కట్టప్ప పాత్రకు మొదటి ఛాయిస్‌ సత్యరాజ్‌ కాదు.. ఆ నటుడట

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' ప్రపంచవ్యాప్తంగా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

  • Tv9 Telugu
  • Publish Date - 8:16 pm, Sat, 11 July 20
కట్టప్ప పాత్రకు మొదటి ఛాయిస్‌ సత్యరాజ్‌ కాదు.. ఆ నటుడట

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ ప్రపంచవ్యాప్తంగా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండు భాగాలుగా వచ్చిన ఈ సినిమా భారతీయ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఎన్నో అవార్డులు, రివార్డులను సాధించి తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పింది. కాగా ఇందులో కట్టప్ప పాత్రలో నటించిన తమిళ నటుడు సత్యరాజ్ ఆ పాత్రకు ప్రాణం పోశారు‌. ఇక ఆ పాత్ర అందరిలో ఎలా చొచ్చుకుపోయిందంటే.. ‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు’ అన్న ప్రశ్న ఆ సమయంలో పలువురు ప్రముఖుల నోటి నుంచి కూడా వినిపించింది.

ఇదిలా ఉంటే ఈ పాత్ర కోసం మొదటి ఛాయిస్‌ సత్యరాజ్‌ కాదట. బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ని ఈ పాత్ర కోసం అనుకున్నారట. ఈ విషయాన్ని జక్కన్న తండ్రి, బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. ”కట్టప్ప పాత్ర కోసం రాజమౌళి ముందుగా సంజయ్‌ని అనుకున్నారు. కానీ ఆ సమయంలో సంజయ్‌ జైలులో ఉండటం వలన షూటింగ్‌కు కష్టమవుతుందని భావించిన రాజమౌళి సత్యరాజ్‌ను ఎంచుకున్నారు” అని విజయేంద్రప్రసాద్ తెలిపారు. కాగా ఈ పాత్ర ఒక్కటే కాదు శివగామి పాత్ర కోసం కూడా మొదట శ్రీదేవీ, మంచు లక్ష్మీలను సంప్రదించారు జక్కన్న. అయితే ఆ ఇద్దరు ఆ పాత్రను వద్దనడంతో రమ్యకృష్ణను వరించిన విషయం తెలిసిందే.