూ: మన శంకరవరప్రసాద్ గారు
నటీనటులు: చిరంజీవి, నయనతార, వెంకటేష్, కేథరిన్ త్రెసా, సచిన్ ఖేడ్ కర్, బుల్లి రాజు, అభినవ్ గోమటం, హర్షవర్ధన్ తదితరులు
ఎడిటింగ్: తమ్మి రాజు
సంగీతం: భీమ్స్
సినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డి
కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం: అనిల్ రావిపూడి
నిర్మాతలు: సాహు గారపాటి, సుస్మిత కొణిదెల
కథ:
శంకరవరప్రసాద్ (చిరంజీవి) ఇంటెలిజెన్స్ ఆఫీసర్. కేంద్ర మంత్రి దగ్గర సెక్యూరిటీగా ఉంటాడు. అతని భార్య శశిరేఖ (నయనతార) ఇండియాలోనే రిచెస్ట్ బిజినెస్ ఉమెన్. ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. కాని చిన్నచిన్న ఈగోలతో విడిపోతారు. తన పిల్లల్ని కూడా చూడలేకపోతున్నాను అని శంకరవరప్రసాద్ బాగా ఫీల్ అవుతుంటాడు. అలాంటి సమయంలో తన టీం నారాయణ (హర్షవర్ధన్), జ్వాల (కేథరిన్ త్రెసా) మరో ఇద్దరితో కలిసి పిల్లలకు దగ్గర ఇవ్వడానికి ఒక ప్లాన్ వేస్తారు. అదే సమయంలో శశిరేఖ తండ్రి మీద అటాక్ జరుగుతుంది. అది ఎవరు చేశారో తెలుసుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ శంకర వరప్రసాద్ ను శశిరేఖ ఇంటికి సెక్యూరిటీ ఆఫీసర్ గా పంపిస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది.. ఎలా విడిపోయిన భార్యాభర్తలు కలిశారు అనేది మిగిలిన కథ..
కథనం:
కథ కావాలి.. కథనం ఉండాలి అనుకుంటే మన శంకరవరప్రసాద్ గారు చాలా రొటీన్ గానే అనిపిస్తారు. కానీ అనిల్ రావిపూడి సినిమాలలో కథ కంటే ఎక్కువగా కథనం వేగంగా ఉంటుంది. మనోడు స్టోరీ మీద కంటే ఎంటర్టైన్మెంట్ మీద ఎక్కువ దృష్టి పెడతాడు. అందుకే సక్సెస్ రేట్ కూడా ఎక్కువగా ఉంది. నో లాజిక్.. ఓన్లీ వింటేజ్ మెగా మ్యాజిక్ కోసం అయితే మన శంకరవరప్రసాద్ గారు మనసుకి నచ్చేస్తారు. ఇప్పుడు అసలు విషయంలోకి వచ్చేద్దాం.. ఈ జనరేషన్ దర్శకులలో చిరంజీవిని ఆయన అర్థం చేసుకున్నట్టు ఎవరు అర్థం చేసుకోలేదు. పాతికేళ్లు దాటిపోయింది మెగాస్టార్ ను అలా స్క్రీన్ మీద చూసి. అన్నయ్య సినిమాలో ఇలాంటి కామెడీ టైమింగ్ చూసాము. ఆ తర్వాత ఎన్నో బ్లాక్బస్టర్స్ చిరంజీవి ఇచ్చాడు కానీ.. ఆ కామెడీ మాత్రం రాలేదు.. ఇన్నాళ్లకు ఆ లోటు అనిల్ తీర్చేశాడు. ఫస్టాఫ్ లోనే పైసా వసూల్ అయిపోయింది.. మెగా వింటేజ్ చమక్కులు.. ఆ పంచ్ డైలాగులు.. సెల్ఫ్ సెటైర్లు.. చిరంజీవికి మాత్రమే సాధ్యమైన కొన్ని మోడ్యులేషన్స్.. ఏ ఒక్కటి వదలకుండా స్క్రీన్ మీద దించేశాడు.
