Sivaji Raja: నేను కష్టంలో ఉన్నప్పుడు ఇండస్ట్రీలో ఆ ఇద్దరు మాత్రమే ఫోన్ చేసి మాట్లాడారు..
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు నటుడు శివాజీ రాజా. కేవలం సహాయక నటుడిగానే కాదు హీరోగానూ సినిమాలు చేశారు శివాజీ రాజా.. ఓ వైపు వెండి తెరపై సినిమాలతో బిజీగా ఉంటూనే అమృతం సీరియల్ తో బుల్లితెరపై కూడా నవ్వులు పూయించారు.

ప్రముఖ నటుడు శివాజీ రాజా ఫ్రాంక్లీ విత్ టీఎన్‌ఆర్ కార్యక్రమంలో తన వ్యక్తిగత జీవితంలోని అనూహ్య మలుపులను, కష్టాలను పంచుకున్నారు. ఆయన తన జీవితంలో మూడు కీలకమైన “ప్రమాదాలను” ఎదుర్కొన్నానని, అవి తన జీవిత గమనాన్నే మార్చేశాయని వెల్లడించారు. మొదటి రెండు శారీరక ప్రమాదాలు కాగా, మూడవది అత్యంత బాధాకరమైనదని ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ మూడవ “ప్రమాదం” తన తల్లిదండ్రులతో సంబంధించింది. కొందరు దుర్మార్గులు, “మీ అబ్బాయి సినిమా ఆర్టిస్ట్. మణికొండలో వంద కోట్ల స్థలం ఉంది. మీరేంటి ఇంకా పెంట్ హౌస్‌లో ఉంటారు?” వంటి మాటలతో తన తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించారని శివాజీ రాజా ఆవేదన వ్యక్తం చేశారు. దీనితో, తన కొడుకు తమను చూసుకోవడం లేదని టీవీలో తన తల్లిదండ్రులు చెప్పడం తనకు తీరని ఆవేదన కలిగించిందన్నారు. ఈ సంఘటన తనను మానసికంగా ఎంతగానో కుంగదీసిందని, ఆ క్షణంలో మైండ్ బ్లాంక్ అయిపోయిందని ఆయన వివరించారు.
“మా తల్లిదండ్రులకు నేను తప్ప ఎవరున్నారు? లేనివారి కోసం ఇంతగా పోరాడే నాకు, నా తల్లిదండ్రులను చూసుకోవడం తెలియదా?” అని ప్రశ్నించారు. ఈ కష్ట సమయంలో పోసాని కృష్ణ మురళి, వేణు మాధవ్ ఇద్దరే ఫోన్ చేసి మాట్లాడారు.ఆ తర్వాత తన కొద్దిమంది మిత్రులు మాత్రమే తనకు అండగా నిలిచారని, మిగతా వారంతా దూరం పెట్టారని పేర్కొన్నారు. మరో ప్రమాదం ఒక భయంకరమైన యాక్సిడెంట్. ఈ ప్రమాదంలో ఆయన శరీరం ఎడమ వైపు పూర్తిగా దెబ్బతిని, అనేక రాడ్లు అమర్చాల్సి వచ్చిందని తెలిపారు. ఈ పరిణామంతో తాను ఇక సినిమాల్లో నటించలేనేమోనని భయం వేసిందన్నారు. ఆ కష్టం నుంచే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) పట్ల మరింత అనుబంధం పెంచుకున్నానని చెప్పారు. మురళీమోహన్ గారు ఎవరికైనా కష్టం వస్తే ముందుండే తీరు తనకు స్ఫూర్తినిచ్చిందని, అందుకే మాలో ఏదో ఒక సభ్యుడిగా కొనసాగాలని నిర్ణయించుకున్నానని వివరించారు. పీ.ఎల్. నారాయణ గారి మరణం నుంచి తెలంగాణ శకుంతల గారి అంతిమ సంస్కారాల వరకు, కష్టాల్లో ఉన్న ప్రతి కళాకారుడికి అండగా నిలవడం తనకు అలవాటైందన్నారు.
“నేను గాలివాటంగా మా ప్రెసిడెంట్ కాలేదు. దీని వెనుక 20 ఏళ్ల కష్టం ఉంది” అని ఆయన నొక్కిచెప్పారు. కష్టాల్లో ఉన్న ఏ ఆర్టిస్ట్ కైనా ముందు గుర్తొచ్చే ఇద్దరు ముగ్గురిలో శివాజీ రాజా ఒకరని, ఈ పేరును తానెంతో కష్టపడి సంపాదించుకున్నానని తెలిపారు. తనకు ఐదు నిమిషాల వ్యవధిలో నిజం తెలిస్తే ఎవరినీ వదిలిపెట్టేవాడిని కాదని, కానీ ఈ సంఘటనలు తన ఆలోచనా ధోరణిని మార్చేశాయని చెప్పారు. జీవితంలో అప్పు అంటే భయమని, క్రమశిక్షణతో ఉంటానని, సహాయం చేయాలనుకున్నవారికి పూర్తి అండగా నిలుస్తానని, లేకపోతే దూరంగా ఉంటానని తన వ్యక్తిత్వాన్ని వివరించారు. ఈ అనుభవాలన్నీ తనను మరింత బలంగా, మరింత నిబద్ధతతో మా సేవలో కొనసాగేలా చేశాయని శివాజీ రాజా తెలిపారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
