Ganesh Chaturthi: గణేశ విసర్జన్.. 3, 5, 7వ రోజు లేదా అనంత చతుర్దశి.. ఎప్పుడు నిమజ్జనం చేయాలి?
Ganesh Visarjan 2026 Dates Telugu: వినాయక చవితి సెప్టెంబర్ 14న జరగనుంది. కుటుంబ సంప్రదాయాలను బట్టి 3, 5, 7వ రోజుల్లో లేదా అనంత చతుర్దశి రోజున గణేశ విసర్జన్ చేస్తారు. 2026 గణేశ నిమజ్జనం తేదీలు, శుభ సమయాలు, ఆధ్యాత్మిక ప్రాధాన్యతను వివరంగా తెలుసుకోండి.

Ganesh Visarjan 2026 Dates Telugu: వినాయక చవితి వేడుకలు అంటే భక్తి, పూజలు, హారతులు, భజనలు, సందడితో నిండిన ఆధ్యాత్మిక వాతావరణం. గణపయ్యను ఇంటికి ఆహ్వానించి పూజలు నిర్వహించిన భక్తులు.. చివరగా ఎంతో భావోద్వేగంతో గణేశ విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు. ఈ ఘట్టాన్నే గణేశ విసర్జన్ లేదా వినాయక నిమజ్జనం అని పిలుస్తారు. 2026లో వినాయక చవితి సెప్టెంబర్ 14న సోమవారం జరుపుకుంటున్నారు. కుటుంబ సంప్రదాయాలను బట్టి కొందరు భక్తులు 3వ రోజు, మరికొందరు 5వ రోజు లేదా 7,9వ రోజు గణేశ విసర్జన్ చేస్తారు. 10 రోజుల పాటు గణేశోత్సవాన్ని నిర్వహించే కుటుంబాలు మాత్రం అనంత చతుర్దశి రోజున గణపయ్యకు వీడ్కోలు పలుకుతారు.
గణేశ విసర్జన్ 2026 ఎప్పుడు?
2026లో గణేశ విసర్జన్ తేదీలు ఈ విధంగా ఉన్నాయి:
3వ రోజు గణేశ విసర్జన్ 2026
మూడు రోజుల పాటు గణపయ్యను పూజించే కుటుంబాలు సెప్టెంబర్ 16, బుధవారం రోజున విగ్రహ నిమజ్జనం చేస్తారు. ఈ రోజున అనుకూల సమయాలు ఉదయం 10:43 నుంచి మధ్యాహ్నం 12:16 వరకు, మధ్యాహ్నం 3:20 నుంచి సాయంత్రం 6:25 వరకు, రాత్రి 7:53 నుంచి అర్ధరాత్రి 12:16 వరకు ఉన్నాయి. సెప్టెంబర్ 17 తెల్లవారుజాము, ఉదయం వేళల్లో కూడా కొన్ని శుభ సమయాలు ఉన్నాయి.
5వ రోజు గణేశ విసర్జన్ 2026
ఐదవ రోజు గణేశ విసర్జన్‌ను సెప్టెంబర్ 18, శుక్రవారం నిర్వహిస్తారు. ఈ రోజున ఉదయం 6:07 నుంచి 10:43 వరకు, మధ్యాహ్నం 12:15 నుంచి 1:47 వరకు, సాయంత్రం 4:51 నుంచి 6:23 వరకు, రాత్రి 9:19 నుంచి 10:47 వరకు అనుకూల సమయాలు ఉన్నాయి. ఈ విధంగా గణపయ్యను మరికొన్ని రోజులు ఇంట్లో ఉంచుకుని కుటుంబ సభ్యులు భక్తిశ్రద్ధలతో పూజలు, హారతులు నిర్వహించవచ్చు.
