బార్డర్స్ క్రాస్ చేస్తున్న టాలీవుడ్ దర్శకులు.. ఇండస్ట్రీపై ప్రభావం చూపుతుందా..?
టాలీవుడ్ దర్శకులు ఇప్పుడు పాన్ ఇండియా, బాలీవుడ్ సినిమాల్లో తమ సత్తా చాటుతున్నారు. సుకుమార్, పూరి జగన్నాథ్, సందీప్ రెడ్డి వంగా వంటి దర్శకులు ఇతర భాషల హీరోలతో సినిమాలు చేస్తున్నారు. తెలుగు కథలతోనే పాన్ ఇండియా విజయం సాధించిన దర్శకులు ఇప్పుడు భాషలకు అతీతంగా సినిమాలు చేయడం విశేషం. ఈ మార్పు తెలుగు సినిమా పరిశ్రమలో ఎలాంటి మార్పును తీసుకొస్తుందో చూడాలి.

ఇన్నాళ్లు మన దర్శకులు నేషనల్ లెవల్‌లో సత్తా చాటిన… ఆ సినిమాలన్నీ తెలుగు నేటివిటీతోనే ప్లాన్ చేశారు. రాజమౌళి బాహుబలి, సుకుమార్ పుష్ప, నాగీ కల్కి 2898 ఏడీ ఈ సినిమాల్లో బాలీవుడ్ స్టార్స్ నటించినా… బాలీవుడ్‌లో బిగ్ నెంబర్స్ క్రియేట్ చేసినా.. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ తెలుగు హీరోలతో తెలుగు నిర్మాతలతో చేసినవే. ఇన్నాళ్లు ఇదే ఫార్ములాకు గట్టిగా స్టిక్ అయిన మేకర్స్. ఇప్పుడు గీత దాటుతున్నారు. మన హీరోలను కాదని పరభాష హీరోల వైపు చూస్తున్నారు.
పుష్ప సిరీస్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు సుకుమార్, ఇప్పుడు నార్త్ వైపు చూస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ హీరోగా సుకుమార్ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారన్నది సౌత్, నార్త్ సర్కిల్స్‌లో వైరల్ న్యూస్. ఇంకా అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ లేకపోయినా.. ప్రజెంట్ సుకుమార్‌కి ఉన్న క్రేజ్ చూస్తే ఏ బాలీవుడ్ హీరో అయినా… లెక్కల మాస్టర్ సినిమాలో నటించేందుకు వెంటనే ఓకే చెప్పేస్తారు.
టాలీవుడ్‌లో వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో ఉన్న పూరీ జగన్నాథ్ ఇప్పుడు కోలీవుడ్ వైపు చూస్తున్నారు. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి లీడ్ రోల్‌లో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను రూపొందిస్తున్నారు పూరి జగన్నాథ్. ఈ సినిమా బైలింగ్యువల్ ప్రాజెక్ట్ అని చెబుతున్నా.. మక్కల్ సెల్వన్ మెయిన్ మార్కెట్ తమిళే కాబట్టి… మేజర్ ఫోకస్ అక్కడే ఉండే ఛాన్స్ ఉంది.
తెలుగు సినిమాతో సిల్వర్ ఎంట్రీ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు పూర్తిగా బాలీవుడ్ మేకర్ అయిపోయారు. రెండో సినిమానే హిందీలో చేసిన సందీప్, అక్కడే సెటిల్ అయ్యారు. వరుసగా టీ సిరీస్ బ్యానర్‌లోనే సినిమాలు చేస్తూ నార్త్‌లో తమ మార్క్ చూపిస్తున్నారు. మాస్ యాక్షన్ స్పెషలిస్ట్ గోపిచంద్ మలినేని కూడా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. గదర్ 2తో బౌన్స్ బ్యాక్ అయిన సన్నీ డియోల్ హీరోగా జాట్ సినిమాను తెరకెక్కిస్తున్నారు గోపిచంద్.
యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి వరుసగా పరభాషా హీరోలతోనే సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే సర్, లక్కీ భాస్కర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన వెంకీ, సూర్యతో భారీ ప్రాజెక్ట్‌కు రెడీ అవుతున్నారు. పక్కా తెలుగు నేటివ్ కథలతో సినిమాలు రూపొందించే శేఖర్ కమ్ముల కూడా కాస్త గీతదాటి ధనుష్ హీరోగా కుబేర సినిమాను రూపొందిస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి, శైలేష్ కొలను లాంటి దర్శకులు కూడా బాలీవుడ్‌లో తమ మార్క్ చూపించే ప్రయత్నం చేశారు. ఇలా మన దర్శకులంతే అదర లాంగ్వేజెస్‌లో సత్తాచాటుతుండటంతో పరభాషా దర్శకులు మన హీరోల డేట్స్ కోసం ట్రై చేస్తున్నారు.