ఇక చిరంజీవి కూడా ఎంత ఆకలి మీద ఉన్నాడో అనేది ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది.. తనకు కామిక్ క్యారెక్టర్ దొరికితే ఎలా రెచ్చిపోతాడో మరోసారి ప్రూవ్ చేశాడు మెగాస్టార్. జస్ట్ టైం గ్యాప్ అంతే టైమింగ్ లో అస్సలు గ్యాప్ ఉండదని స్క్రీన్ మీద రఫ్ ఆడించాడు. ఒక్కొక్క సీనులో చిరంజీవి కామెడీ టైమింగ్ చూస్తుంటే ఘరానా మొగుడు గుర్తొచ్చింది. ఫస్టాఫ్ అయితే హిలేరియస్.. సెకండ్ హాఫ్ అక్కడక్కడ కాస్త తగినట్టు అనిపిస్తుంది కానీ చివర్లో సెట్ అయిపోయింది. వెంకటేష్ వచ్చాక స్క్రీన్ దద్దరిల్లిపోయింది. చిన్న చిన్న సీన్స్ కూడా అనిల్ రావిపూడి రాసిన దానికంటే 100 రెట్లు ఇంప్రోవైజ్ చేశాడు చిరు. సింపుల్ గా చెప్పాలంటే శంకరవరప్రసాద్ గా తన ఆకలి మొత్తం తీర్చేసుకున్నాడు బాస్. లుక్స్ పరంగా కూడా చిరంజీవి నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాడు.. హుక్ స్టెప్, మెగా విక్టరీ సాంగ్స్ విజువల్ గా అదిరిపోయాయి. చాలా సన్నివేశాలు చిరంజీవి పాత సినిమాలు నుంచి తీసుకొని రీ క్రియేట్ చేశాడు అనిల్. మరీ ముఖ్యంగా 90స్ లో వచ్చిన ఘరానా మొగుడు రిఫరెన్స్ ఎక్కువగా ఉంది. చిరంజీవి కూడా 30 ఏళ్ల తర్వాత అదే మ్యాజిక్ మళ్ళీ రిపీట్ చేశాడు. ఈ తరం దర్శకులలో ఆడవాళ్ళ సైకాలజీ అనిల్ రావిపూడి కంటే ఎవరికీ బాగా తెలియదు.. సెకండ్ హాఫ్ లో వాళ్లు సైకాలజీ మీద వచ్చే ఒక సీన్ భలే ఉంది.
నటీనటులు:
చిరంజీవి నటన గురించి కొత్తగా ఏం చెప్పాలి.. కానీ ఆయనకు ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్ వస్తే ఎలా స్క్రీన్ మీద నవ్వులు పూయిస్తాడు అనేది మన శంకరవరప్రసాద్ గారు మరోసారి నిరూపించింది. చిరును ఎలా వాడుకోవచ్చో ఈ సినిమా మళ్లీ చూపించింది. వెంకటేష్ ఉన్నది 20 నిమిషాలైనా కూడా అదరగొట్టాడు. నయనతార కూడా చాలా అందంగా ఉంది. కేథరిన్ త్రెసా, సచిన్ ఖేడ్ కర్, బుల్లి రాజు, అభినవ్ గోమటం, హర్షవర్ధన్ ఎవరికి వాళ్లు తమ పాత్రలకు న్యాయం చేశారు.
టెక్నికల్ టీం:
భీమ్స్ మ్యూజిక్ బాగుంది. పాటలు వినడానికి మాత్రమే కాదు స్క్రీన్ మీద కూడా చూడడానికి చాలా బాగున్నాయి. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. తమ్మి రాజు ఎడిటింగ్ కూడా బాగుంది. దర్శకుడు అనిల్ రావిపూడి మరొకసారి తన రైటింగ్ పవర్ చూపించాడు. పాత కథ తీసుకున్న కూడా దాన్ని ఎంటర్టైన్మెంట్ పద్ధతిలో చెప్పే ప్రయత్నం చేశాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
పంచ్ లైన్:
ఓవరాల్ గా మన శంకరవరప్రసాద్ గారు.. బాగున్నారు.. పండక్కి నవ్విస్తారు..!
