బాక్సాఫీస్ వద్ద మళ్ళీ మెగాస్టార్ vs నటసింహం.. గ్యాంగ్‌స్టర్లుగా చిరంజీవి, బాలయ్య సరికొత్త యుద్ధం!
తెలుగు సినీ సామ్రాజ్యంలో దశాబ్దాలుగా ఇద్దరు ధృవతారలు సినీ ప్రేమికులను తమ నటనతో అలరిస్తూ అప్రతిహతంగా దూసుకుపోతున్నారు. ఒకరు తన డ్యాన్సులు, గ్రేస్‌తో వెండితెరను ఏలితే.. మరొకరు తన పవర్ ఫుల్ డైలాగులు, యాక్షన్ సన్నివేశాలతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తారు.

వీరిద్దరి సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయంటే చాలు.. తెలుగు రాష్ట్రాల్లో పండగ వాతావరణం నెలకొంటుంది. గత నలభై ఏళ్లుగా వీరిద్దరి మధ్య సాగుతున్న పోటీ సినీ అభిమానులకు ఎంతో ఇష్టం. ఒకసారి ఆయన పైచేయి సాధిస్తే, మరోసారి ఈయన తన సత్తా చాటుతుంటారు. ఇప్పుడు మళ్ళీ అదే క్రేజీ పోటీకి రంగం సిద్ధమైంది. అదీ కూడా ఇద్దరు హీరోలు ఒకే తరహా పాత్రలతో, ఒకే రకమైన మాస్ బ్యాక్‌డ్రాప్‌తో బాక్సాఫీస్ వద్ద తలపడబోతున్నారు. వచ్చే సంక్రాంతికి రంజుగా సాగబోతున్న ఆ ‘మెగా-నందమూరి’ వార్ ఏంటి? అసలు ఆ గ్యాంగ్‌స్టర్ల కథలేంటి?
సంక్రాంతి బరిలో మరోసారి..
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక సంవత్సరాలు పోటీ పడిన స్టార్ హీరోలు ఎవరంటే మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ పేర్లు ముందుగా వినిపిస్తాయి. ఇప్పుడు మళ్ళీ వీరిద్దరూ 2027 సంక్రాంతిని టార్గెట్ చేస్తూ పక్కా మాస్ యాక్షన్ సినిమాలను సిద్ధం చేస్తున్నారు. విశేషమేమిటంటే, ఈసారి ఇద్దరు హీరోలు గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో సాగే కథలతోనే ప్రేక్షకులను అలరించబోతున్నారని సమాచారం. దీంతో ఈ బాక్సాఫీస్ యుద్ధం అత్యంత ఆసక్తికరంగా మారబోతోంది.
2023 మ్యాజిక్ రిపీట్ కాబోతోందా?
గతంలో 2023 సంక్రాంతి బరిలో కూడా చిరు-బాలయ్య తలపడ్డారు. బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కలయికలో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ భారీ విజయాన్ని అందుకుంటే.. దాని మరుసటి రోజే చిరంజీవి-బాబీ కాంబోలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ రెండు సినిమాలు గోల్డెన్ జూబ్లీ జరుపుకోవడం ఒక రికార్డు. ఇప్పుడు మళ్ళీ అదే దర్శకులతో అదే మైత్రీ సంస్థ ఈ ఇద్దరు హీరోలతో సినిమాలు చేస్తుండటం విశేషం. బాబీ దర్శకత్వంలో చిరంజీవి, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ గ్యాంగ్‌స్టర్లుగా కనిపించబోతున్నారు.

Waltair Veerayya & Veera Simha Reddy
చిరంజీవి గతంలో ‘లంకేశ్వరుడు’, ‘గూండా’ వంటి చిత్రాల్లో గ్యాంగ్‌స్టర్ పాత్రలు పోషించారు. ముఖ్యంగా ‘గూండా’ సినిమాలో ఆయన మేనరిజమ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక బాలయ్య విషయానికి వస్తే ‘యువరత్న రాణా’, ‘అశోక చక్రవర్తి’ సినిమాల్లో గ్యాంగ్‌స్టర్ గెటప్స్ లో మెరిశారు. ‘యువరత్న రాణా’లో బాలయ్య చూపించిన మాస్ పవర్ అప్పట్లో ఒక ఊపు ఊపింది. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత నవతరం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఈ సీనియర్ స్టార్లు గ్యాంగ్‌స్టర్లుగా ఎలా కనిపిస్తారో చూడాలని ఫ్యాన్స్ ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు.
ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగా బాబీ, గోపీచంద్ మలినేని ఈ ఇద్దరు హీరోలను అత్యంత శక్తివంతంగా చూపించడానికి స్క్రిప్టులు సిద్ధం చేస్తున్నారట. ‘వాల్తేరు వీరయ్య’లో చిరంజీవిని పాత రోజులను గుర్తుకు తెచ్చేలా చూపించిన బాబీ, ఈ గ్యాంగ్‌స్టర్ సినిమాలో ఎలాంటి విన్యాసాలు చేయిస్తారో చూడాలి. అలాగే గోపీచంద్ మలినేని కూడా బాలయ్యను మరింత ఊరమాస్ లెవల్లో చూపించడానికి రెడీ అవుతున్నారు. ఈ ఇద్దరు హీరోల సినిమాలు ఒకేసారి విడుదలవ్వడం వల్ల బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ల సునామీ రావడం ఖాయం. చిరంజీవి, బాలకృష్ణ మధ్య పోటీ అనేది ఎప్పుడూ వ్యక్తిగత ద్వేషం కాదు.. అది కేవలం ఆరోగ్యకరమైన బాక్సాఫీస్ వార్ మాత్రమే. ఈ ఇద్దరు స్టార్స్ మళ్ళీ సంక్రాంతికి ఒకే తరహా కథలతో రావడం బాక్సాఫీస్ రంజుగా మారుతుందనడంలో సందేహం లేదు.
