AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aa Okkati Adakku Review: ఆ ఒక్కటి అడక్కు రివ్యూ.. నరేష్ సినిమా ఎలా ఉందంటే

అల్లరి నరేష్ సినిమాలంటే ఒకప్పుడు మనకు గుర్తుకొచ్చేది కామెడీనే. కానీ ఈ మధ్య ఆయనే రూట్ మార్చుకుని సీరియస్ వైపు వెళ్లాడు. చాలా రోజుల తర్వాత ఆయన మనసు మళ్లీ కామెడీ వైపు మళ్లింది. మరి అల్లరి ఈజ్ బ్యాక్ అనిపించాడా.. అల్లరి నరేష్ మరోసారి తనకు అచ్చొచ్చిన కామెడీతో హిట్ కొట్టాడా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..

Aa Okkati Adakku Review: ఆ ఒక్కటి అడక్కు రివ్యూ.. నరేష్ సినిమా ఎలా ఉందంటే
Aa Okkati Adakku
Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: |

Updated on: May 03, 2024 | 5:12 PM

Share

మూవీ రివ్యూ: ఆ ఒక్కటి అడక్కు

నటీనటులు: అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా, వెన్నెల కిషోర్, జామీ లివర్, వైవా హర్ష, అరియానా గ్లోరీ, రాజీవ్ కనకాల తదితరులు

సంగీతం: గోపీ సుందర్

సినిమాటోగ్రఫర్: సూర్య

ఎడిటర్: ఛోటా కె ప్రసాద్

నిర్మాత: రాజీవ్ చిలక

దర్శకుడు: మల్లి అంకం

అల్లరి నరేష్ సినిమాలంటే ఒకప్పుడు మనకు గుర్తుకొచ్చేది కామెడీనే. కానీ ఈ మధ్య ఆయనే రూట్ మార్చుకుని సీరియస్ వైపు వెళ్లాడు. చాలా రోజుల తర్వాత ఆయన మనసు మళ్లీ కామెడీ వైపు మళ్లింది. మరి అల్లరి ఈజ్ బ్యాక్ అనిపించాడా.. అల్లరి నరేష్ మరోసారి తనకు అచ్చొచ్చిన కామెడీతో హిట్ కొట్టాడా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..

కథ:

వైజాగ్ రిజిస్టర్ ఆఫీసులో పని చేసే గణపతి (అల్లరి నరేష్)కు వయసు దాటిపోయినా పెళ్లి కాదు. తండ్రి చనిపోయిన తర్వాత.. కుటుంబ భారం అంతా భుజాన వేసుకుంటాడు గణపతి. ఈ క్రమంలోనే తన పెళ్లి గురించి కూడా మర్చిపోతాడు. తమ్ముడికి పెళ్లైనా కూడా.. అన్న గణపతికి మాత్రం పెళ్లి కాదు. దాంతో అంతా వింతగా చూస్తుంటారు. ఈ క్రమంలోనే ఓ మాట్రిమోనీ సంస్థ ద్వారా సిద్ది (ఫరియా అబ్దుల్లా)ని కలుస్తాడు. చూసిన వెంటనే అతడిలో ఇష్టం కలుగుతుంది. ఎలాగైనా ఆమెను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. కానీ ఆమె మాత్రం నువ్వు నచ్చలేదని చెప్పి వెళ్లిపోతుంది. దాంతో అమ్మ కోసం ఎవరో ఒకర్ని పెళ్లి చేసుకోడానికి రెడీ అయిపోతాడు గణపతి. అదే సమయంలో మళ్లీ గణ జీవితంలోకి వస్తుంది సిద్ధి. కానీ అనుకోకుండా సిద్ధితో పాటు గణపతి కూడా కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తుంది. అప్పుడేం జరిగింది.. అసలేంటి కథ అనేది పూర్తి సినిమాలో చూడాలి..

కథనం:

