
అప్పట్లో హీరోయిన్ గా రాణించిన వారిలో ఆమని ఒకరు. అప్పట్లో ఆమనికి మంచి ఫ్యాన్ బేస్ ఉండేది ముఖ్యంగా లేడీస్ లో ఆమెకు ఎక్కువ ఫ్యాన్స్ ఉండే వారు. తన సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్ ను కట్టిపడేసారు ఆమని. తన సినీ ప్రస్థానంలో శుభలగ్నం , మావిచిగురు చిత్రాలను అత్యంత కీలకమైనవిగా ఆమె అన్నారు. ఒక ఇంటర్వ్యూలో ఆమని ఈ చిత్రాల గురించి, ఇతర సినీ అనుభవాల గురించి పంచుకున్నారు.. ఆమె మాట్లాడుతూ.. శుభలగ్నం సినిమా సమాజంలో ఎంతో ప్రభావం చూపిందని, తన కెరీర్‌కు అది ఒక మలుపు అని పేర్కొన్నారు. ఆ సినిమాలో గయ్యాళి పాత్రను పోషించడం తన నిజ జీవిత స్వభావానికి భిన్నమని, కానీ నటిగా ఆ పాత్రను చేయాల్సి వచ్చిందని తెలిపారు. ఈ చిత్రం ఇప్పటికీ ఎక్కడికి వెళ్లినా ప్రజలు గుర్తుంచుకుంటారని, ఇది ఒక సూపర్ డూపర్ హిట్ ఎవర్ గ్రీన్ సినిమా అని ఆమని అన్నారు. దర్శకుడు కృష్ణారెడ్డి కూడా ఇటీవల ఈ చిత్రాన్ని చూసి మరోసారి తన నటనను ఎంతగానో ప్రశంసించారని ఆమని గుర్తుచేసుకున్నారు.
నటన పరంగా చూస్తే, మావిచిగురు పాత్ర తన కెరీర్‌లో అత్యంత సవాలుతో కూడుకున్నదని ఆమని అన్నారు. ఈ సినిమాలో ఎక్స్ప్రెషన్స్, లోతైన భావోద్వేగాలు ఎక్కువగా ఉండేవని, వాటిని పలికించడానికి ఎంతో శ్రమించాల్సి వచ్చిందని తెలిపారు. కొన్నిసార్లు గ్లిసరిన్ వాడకుండానే ఏడిచి, ఆ సన్నివేశాల తర్వాత తీవ్రమైన తలనొప్పి వచ్చేదని, మానసికంగా అలసిపోయేదాన్నని పేర్కొన్నారు. ఆ పాత్రలో కన్నీళ్లు, భావోద్వేగాలు ఎక్కువని, అయితే అవి ప్రేక్షకుల మనసులను హత్తుకున్నాయని అన్నారు. మావిచిగురు సినిమాలో “మాట ఇవ్వమ్మా చెల్లి” పాటతో పాటు, తన భర్తను, కుటుంబాన్ని చూసుకోమని కోరే మాట్లాడు, సన్నివేశాలు ఎంతో మందిని కదిలించాయని చెప్పారు.
డబ్బింగ్ విషయంలో, శుభలగ్నం, మావిచిగురు రెండు చిత్రాలకు సీనియర్ నటి సరిత డబ్బింగ్ చెప్పారని ఆమని వెల్లడించారు. శుభలగ్నంలోని పాత్ర లోతును అర్థం చేసుకొని, సరిత రెండు రోజులు సమయం తీసుకొని డబ్బింగ్ చెప్పారని తెలిపారు. డబ్బింగ్ ఆర్టిస్టులు కేవలం డైలాగ్స్ చెప్పి వెళ్లిపోతారని, కానీ నటులే తమ పాత్రలకు డబ్బింగ్ చెప్పుకోవడం వల్ల భావోద్వేగాలు, చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ మిస్ అవ్వవని ఆమె అభిప్రాయపడ్డారు. సరిత వంటి ఆర్టిస్ట్ తన ఫీలింగ్స్‌ను, నటనను అర్థం చేసుకొని డబ్బింగ్ చెప్పడం గొప్ప విషయమని కొనియాడారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.