AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhairavam Review: భైరవం రివ్యూ.. ముగ్గురు హీరోల మాస్ డ్రామా ఎలా ఉందంటే..

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ నటించిన సినిమా భైరవం. చాలా రోజులుగా ఈ సినిమాపై మంచి బజ్ ఉంది. విజయ్ కనకమేడల తెరకెక్కించిన ఈ చిత్రం తాజాగా విడుదలైంది. పెన్ స్టూడియోస్‌ బ్యానర్‌పై డాక్టర్ జయంతిలాల్ గడా సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కెకె రాధామోహన్ నిర్మించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..

Bhairavam Review: భైరవం రివ్యూ.. ముగ్గురు హీరోల మాస్ డ్రామా ఎలా ఉందంటే..
Bhairavam Review
Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: |

Updated on: May 30, 2025 | 12:45 PM

Share

మూవీ రివ్యూ: భైరవం

నటీనటులు: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్, అదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్లై, వెన్నెల కిషోర్, జయసుధ, ఇనాయా సుల్తాన, అజయ్ తదితరులు

ఎడిటర్: చోటా కే ప్రసాద్

సినిమాటోగ్రఫీ: హరి కే వేదాంతం

సంగీతం: శ్రీ చరణ్ పాకాల

నిర్మాత: కేకే రాధామోహన్

దర్శకుడు: విజయ్ కనకమేడల

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ నటించిన సినిమా భైరవం. చాలా రోజులుగా ఈ సినిమాపై మంచి బజ్ ఉంది. విజయ్ కనకమేడల తెరకెక్కించిన ఈ చిత్రం తాజాగా విడుదలైంది. పెన్ స్టూడియోస్‌ బ్యానర్‌పై డాక్టర్ జయంతిలాల్ గడా సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కెకె రాధామోహన్ నిర్మించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..

కథ:

తూర్పు గోదావరి జిల్లా దేవీపురం గ్రామంలో వారాహి అమ్మవారు చాలా పవర్ ఫుల్. ఆ గుడిని చూసుకునే బాధ్యత నాగరత్నమ్మపై ఉంటుంది. ఆమె తన మనవడు వరద (నారా రోహిత్)తో పాటు గజపతి (మనోజ్ మంచు), శ్రీను (బెల్లంకొండ శ్రీనివాస్)లను కూడా తన మనవళ్ల లాగే పెంచుతుంది. నాగరత్నమ్మ చనిపోయిన తర్వాత గుడిని దక్కించుకోవాలని చూస్తారు నాగరాజు (అజయ్). అయితే నాగరాజు ఎత్తుకు పై ఎత్తులు వేసి శ్రీనును ట్రస్టీ చేస్తారు గజపతి, వరద. ఓసారి గజపతి చిక్కుల్లో పడతాడు.. అలాంటి సమయంలో ఆయన ప్రాణాలు కాపాడతాడు నాగరాజు, గజపతి బావమరిది పులి (సందీప్ రాజ్). అదే టైమ్‌లో ప్రాణంగా భావించే వరదనే గజపతి చంపాల్సిన అవసరం వస్తుంది. కానీ ఆ నేరం శ్రీను తనపై వేసుకుని పోలీసులకు లొంగిపోవడమే కాకుండా.. వరద భార్య ముందు చెడ్డవాడిగా మారిపోతాడు. ఆ తర్వాత ఏమైంది..? ఎందుకు శ్రీను అలా చేసాడు..? అసలు వరదకు ఏమైంది అనేది మిగిలిన కథ..

కథనం:

