AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : హీరో అవుదామని వచ్చాడు.. కానీ ఇండస్ట్రీలోనే No.1 విలన్ అయ్యాడు.. 55 ఏళ్లలో 800కు పైగా సినిమాలు..

టాలీవుడ్ సినీయర్ నటుడి సినీ ప్రస్థానం అసాధారణమైనది. హీరోగా అరంగేట్రం చేసి విఫలమైన ఆయన, విఠలాచార్య సలహాతో విలన్ గా మారి తెలుగు చిత్ర పరిశ్రమలో నంబర్ 1 విలన్ గా ఎదిగారు. ఎన్టీఆర్ ఇచ్చిన అవకాశంతో కీలకమైన పాత్రలు, ఆ తర్వాత ఎస్.వి. రంగారావు ప్రశంసలు అందుకున్న కామెడీ పాత్రలతో తన బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నారు. ప్రతి పాత్రను సవాలుగా స్వీకరించి విజయం సాధించారు.

Tollywood : హీరో అవుదామని వచ్చాడు.. కానీ ఇండస్ట్రీలోనే No.1 విలన్ అయ్యాడు.. 55 ఏళ్లలో 800కు పైగా సినిమాలు..
Kaikala Satyanarayana
Rajitha Chanti
|

Updated on: Sep 14, 2026 | 3:24 PM

Share

తెలుగు సినీ చరిత్రలో కైకాల సత్యనారాయణ గారి స్థానం సుస్థిరం. దాదాపు 55 సంవత్సరాల సినీ ప్రస్థానంలో 800కు పైగా చిత్రాలలో నటించిన ఆయన, నవరసాలను అలవోకగా పండించగల విలక్షణ నటుడిగా పేరుగాంచారు. ప్రతి పాత్రను పాదరసంలా ఒదిగిపోయి చేసే ఆయన సినీ గమనం అనేక మలుపులతో కూడుకున్నది. తొలుత హీరో కావాలనే ఆశతో చిత్రసీమలోకి అడుగుపెట్టిన సత్యనారాయణ గారికి అది సాధ్యపడలేదు. అప్పటి దర్శక దిగ్గజం విఠలాచార్య ఆయనలో ఉన్న ప్రత్యేకతను గుర్తించి ఒక కీలకమైన సలహా ఇచ్చారు. “హీరోలుగా పోటీ ఎక్కువ, నీకు నేపథ్యం లేదు. కానీ విలన్ల కొరత ఉంది. ఆర్. నాగేశ్వరరావు గారు లేరు, రాజనాల గారు ఒక్కరే ఉన్నారు, ముక్కామల గారికి వయసు మీద పడింది. నువ్వు విలన్ గా మారితే గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవచ్చు” అని విఠలాచార్య గారు సత్యనారాయణకు సూచించారు. ఆయన సలహాను స్వీకరించి, విఠలాచార్య స్వయంగా తన కనక దుర్గ పూజ మహిమ చిత్రంలో మొదటి విలన్ అవకాశాన్ని కల్పించారు.

ఆ తర్వాత ఎన్టీఆర్ తో కలిసి నటించిన అగ్గిపిడుగు (ది బ్రదర్స్ కరామాజోవ్ ఆంగ్ల చిత్రం నుండి స్ఫూర్తి పొందింది) సత్యనారాయణ గారి కెరీర్ లో ఒక ప్రధాన మలుపు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో నటించగా, సత్యనారాయణ ఒక రామారావుకు ప్రతినాయకుడిగా నిలిచారు. ఈ సినిమా ప్రివ్యూ సమయంలో పరిశ్రమ ప్రముఖులందరూ ఆయన నటనను చూసి అద్భుతమన్నారు. ఈ చిత్రంతో రామారావు, కైకాల సత్యనారాయణ కాంబినేషన్ కు విశేష ఆదరణ లభించింది. అలా కొంతకాలం పాటు నలుగురు అగ్ర కథానాయకులకు ఆయనే విలన్ గా నటించి తెలుగు సినీ పరిశ్రమలో నంబర్ 1 విలన్ గా పేరుపొందారు. విలన్ గా అగ్రస్థానంలో ఉన్నప్పటికీ, సత్యనారాయణ గారి అంతర్గత ఆకాంక్ష అన్ని రకాల పాత్రలు చేయగల క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎదగడమే. ఈ ఆశయం నెరవేరే సమయంలోనే ఆయనకు అద్భుతమైన పాత్రలు లభించాయి. ఎన్టీఆర్ దర్శకత్వంలో రూపొందిన ఉమ్మడి కుటుంబం చిత్రంలో సెకండ్ బ్రదర్ గా ఒక కీలకమైన, భావోద్వేగపూరితమైన పాత్రను పోషించారు. అప్పటికి ఆయన విలన్ గా ప్రసిద్ధి చెంది ఉండగా, ఈ పాత్రను అద్భుతంగా పండించగలననే నమ్మకాన్ని ఎన్టీఆర్ కు వ్యక్తం చేశారు. ఆయన నటనను చూసిన ఎన్టీఆర్ స్వయంగా “నిజానికి నేను కూడా అంత నాచురల్ గా చేయలేదేమో” అని ప్రశంసించారు. ఈ పాత్ర విజయంతో శారద, అత్తగారు కొత్తకోడలు వంటి సామాజిక చిత్రాలలో కూడా ఆయనకు పాత్రలు రావడం మొదలైంది.

ఆ తర్వాత హాస్యపాత్రల వైపు కూడా దృష్టి సారించారు. కృష్ణ హీరోగా నటించిన దేవుడు చేసిన మనుషులు చిత్రంలో ఆయన పోషించిన హాస్యపాత్ర అద్భుతంగా పండింది. ఆయన నటనకు ఎంతగా ప్రభావితులయ్యారంటే, ఆ చిత్రంలో నటించిన ఎస్.వి. రంగారావు గారు స్వయంగా కైకాల సత్యనారాయణను కలిసి “ఒక ఆర్టిస్ట్ గా మీకు కంగ్రాట్యులేషన్స్ చెప్పడానికి వచ్చాను. ఇది నా జీవితంలో రెండో మార్క్. నన్ను కూడా ఒక్క క్షణం ఎక్కడా కనపడకుండా నిలబెట్టావు” అని ప్రశంసించారు. ఇది సత్యనారాయణ గారి కెరీర్ లో మరో మైలురాయి. ఇలా విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, హాస్యనటుడు ఇలా అన్ని రకాల పాత్రలను అలవోకగా పోషిస్తూ, తెలుగు సినీ చరిత్రలో ఒక విలక్షణ నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. సినీరంగంలో తనదైన ముద్ర వేసిన ఆయన 2022 డిసెంబర్ 23న తుదిశ్వాస విడిచారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood: సినిమా మొత్తం హీరో ఒకే రంగు షర్ట్ లో ఉంటాడు.. హిట్టు కాదన్నారు.. థియేటర్లు హౌస్ ఫుల్ అయ్యాయి..

కైకాల సత్యనారాయణ..

Kaikala Satyanarayana Movie

Kaikala Satyanarayana Movie

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ సినిమా తర్వాత హీరోయిన్‏కు వెండి పళ్లెంలో పట్టు బట్టలు ఇచ్చాను.. డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి.. 

Follow Us