అన్నయ్య భేటీలతో తమ్ముళ్ళలో ఉత్కంఠ.. మెగాస్టార్‌ దారెటు ?

అన్నయ్య భేటీలతో తమ్ముళ్ళలో ఉత్కంఠ.. మెగాస్టార్‌ దారెటు ?

చిరంజీవి.. తెలుగునేలతోపాటు యావత్ భారత దేశం మెగాస్టార్‌గా పిలుచుకునే ఈ నటుడు తెలుగు సినీ పరిశ్రమలో ఎదురు లేని హీరో. సినీ హీరోగా చిరంజీవి వేసిన స్టెప్స్ ఆయన అభిమానులతోపాటు యావత్ తెలుగు ప్రజల మనసులను గెలుచుకున్నాయి. కానీ రాజకీయాల విషయానికి వచ్చే సరికి చిరంజీవి వేసిన స్టెప్స్ గతి తప్పాయి. ప్రజలు బ్రహ్మరథం పడతారనుకుని స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ఎంతో కాలం కొనసాగలేక చతికిలా పడింది. 2009 ఎన్నికల్లో ఏకంగా ముఖ్యమంత్రినవుతాననుకుని పోటీకి దిగిన చిరంజీవి […]

Rajesh Sharma

|

Oct 17, 2019 | 1:19 PM

చిరంజీవి.. తెలుగునేలతోపాటు యావత్ భారత దేశం మెగాస్టార్‌గా పిలుచుకునే ఈ నటుడు తెలుగు సినీ పరిశ్రమలో ఎదురు లేని హీరో. సినీ హీరోగా చిరంజీవి వేసిన స్టెప్స్ ఆయన అభిమానులతోపాటు యావత్ తెలుగు ప్రజల మనసులను గెలుచుకున్నాయి. కానీ రాజకీయాల విషయానికి వచ్చే సరికి చిరంజీవి వేసిన స్టెప్స్ గతి తప్పాయి. ప్రజలు బ్రహ్మరథం పడతారనుకుని స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ఎంతో కాలం కొనసాగలేక చతికిలా పడింది. 2009 ఎన్నికల్లో ఏకంగా ముఖ్యమంత్రినవుతాననుకుని పోటీకి దిగిన చిరంజీవి సంయుక్తాంధ్రప్రదేశ్‌లోని 294 సీట్లలో దక్కింది కేవలం 18.

ప్రజలిచ్చిన తీర్పుతో ఖంగుతిన్న మెగాస్టార్ ఆ తర్వాత స్లోగా తన పంథా మార్చుకోవడం ప్రారంభించారు. రాజకీయంగా సైలెంటై పోయారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హఠాన్మరణం తర్వాత ఏపీసీసీకి చరిష్మా వున్న నేత కరువవడంతో దాన్ని తాను పూరించే అవకాశం వుందని భావించి తాను స్థాపించిన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. దాంతో సోనియాగాంధీ ఆయన్ను రాజ్యసభకు పంపి, కేంద్ర మంత్రి పదవిని కట్టబెట్టారు. ఏకంగా కేబినెట్ హోదాలో కేంద్ర మంత్రయ్యారు మెగాస్టార్ చిరంజీవి. కానీ.. ఆయనకు ఆ స్థాయిలో పట్టం కట్టినా పెద్దగా ప్రభావవంతమైన నేతగా ఆయన్ను తెలుగు ప్రజలు చూడకపోవడంతో.. 2014 ఎన్నికల నాటికి రాష్ట్ర విభజనే తక్షణ కర్తవ్యం అన్న నిర్ణయానికి వచ్చింది సోనియమ్మ.

రాష్ట్ర విభజన అంశం మెగాస్టార్ చిరంజీవిని అటు ఏపీ, ఇటు తెలంగాణకు కాకుండా చేసింది. విభజన తర్వాత రెండు రాష్ట్రాలు ఏర్పాటు కావడం.. ఈ గ్యాప్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుగులేని నేతగా ఎదిగిపోవడం చకచకా జరిగిపోయాయి. దాంతో రాజకీయ  రంగం నుంచి పూర్తిగా ఫేడ్ అవుట్ అయిపోయేందుకు చిరంజీవి సిద్దపడ్డారు. తనకు బాగా అచ్చొచ్చిన సినిమాల వైపు దృష్టి పెట్టారు. మచ్ వెయిటెడ్ 150వ సినిమాతో చిరంజీవి టాలీవుడ్లో రీ ఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్. ఆ తర్వాత రెండేళ్ల శ్రమతో నిర్మించిన సైరా నరసింహారెడ్డితో మరోసారి ప్రేక్షకులను అలరించారు.

ఇందంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. మరి రెండో వైపు ఏం జరుగుతోంది ?  సైరా సక్సెస్‌ని ఆస్వాదిస్తున్న చిరంజీవి ఉన్నట్లుండి పొలిటికల్ భేటీల దిశకు మళ్లారు. అనూహ్యంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు అమరావతి వెళ్ళారు. వీరిద్దరి కలయిక విపరీతమైన చర్చకు తెరలేపింది. ఒకవైపు పవన్ కల్యాణ్ జనసేన పార్టీ ద్వారా జగన్ ప్రభుత్వంపై యుద్దం ప్రకటిస్తే ఆయన సోదరుడు ఏకంగా జగన్‌ను కల్వడమేంటని మెగా ఫ్యాన్స్ మధనపడిపోయారు.

అదే సమయంలో మరిన్ని ఊహాగానాలు తెరమీదికొచ్చాయి. ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్దికి చొరవ చూపాలని, విశాఖలో స్టూడియో నిర్మించాలని అందుకు ప్రభుత్వం తరపున చేయవలసిన సాయం చేస్తామని సీఎం.. చిరంజీవికి హామీ ఇచ్చినట్లు సోషల్ మీడియా కోడై కూసింది. దాంతో ఆగకుండా వైసీపీలో చేరాలని చిరంజీవిని జగన్ కోరారని, అందుకు ప్రతిఫలంగా రాజ్యసభకు నామినేట్ చేస్తామని సీఎం చెప్పినట్లు.. అందుకు చిరంజీవి అంగీకరించినట్లు కూడా ప్రచారం మొదలైంది.

ఈ ప్రచారం ఒకవైపు కొనసాగుతుండగానే చిరంజీవి అనూహ్యంగా ఢిల్లీ వెళ్లారు. ఒకప్పటి బిజెపి నేత, ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో చిరంజీవి భేటీ అయ్యారు. సైరా మూవీ ప్రత్యేక షోని అరేంజ్ చేసి.. వెంకయ్య నాయుడి మెప్పు పొందారు మెగాస్టార్. దాంతో చిరంజీవి బిజెపి వైపు అడుగులు వేస్తున్నారని ప్రచారం మొదలైంది. వారు కూడా రాజ్యసభ సభ్యత్వంతోపాటు కేంద్రంలో మంత్రి పదవిని చిరంజీవికి ఆఫర్ చేశారని సమాచారం.

ఈ నేపథ్యంలో మెగా స్టార్ సన్నిహితులు మాత్రం ఈ రెండు భేటీలు కేవలం సైరా సక్సెస్ నేపథ్యంలో మాత్రమే జరిగాయని చెబుతున్నారు. సినిమా రిలేటెడ్ భేటీలే అయితే.. సైరా మూవీ నిర్మాతనో, దర్శకుడూ, లేక ఇతర కీలకమైన నటులో ఈ భేటీల్లో ఎందుకు పాల్గొనలేదనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

ట్రిపుల్ ఆర్ మూవీతో హీరో, నిర్మాత రామ్ చరణ్ బిజీగా వున్నారనే అనుకున్నా… దర్శకుడు సురేందర్ రెడ్డి, మిగిలిన పెద్ద నటులు అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, తమన్నా, నయనతార, సుదీప్ తదితరుల్లో ఒక్కరినైనా తమ వెంట జగన్ దగ్గరికో… వెంకయ్య నాయుడు దగ్గరికో మెగాస్టార్ తీసుకుని వెళ్ళి వుండొచ్చు. కానీ అలా జరగలేదు. తానొక్కరే వెళ్లడం ద్వారా చిరంజీవి పొలిటికల్ సర్కిల్స్‌లో కొత్త చర్చకు తెరలేపారు. సో.. ఇప్పుడు చిరంజీవి అడుగులు వైసీపీ వైపా లేక బిజెపి వైపా ? మెగాఫ్యాన్స్‌ని ఉత్కంఠకు గురిచేస్తున్న ప్రశ్నలివి.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu