చైనాలో ఏ సమయంలో పుట్టిందో గానీ కరోనా వైరస్ నేను వదలను బొమ్మాళి అంటూ మానవాళిని భయపెడుతూనే ఉంది. వెలుగులోకి వచ్చినప్పటి నుంచి రకరకాల వేరియంట్ రూపాలను సంతరించుకుని ప్రపంచ దేశాలను ఓ రేంజ్ లో వణికిస్తోంది. కొవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి ఓ వైపు చర్యలు తీసుకుంటూనే.. వ్యాక్సిన్ ను ఇచ్చాయి అన్ని దేశాలు… హమ్మయ్య ఇక కరోనా అదుపులోకి వచ్చింది.. మళ్ళీ మానవాళి దైనందిన జీవితం నార్మల్ అవుతుంది అనుకుని ఊపిరి పీల్చుకుంటున్న వేళ.. నేనున్నానంటూ కరోనా వైరస్ లోని సరికొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే తన పుట్టినిల్లు అయినా చైనా ను ఓ రేంజ్ లో వణికిస్తోంది. దీంతో భారత దేశం అప్రమత్తమైంది. ఫోర్త్ వేవ్ ముంగిట దేశం నిలిచింది అంటూ వ్యాప్తి నివారణ చర్యలు చేపట్టింది. అధికారులు సంసిద్ధమవుతూనే ప్రజలకు తగిన సూచనలు చేసింది.
అయితే మళ్ళీ కరోనా వ్యాపించనుంది అన్న హెచ్చరిక నేపథ్యంలో కలియుగ కర్ణుడు సోనూ సూద్ పూర్తి సంసిద్ధతతో బాధితులకు తగిన సహాయం అందించడానికి సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడుని దర్శించుకుని ఆశీర్వాదంతీసుకున్న నటుడు సోనూ సూద్ ట్విట్టర్ వేదికగా ఓ ప్రకటన చేశాడు.
कोरोना से सावधानी बरतें, डरे नहीं
ईश्वर करे मेरी ज़रूरत ना पड़े
लेकिन अगर लगे
तो याद रखना .. नंबर वही है ❤️?— sonu sood (@SonuSood) December 23, 2022
తాను తన బృందం సేవలు అవసరమైన వారికి అందుబాటులో ఉంటాయని తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ప్రకటించాడు. కరోనా వైరస్ ముప్పు మళ్ళీ పొంచి ఉన్న అన్న వార్తల నేపథ్యంలో ప్రజలకు సహాయం చేయడానికి తాను చేపట్టిన ప్రణాళిక గురించి చెప్పాడు. తన వాలంటీర్లు, బృంద సభ్యులతో ఒక సమావేశాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఎక్కడైనా కోవిడ్ వలన పరిస్థితి చేయి దాటితే అవసరమైన వారికి సేవ చేయడానికి తామంతా సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నాడు.
బాధితులకు ఎటువంటి అవసరం ఏర్పడినా వెంటనే తాము సహాయం చేయడానికి సిద్ధమని.. ఇదే విషయాన్నీ తన బృందానికి సుచినట్లు చెప్పారు సోనూ. మందులు, ఆక్సిజన్ సిలెండర్లు లేదా మరేదైనా అవసరం ఏర్పడవచ్చు.. బాధితులకు వెంటనే సాయం అందించేందుకు నిరంతరం అందుబాటులో ఉండనున్నామని.. తనకు వీలైనంత మందికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. సహాయం కోసం మమ్మల్ని సంప్రదించాలనుకునే వారికీ నిరంతరం అందుబాటులో ఉంటామని.. ఏ ఒక్క ఫోన్ కాల్ ను మిస్ కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. తనకు సాధ్యమైనంత వరకూ బాధితులు అడిగిన ప్రతిదాన్ని అందించడానికి ప్రయత్నిస్తానని వెల్లడించారు సోనూ.
మనదేశంలో కరోనా అడుగు పెట్టిన 2020 లాక్‌డౌన్ల సమయంలో.. ముంబై సహా భారతదేశంలోని ఇతర నగరాల్లో చిక్కుకున్న వలసదారులకు సోనూ సూద్ ఆశాజ్యోతిగా మారారు. ఎక్కడెక్కడో చిక్కుకున్న లక్షలాది మంది ప్రజలను వారి వారి స్వగ్రామాలకు సురక్షితంగా తరలించారు. అలా మొదలు పెట్టిన సాయాన్ని 2021లో కూడా కొనసాగించారు సోనూ సూద్. ఆపన్నుల పాలిట కలియుగ కర్ణుడుగా నిలిచారు.
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..