Chhello Show: ఆస్కార్‌ను మెప్పించిన ‘ఛెల్లో షో’ ఓటీటీకి వచ్చేస్తోంది.. ఎప్పుడు..? ఎక్కడంటే.?
థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాలు నెలరోజుల వ్యవధిలోనే ఓటీటీలకు వచ్చేస్తున్నాయి. దాంతో ప్రేక్షకులు థియేటర్స్ కంటే ఓటీటీల్లోనే సినిమాలు చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు

ఇటీవల ఓటీటీల సందడి ఎక్కువైన విషయం తెలిసిందే. థియేటర్స్ లో సినిమాలు రిలీజ్ అవుతున్నప్పటికీ ఓటీటీల్లోనూ సినిమాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాలు నెలరోజుల వ్యవధిలోనే ఓటీటీలకు వచ్చేస్తున్నాయి. దాంతో ప్రేక్షకులు థియేటర్స్ కంటే ఓటీటీల్లోనే సినిమాలు చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే చాలా సినిమాలు ఇప్పటికే ఓటీటీల్లో అలరిస్తున్నాయి. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ మూవీ కూడా ఓటీటీలో సందడి చేయడనికి రెడీ అవుతుంది. ఇటీవల ఆస్కార్ కు నామినేట్ అయిన సినిమాల్లో ‘ఛెల్లో షో’ కూడా ఒకటి. ఈ సినిమా సృష్టించిన సంచలనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దర్శకుడు నలిన్ బాల్య జ్ఞాపకాల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
ప్రేక్షకుల మన్నలను అందుకున్న ఈ సినిమా ఆస్కార్- 2023లో పోటీపడే అవకాశం దక్కించుకుంది. ‘ఛెల్లో షో’ అనేది గుజరాతీ సినిమా. ఇప్పుడు ఇది ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ వేదికగా నవంబర్ 25 నుంచి ఈ సినిమా డిజిటల్ ప్రేక్షకులను అలరించనుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు నలిన్ మాట్లాడుతూ ‘‘ఛెల్లో షో అనేది సినిమా కాదు.. ఒక వేడుక ఇప్పుడు ఈ వేడుకను భారతదేశంలోని ప్రజలందరూ చేసుకోనున్నారు’’ అంటూ నెట్‌ఫ్లిక్స్‌కు థ్యాంక్స్ తెలిపారు.
‘బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్’ కేటగిరీలో ఆస్కార్‌కు ఎంపిక అయ్యింది ఈ మూవీ. ఈ సినిమా దర్శకుడు నలిన్ బాల్య జ్ఞాపకాల ఆధారంగా తెరకెక్కించారు. చిన్న తనంలో ఆయనకు సినిమాలంటే మక్కువ ఎలా కలిగింది. సినిమా అనేది ఆయన కలగా ఎలా మారింది ఇలా హృదయాలను హత్తుకునే కథాంశంతో ఈ చిత్రం రూపొందించారు. ఈ సినిమాలో భవిన్ రాబరి, భవేశ్ శ్రీమాలి, రిచా మీనా, దిపెన్ రావల్, పరేశ్ మెహతా ప్రధాన పాత్రలు పోషించారు. ‘లాస్ట్ ఫిల్మ్ షో’ అనే ఇంగ్లీష్ పేరుతో ఈ సినిమా గతేడాది జూన్‌లో ‘ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్’లో స్క్రీనింగ్ అయ్యింది.



