Alekhya Chitti Pickles: పచ్చళ్లు క్వాలిటీ ఉంటే సరిపోదు.. మన మాటల్లో కూడా క్వాలిటీ ఉండాలి చిట్టి..
ఇటీవల ఓ కస్టమర్ అలేఖ్య పికిల్స్‌కు హాయ్ అని వాట్సాప్ మెసేజ్ చేశాడు. అటు నుంచి పచ్చళ్ల రేట్లు పొందుపరుస్తూ ఓ మెసేజ్ వచ్చింది. అరకిలో నాన్ వెజ్ పచ్చళ్ల రేట్లు రూ.1200 ఉండటంతో.. రెండు చేతులు జోడించిన ఎమోజీలతో రిప్లయ్ ఇచ్చాడు ఆ కస్టమర్. మీ పచ్చళ్లు ఇంత ధర ఎందుకున్నాయో నాకు అర్థం కావడం లేదని మరో మెసేజ్ చేశాడు. దీంతో అలేఖ్య చిట్టి పికిల్స్ నుంచి ఘాటైన వాయిస్ మెసేజ్ వచ్చింది.

కస్టమర్ అనేవాడు దేవుడు.. ఏ వ్యాపారంలోనైనా ఇదే ప్రధాన సూత్రం. కష్టమర్ల ముసుగులో కొందరు అతి చేయవచ్చు. అతి చేసేవారికి.. వాడు అట్టు వడ్డిస్తే.. మనం అట్టున్నర తిరిగి వడ్డించాలి తప్పులేదు. కానీ.. సంస్కారవంతంగా ప్రశ్న అడిగిన వ్యక్తికి అంతే సంస్కారంతో రిప్లై ఇవ్వాలి. లేదంటే అసలకే మోసం వస్తుంది. అందుకు విరుద్దంగా వ్యవహరించి.. నెట్టింట తీవ్ర ట్రోలింగ్‌కి గురవుతుంది అలేఖ్య చిట్టి. ఇంతకీ ఈమె ఎవరు అంటారా..?. నెట్టింట బాగా పేమస్ అయిన రాజమండ్రి కేంద్రంగా పచ్చళ్ల వ్యాపారం చేసే అలేఖ్య చిట్టి పికిల్స్ ఓనర్. ఓ యువతి.. అందునా స్వయం ఉపాధితో ముందుకు వెళ్తుంది. అనతికాలంలోనే తన పచ్చళ్లను బాగానే ప్రమోట్ చేసి.. మార్కెట్‌లో మంచిగా సక్సెస్ అయింది. కచ్చితంగా అభినందించి తీరాల్సిందే. అయితే వీరి పచ్చళ్లకు రేట్లు ఎక్కువ అని ముందు నుంచి టాక్ ఉంది. క్వాలీటి ఉంటే రేట్లు ఉండవా అన్నది అలేఖ్య చిట్టి వెర్షన్. అయితే ఇటీవల ఆమె ఓ కస్టమర్‌కు పంపిన వాయిస్ నోట్ అభ్యంతరకంగా ఉందని నెట్టింట కామెంట్స్ వినిపిస్తున్నాయి.
అలేఖ్య చిట్టి పంపినట్లుగా వైరల్ అవుతున్న క్లిప్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి… ఇందులోని భాష అభ్యంతరకరంగా ఉందని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం..
మాములుగా వీరికి ఓ వాట్సాప్ బిజినెస్ అకౌంట్ ఉంది. అందులో కష్టమర్లు సంప్రదించి.. ఆర్డర్ పెడితే.. ఆయా అడ్రస్‌లకు డెలివరీ చేస్తారు. అందులో ఇటీవల ఓ కస్టమర్.. ఆ వాట్సాప్ అకౌంట్‌లో పచ్చళ్ల మెనూ చూసి.. ఇంత ధరలు ఎందుకు ఉన్నాయో అంతుబట్టడం లేదని ప్రశ్నించాడు. దీంతో అటు నుంచి అభ్యంతరకరంగా బూతులు తిడుతూ ఫీమేల్ వాయిస్‌తో మెసేజ్ వచ్చింది. ఆ కస్టమర్ అడిగింది నచ్చకపోతే పొలైట్‌గా రిప్లై ఇవ్వాలి. అదీ ఇష్టం లేకపోతే అతడ్ని బ్లాక్ చేయాలి.. కానీ ఈ రకంగా బయటకు చెప్పలేని.. రాయలేని విధంగా దూషించడం కరెక్ట్ కాదని చాలామంది నెటిజన్స్ వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో అలేఖ్య చిట్టినే ఆ వాయిస్ పెట్టింది అంటూ ఆమెపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడుస్తోంది. పరిస్థితి ఎంత సివియర్‌గా ఉందంటే.. వాళ్లు కొన్నాళ్లు ఏకంగా దుకాణం సర్దియేల్సిన పరిస్థితి ఏర్పడింది. ట్రోలింగ్ తీవ్రతకు వాళ్ల ఫోన్ నంబర్ ఆపేశారు.. అంతేకాదు ఆ వాట్సాప్ అకౌంట్ కూడా డిలీట్ చేశారు. ఇన్ స్టాలో కూడా అందుబాటులో రావడం లేదు. వాళ్ల వెబ్ సైట్ కూడా ప్రస్తుతం ఓపెన్ అవ్వడం లేదు. దీన్ని బట్టి ట్రోలింగ్ దెబ్బకు కొన్నాళ్లు వాళ్లు సైలెంట్‌గా ఉండాలని డిసైడయినట్లు అనిపిస్తుంది.
కష్టమర్లే దేవుళ్లని తన తండ్రి చెప్పినట్లు అలేఖ్య చిట్టి ఓ వీడియోలో చెప్పుకొచ్చింది. కానీ ఇప్పుడు కస్టమర్‌తో ఈ తరహా ప్రవర్తనతో ఆమె ఇబ్బందులు ఎదుర్కొంటింది. వ్యాపారంలో ప్రొడక్ట్ క్వాలిటీ మాత్రమే కాదు… మన ప్రవర్తన కూడా ముఖ్యం అని ఈ ఉదంతం స్పష్టం చేస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..