Balakrishna: కృష్ణంరాజు కుటుంబాన్ని పరామర్శించిన బాలకృష్ణ దంపతులు..
కృష్ణం రాజు చనిపోయినప్పుడు బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న NBK107 సినిమా కోసం విదేశాలలో.. టర్కీ షెడ్యూల్ లో ఉన్నారు బాలకృష్ణ .

టాలీవుడ్ సీనియర్ హీరో దివంగత రెబల్ స్టార్ కృష్ణంరాజు కుటుంబాన్ని పరామర్శించారు హీరో బాలకృష్ణ. సోమవారం ఆయన సతీమణి వసుంధర దేవితో కలిసి కృష్ణంరాజు ఇంటికి వెళ్లారు. అనంతరం రెబల్ స్టార్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ నేపథ్యంలోనే శ్రీ కృష్ణంరాజుతో ఆయనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కృష్ణం రాజు చనిపోయినప్పుడు బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న NBK107 సినిమా కోసం విదేశాలలో.. టర్కీ షెడ్యూల్ లో ఉన్నారు బాలకృష్ణ . అందుకే అప్పుడు ఆయన పార్దివ దేహాన్ని చూడడానికి రాలేకపోయారు. షూటింగ్ అయిపోయిన వెంటనే ఇప్పుడు భార్య వసుంధర దేవితో సహా వచ్చి కృష్ణంరాజు గారి కుటుంబాన్ని పరామర్శించారు.
ఈరెండు కుటుంబాల మధ్య ఎన్నో సంవత్సరాలుగా తమ మధ్య విడదీయరాని బంధం ఉందని.. నాన్నగారి సమయం నుంచి కృష్ణంరాజు గారిని చూస్తూ పెరిగాను అన్నారు బాలకృష్ణ. సినిమా ఇండస్ట్రీకి ఆయన ఎంతో సేవ చేశారని కొనియాడారు. అలాంటి అద్భుతమైన నటుడితో తనకు కూడా కలిసి నటించే అవకాశం వచ్చిందని.. తామిద్దరం సుల్తాన్, వంశోద్ధారకుడు సినిమాలలో కలిసి నటించాము అనే విషయం గుర్తు చేసుకున్నారు బాలకృష్ణ. అలాగే ఆయనతో గడిపిన క్షణాలను అభిమానులతో పంచుకున్నారు. కృష్ణంరాజు లేని లోటు ఎవరూ పూడ్చలేనిది అంటూ కుటుంబ సభ్యులను ఓదార్చి ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. రెబల్ స్టార్ ఫ్యామిలీతో చాలాసేపు ముచ్చటించారు బాలకృష్ణ, వసుంధరా దేవి దంపతులు. మరోవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబాన్ని కూడా పరామర్శించారు బాలకృష్ణ.




అనారోగ్య సమస్యలతో గచ్చిబౌలీలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న కృష్ణంరాజు సెప్టెంబర్ 11న తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో ప్రభాస్ కుటుంబంతోపాటు.. అభిమానులు సైతం శోకసంద్రంలో మునిగిపోయారు. ఇటీవలే ఆయన స్వగ్రామం మొగల్తూరులో కృష్ణంరాజు సంస్మరణ సభ నిర్వహించింది ప్రభాస్ కుటుంబం.