అయితే అటుండు.. లేదంటే ఇటుండు.. నీలాగా మధ్యలో ఉండేవాళ్లతో ఎవరికీ ఉపయోగం లేదు. ఆ ఒక్కటి అడక్కు చూసాక ఎందుకో టెంపర్ సినిమాలోని ఈ డైలాగ్ గుర్తుకొచ్చింది. కామెడీ ఇక వద్దు.. సీరియస్ మద్దు అంటూ అటువైపు వెళ్లాడు అల్లరి నరేష్. మూడేళ్లు అలా సీరియస్‌గా ఉన్నాడో లేదో.. మళ్లీ ఆ ఒక్కటి అడక్కు అంటూ కామెడీ వైపు వచ్చాడు. కానీ మునపట్లా నవ్వించడంలో మాత్రం నరేష్ సక్సెస్ కాలేదు.. ఆయనలో కామెడీ టైమింగ్ అలాగే ఉందేమో కానీ దానికి తగ్గ కథ కూడా దొరికాలిగా. ఆ ఒక్కటి అడక్కులో మాత్రం అదొక్కటే తక్కువైందేమో అనిపిస్తుంది. ఎప్పుడో పదేళ్ల కింద రావాల్సిన సినిమా ఇప్పుడొచ్చిందేమో అనిపించింది. పైగా పాత చింతకాయ పచ్చడి లాంటి రొటీన్ కథ. పెళ్లి కాని మిడిల్ ఏజ్ పర్సన్ ఫ్రస్టేషన్స్ బాగానే చూపించాడు కానీ కథలో మాత్రం ఆ పస లేదు. అక్కడక్కడా ఒకట్రెండు చోట్ల పేలిన జోకులు మినహాయిస్తే.. కామెడీ పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. మాట్రిమోనీ పేరుతో జరిగే మోసాల్ని మాత్రం బాగా చూపించాడు దర్శకుడు మల్లి అంకం. పెళ్లి పేరుతో జరిగే వేల కోట్ల స్కామ్‌పై బాగా ఫోకస్ చేసాడు దర్శకుడు. ఫస్టాఫ్, సెకండాఫ్ అని తేడా లేదు.. అన్నిచోట్లా కథ అలాగే ఉండిపోయింది. ముఖ్యంగా హీరో హీరోయిన్ మధ్య ట్రాక్ కూడా అంతగా ఆకట్టుకోలేదు. మధ్యలో షకలక శంకర్, వైవా హర్ష ట్రాక్స్ కూడా కావాలని ఇరికించినట్లు అర్థమవుతుంది. కామెడీ కథలోంచి పండితే అద్భుతంగా ఉంటుంది కానీ ఈ సినిమాలో అది కనిపించదు. ఎంతసేపు ఇరికించే కామెడీ కోసమే చూసాడు దర్శకుడు. అయితే జానీ లివర్ కూతురు జామీతో వచ్చే సన్నివేశాలు మాత్రం ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా అల్లరి నరేష్, జామీ మధ్య జరిగే సంభాషణలు నవ్విస్తాయి. వెన్నెల కిషోర్ ట్రాక్ కూడా కొంతవరకు బెటర్. పెళ్లి కానీ కుర్రాళ్ల గోడు బాగానే చూపించారు. సెకండాఫ్‌తో పోలిస్తే ఫస్టాఫ్ కాస్త బెటర్. హీరోయిన్ తాళూకు ట్విస్ట్ కూడా ఏమంత గొప్పగా అనిపించదు. ఆమెలో మార్పు వచ్చే సీన్స్ కూడా కన్విన్సింగ్‌గా అనిపించవు. ఓవరాల్‌గా ఆ ఒక్కటి అడక్కులో కామెడీ అడక్కూడదు.

నటీనటులు:

అల్లరి నరేష్‌కు ఇలాంటి కారెక్టర్స్ కొట్టిన పిండి.. కథ కరెక్టుగా లేనపుడు ఆయన మాత్రం ఎంత అల్లరి చేసి ఏం లాభం..? ఫరియా అబ్ధుల్లా ఆకట్టుకుంది. బాలీవుడ్ కమెడియన్ జానీ లివర్ కూతురు జామీ నటన బాగుంది. ఉన్నంతో ఆమె కారెక్టర్ బాగానే పేలింది. అక్కడక్కడా ఆమె డైలాగ్స్ నవ్వు తెప్పించాయి. వెన్నెల కిషోర్ బాగానే నవ్వించాడు. శకలక శంకర్, వైవా హర్ష అంతా కథతో సంబంధం లేని పాత్రలే. మిగిలిన వాళ్లంతా ఓకే..

టెక్నికల్ టీం:

గోపి సుందర్ సంగీతం యావరేజ్‌గా ఉంది. రాజా రాజాది రాజా పాట బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే. సూర్య సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. వైజాగ్ అందాలను బాగానే చూపించారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటింగ్ జస్ట్ ఓకే అనిపిస్తుంది. లెంత్ ఇంకాస్త తగ్గించి ఉన్నా బాగుండేది కానీ దర్శకుడి ఛాయిస్ కాబట్టి అతన్ని తప్పు బట్టలేం. అబ్బూరి రవి డైలాగులు జస్ట్ యావరేజ్. నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు మల్లి అంకం మాత్రం అల్లరి నరేష్ ఇచ్చిన ఛాన్స్ మిస్ యూజ్ చేసుకున్నాడు.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా ఆ ఒక్కటి అడక్కు.. కామెడీ మాత్రం అడక్కు..