Kamal Haasan: కలెక్టర్ కావాలని కలలు కన్న పేద విద్యార్థిని.. అండగా నిలిచిన కమల్ హాసన్.. ఏం చేశారో తెలుసా?

కోలీవుడ్‌ స్టార్‌ హీరో కమల్‌ హాసన్‌ ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ బిజి బిజీగా ఉంటున్నాడు. తాజాగా ఈ దిగ్గజ నటుడు మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. కలెక్టర్ కావాలని కలలు కంటోన్న ఓ పేద విద్యార్థినికి అండగా నిలిచారు.

Kamal Haasan: కలెక్టర్ కావాలని కలలు కన్న పేద విద్యార్థిని.. అండగా నిలిచిన కమల్ హాసన్.. ఏం చేశారో తెలుసా?
Kamal Haasan

Updated on: May 20, 2025 | 11:52 AM

కుడి చేత్తో చేసిన సాయం ఎడమ చేతికి తెలియకూడదంటారు. లోక నాయకుడు, హీరో కమల్ హాసన్ విషయంలో ఈ మాట నిజమనిపిస్తోంది. ఎందుకంటే ఈ నటుడు తను చేసిన సాయాన్ని బయటి ప్రపంచానికి పెద్దగా చెప్పుకోడు. ఆయన ఇప్పటికే కమల్‌ సాంస్కృతిక కేంద్రాలను ఏర్పాటు చేసి వేలాది మందికి విద్యాదానం చేస్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో కమల్ సాయం పొందిన వారు ఏదో వేదిక మీద హీరో గారి గొప్ప మనసు గురించి చెబుతుంటారు. అలా తాజాగా ఒక పేద విద్యార్థిని ఉన్నత విద్యకు సాయం అందించారు కమల్ హాసన్. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తమిళనాడులోని రామనాథపురం జిల్లా, పాంబన్‌ సమీపంలోని తెర్కువాడి మత్స్యకార గ్రామానికి చెందిన శోభన అనే విద్యార్ధిని చదువులో చాలా చురుకు. కానీ తండ్రి మత్స్యకారుడు. తల్లి ఓ పీతల ఎగుమతి కంపెనీలో రోజు వారీ కూలీగా పనిచేస్తోంది. ఇలా కడు పేదిరికం మధ్యన, ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా ప్లస్‌ –2 పరీక్షల్లో 562 మార్కులు సాధించి డిస్టింక్షన్ లో ఉత్తీర్ణురాలైంది శోభన. తాను చదివిన ప్రభుత్వ పాఠశాలలోనే అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినిగా నిలిచింది. కాగా శోభనకు ఉన్నత చదువులు అభ్యసించి కలెక్టర్ అవ్వాలన్నది ఆశ. కానీ అందుకు తగ్గ కుటుంబ ఆర్థిక స్థోమత లేకపోవడంతో శోభన చదువు మానేసింది. ఒక బట్టల దుకాణంలో పనికి చేరింది.

శోభన విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్నారు హీరో కమల్ హాసన్. వెంటనే ఆమెను తన కార్యాలయానికి పిలిపించారు. తన ఆధ్వర్యంలో ఉన్న కమల్ సాంస్కృతిక కేంద్రం ద్వారా విద్యార్థిని ఉన్నత విద్యకు అయ్యే ఖర్చులకు ఆర్థిక సాయం చేశారు. ఆ అమ్మాయి సివిల్‌ సర్వీసెస్ పరీక్షలు రాసేవరకు కావాల్సిన ఏర్పాట్లు చేశారు. తన సంరక్షణలోనే గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి ఆపై సివిల్‌ సర్వీసెస్‌ కు కావాల్సిన ఆర్థిక వనరులు ఏర్పాటు చేస్తానని శోభనకు మాటిచ్చారు. దీంతో ఆ విద్యార్థినితో పాటు ఆమె కుటుంబ సభ్యులు సంతోషంలో మునిగిపోయారు. కమల్‌ సార్‌ చేసిన సాయాన్ని ఎట్టిపరిస్థితిల్లోనూ వృధా కానివ్వనని, ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటానని శోభన ఎమోషనలైంది.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. కమల్ పై అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

కమల్ ఆఫీసులో పేద విద్యార్థిని శోభన..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.