భైరవం అనేది స్ట్రెయిట్ సినిమా కాదు.. ఇది రీమేక్ సినిమా. గరుడన్ సినిమాను తీసుకుని తెలుగు ఆడియన్స్‌కు తగ్గట్లు కథలో చిన్న చిన్న మార్పులు చేసాడు దర్శకుడు విజయ్ కనకమేడల. పెద్దగా మార్పులు చేర్పులైతే చేయలేదు.. ఉన్నదున్నట్లు తీసే ప్రయత్నమే ఎక్కువగా చేసాడు. కాకపోతే తెలుగులో ఇంకాస్త కమర్షియల్‌గా తీసే ప్రయత్నమైతే చేసాడు. అందులో భాగంగానే ఫస్టాఫ్ చాలా వరకు స్లో అయిపోయింది. ముఖ్యంగా ఫోర్సుగా వచ్చే సీన్స్ ఉంటాయి. తొలి 40 నిమిషాల వరకు సినిమా నెమ్మదిగానే వెళ్తుంది. కథలో మెయిన్ ట్రాక్ మొదలైన తర్వాత వేగం పెరుగుతుంది. ఫస్ట్ సీన్ నుంచే ముగ్గురు హీరోల మధ్య బాండింగ్ బాగా చూపించాడు దర్శకుడు విజయ్ కనకమేడల. ఆ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ముగ్గురి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. అలాగే బెల్లంకొండ, అదితి శంకర్ ట్రాక్ కూడా పర్లేదనిపిస్తుంది. ఫస్టాఫ్ ఎక్కువగా ఎలివేషన్స్ కోసం టైమ్ తీసుకున్నాడు విజయ్. నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్.. ఇలా ఒక్కొక్కరికీ సపరేట్‌గా ఎంట్రీస్ ప్లాన్ చేసాడు. పోలీస్ ఆఫీసర్‌తో నెరేషన్ ఇప్పించడం బాగుంది. అసలు కథ మొత్తం సెకండాఫ్‌లోనే ఉంది. ప్రీ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయింది. ప్రాణానికి ప్రాణంగా ఉన్న స్నేహితులే చంపుకునే వరకు ఎందుకొచ్చారు అనేది ఈ సినిమాలో మెయిన్ ట్విస్ట్. అది థియేటర్లో చూస్తేనే బాగుంటుంది. ముగ్గురి మధ్య వైరం మొదలైన తర్వాత ఆసక్తికరంగా మారింది కథనం. నెక్ట్స్ ఏం జరుగుతుందబ్బా అని ఆసక్తిగా వేచి చూసేంత స్క్రీన్ ప్లే అయితే లేదులే గానీ.. ఓకే అనిపిస్తుంది. కథ ముందుగానే అర్థమవుతున్నా.. చూడ్డానికి ఆసక్తికరంగానే ఉంటుంది. సెకండాఫ్ వరకు బాగానే మ్యానేజ్ చేసాడు దర్శకుడు విజయ్ కనకమేడల. క్లైమాక్స్ కూడా ఈ సినిమాకు బలం. అక్కడ మంచు మనోజ్, బెల్లంకొండ ఇద్దరూ రప్ఫాడించారు. కానీ వీళ్ళిద్దరి కంటే సైలెంట్‌గా నారా రోహిత్ క్యారెక్టర్ బాగా పండింది. తమిళంలో సూరి పాత్ర అండర్ డాగ్‌గా ఉంటుంది.. కానీ తెలుగు కోసం బెల్లంకొండ పాత్రను మరింత పవర్ ఫుల్‌గా మార్చేసారు.. దానికితోడు మిగిలిన రెండు క్యారెక్టర్స్ కూడా సామాజిక న్యాయం చేయడానికి చూసాడు విజయ్ కనకమేడల. అందులోనే కాస్త బ్యాలెన్స్ తప్పింది కథ. క్లైమాక్స్‌తో మళ్లీ గాడిన పడింది సినిమా.

నటీనటులు:

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు ఈ సినిమా బాగానే ప్లస్ అవుతుంది. శ్రీను పాత్రలో బాగా నటించాడీయన. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే పూనకాలు సీన్ అదిరిపోయింది. మంచు మనోజ్ కోరుకున్న కమ్ బ్యాక్ ఇది. అదిరిపోయే యాక్షన్‌తో రప్ఫాడించాడు మంచు వారబ్బాయి. నారా రోహిత్ సైలెంట్ కిల్లర్.. మనోడు చాలా సెటిల్డ్‌గా మాయ చేసాడు. హీరోయిన్లు అదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్లై పాత్రలు కథకు తగ్గట్లుగా ఉన్నాయి. మరోవైపు వెన్నెల కిషోర్ కాసేపు పర్లేదు. జయసుధ ఉన్నంత సేపు బాగా నటించారు. అజయ్, సందీప్ రాజ్ లాంటి వాళ్లు తమ పాత్రలకు న్యాయం చేసారు.

టెక్నికల్ టీం:

శ్రీ చరణ్ పాకాలా సంగీతం పర్లేదు. పాటల కంటే ఎక్కువగా బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. ఎడిటింగ్ బాగా వీక్.. ముఖ్యంగా ఫస్టాఫ్ అయితే చాలా వరకు సీన్స్ అదనంగా వచ్చాయేమో అనిపించింది. కాకపోతే దర్శకుడి ఛాయిస్ కాబట్టి ఎడిటర్‌ను తప్పబట్టలేం. అక్కడక్కడా డబ్బింగ్ ట్రాక్ మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. దర్శకుడు విజయ్ కనకమేడల రీమేక్ కథ తీసుకున్నా.. తనదైన శైలిలో కొన్ని మార్పులైతే చేసాడు. కానీ పూర్తిగా ఆకట్టుకోవడంలో మాత్రం విఫలమయ్యాడనే చెప్పాలి. ఓవరాల్‌గా ఇంటర్వెల్, క్లైమాక్స్, ముగ్గురు హీరోల కోసం ఓసారి భైరవం చూడొచ్చు.

పంచ్ లైన్:

భైరవం.. రూరల్ మాస్ డ్రామా..!