7వ రోజు గణేశ విసర్జన్ 2026
ఏడు రోజుల పాటు గణేశుడిని పూజించే కుటుంబాలు సెప్టెంబర్ 20, ఆదివారం రోజున విసర్జన్ చేస్తారు. ఈ రోజున ఉదయం 7:40 నుంచి మధ్యాహ్నం 12:14 వరకు, మధ్యాహ్నం 1:46 నుంచి 3:17 వరకు, సాయంత్రం 6:20 నుంచి రాత్రి 10:46 వరకు శుభ సమయాలు ఉన్నాయి. రాత్రి, తెల్లవారుజామున కూడా మరికొన్ని అనుకూల సమయాలు ఉన్నాయి. కొందరు 9వ రోజున కూడా గణేశ నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
అనంత చతుర్దశి రోజున గణేశ విసర్జన్
పది రోజుల పాటు గణేశోత్సవాన్ని నిర్వహించే కుటుంబాలకు అనంత చతుర్దశి అత్యంత ముఖ్యమైనది. 2026లో అనంత చతుర్దశి సెప్టెంబర్ 25, శుక్రవారం వస్తుంది. ఈ రోజున గణపయ్య విగ్రహాన్ని నిమజ్జనం చేసి భక్తులు వేడుకలకు ముగింపు పలుకుతారు. సెప్టెంబర్ 25న గణేశ విసర్జన్‌కు అనుకూల సమయాలు ఉదయం 6:11 నుంచి 10:42 వరకు, మధ్యాహ్నం 12:13 నుంచి 1:43 వరకు, సాయంత్రం 4:44 నుంచి 6:14 వరకు, రాత్రి 9:14 నుంచి 10:43 వరకు ఉన్నాయి.
కుటుంబ సంప్రదాయాలను బట్టి విసర్జన్ రోజులు
ప్రతి కుటుంబంలో గణేశుడిని ఒకే సంఖ్యలో రోజులు ఉంచడం ఉండదు. కొందరు మూడు రోజులకు, మరికొందరు ఐదు లేదా ఏడు రోజులకు గణపయ్యను నిమజ్జనం చేస్తారు. మరికొందరు పది రోజుల పాటు పూజలు నిర్వహించి అనంత చతుర్దశి రోజున విసర్జన్ చేస్తారు. విసర్జన్ చేసే రోజులు వేర్వేరుగా ఉన్నప్పటికీ.. గణపయ్యపై భక్తి, విశ్వాసం మాత్రం ఒక్కటే. తమ కుటుంబంలో తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని అనుసరించి భక్తులు గణేశ విసర్జన్ నిర్వహిస్తారు.
గణేశ విసర్జన్ వెనుక ఆధ్యాత్మిక భావం ఏమిటి?
గణేశ చతుర్థి రోజున గణపయ్యను ఇంటికి ఆహ్వానించి పూజలు, నైవేద్యాలు, హారతులతో భక్తులు స్వాగతిస్తారు. కొన్ని రోజుల పాటు భక్తిశ్రద్ధలతో ఆరాధించిన అనంతరం విసర్జన్ ద్వారా గణపయ్యకు వీడ్కోలు పలుకుతారు. విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేయడం కేవలం వీడ్కోలు చెప్పే ప్రక్రియగా మాత్రమే చూడరు. మనం పూజించిన దైవ రూపం తిరిగి ప్రకృతిలో కలిసిపోవడం ద్వారా సృష్టి, స్థితి, లయ అనే ప్రకృతి చక్రాన్ని గుర్తుచేస్తుందని ఆధ్యాత్మిక భావన.
గణపయ్య విగ్రహం మన కళ్లకు దూరమైనప్పటికీ.. ఆయనపై ఉన్న భక్తి, విశ్వాసం మన హృదయాల్లో కొనసాగుతాయి. గణేశ విసర్జన్ అంటే వేడుకలకు ముగింపు మాత్రమే కాదు.. గణపయ్య అనుగ్రహాన్ని మన జీవితాల్లో ముందుకు తీసుకెళ్లే ఆధ్యాత్మిక సంకల్పానికి ప్రతీకగా కూడా భావిస్తారు. అందుకే గణేశ విసర్జన్ సమయంలో భక్తుల హృదయాల్లో ఒకవైపు వీడ్కోలు బాధ ఉన్నప్పటికీ.. మరోవైపు గణపయ్య మళ్లీ తమ ఇంటికి వస్తారనే ఆశ, విశ్వాసం ఉంటుంది. “గణపతి బప్పా మోరియా.. వచ్చే ఏడాది త్వరగా రా” అంటూ భక్తులు గణపయ్యకు వీడ్కోలు పలుకుతారు.
(Disclaimer: ఈ కథనంలోని శుభ సమయాలు, ఆధ్యాత్మిక విశ్వాసాలు సంప్రదాయాలు, పంచాంగ వివరాల ఆధారంగా ఇవ్వబడ్డాయి. ప్రాంతం, కుటుంబ ఆచారాలను బట్టి సమయాల్లో మార్పులు ఉండవచ్చు. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)




