
కన్నడ స్టార్ హీరో ధ్రువ సర్జా రెండోసారి తండ్రిగా ప్రమోషన్ పొందాడు. అతని భార్య ప్రేరణ సోమవారం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. వినాయక చవితి రోజే పండంటి బిడ్డ పుట్టడంతో సర్జా ఫ్యామిలీ పండగ సంతోషం డబుల్ అయ్యింది. ధ్రువ సర్జా, ప్రేరణ దంపతులు అమ్మానాన్నలు కావడం ఇది రెండోసారి. 2019 లో వివాహం చేసుకున్న ఈ దంపతులకు 2022 అక్టోబర్‌లో ఓ ఆడబిడ్డ జన్మించింది. ఇప్పుడు మగబిడ్డ జన్మించడంతో ధ్రువ సర్జా దంపతుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రేరణ ప్రసవం జరిగింది. తాను రెండోసారి తండ్రైన విషయాన్ని ధ్రువ సర్జానే సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ‘సాధారణ ప్రసవం జరిగింది. బేబీ పుట్టింది’ అని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు సర్జా. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు సర్జా దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇటీవల ప్రేరణ సీమంతం వేడుకలు ఘనంగా నిర్వహించాడు ధ్రువ సర్జా. తన అన్న చిరంజీవి సర్జా సమాధి దగ్గర భార్య సీమంతం నిర్వహించి సోదరుడిపై ప్రేమను చాటుకున్నాడీ స్టార్ హీరో. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరలైన సంగతి తెలిసిందే.
కాగా చిరంజీవి సర్జా సతీమణి మేఘనా రాజ్ నటించిన ‘తత్సమ తద్భవ’ చిత్రం ఇటీవలే విడుదలైంది. సస్పెన్స్ థ్రిల్లర్గా రూపొందిన ఈ సినిమాతో చాలా రోజుల తర్వాత సిల్వర్ స్క్రీన్‌పై కనిపించింది మేఘనారాజ్. ఈ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో సర్జా కుటుంబ సభ్యులు సంతోషంలో మునిగితేలుతున్నారు. ఇప్పుడు ప్రేరణ మగబిడ్డకు జన్మనివ్వడంతో ఈ ఆనందం డబుల్ అయ్యింది. కాగా మరికొన్ని రోజుల్లో ధ్రువ పుట్టిన రోజు రానుంది. అంతకుముందే రెండోసారి తండ్రిగా ప్రమోషన్ పొందాడు విశేషం.
పొగరుతో పాటు పలు డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు ధ్రువ సర్జా. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నాడు. ఇటీవల అతను నటించిన ‘మార్టిన్’ సినిమా టీజర్ అందరినీ ఆకట్టుకుంది. త్వరలోనే ఈ యాక్షన్ డ్రామా విడుదల కానుంది. దీంతో పాటు ‘కెడి’ పనుల్లో కూడా బిజీగా ఉన్నాడు ధ్రువ్. ప్రేమ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో సంజయ్ దత్ మరోసారి విలన్ పాత్రలో నటించేందుకు సిద్ధమయ్యాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..