Tollywood: సంక్రాంతి సంబురాన్ని రెండు రోజుల ముందే తెచ్చిన సినిమాలు.. మాస్ జాతరతో పండుగ చేసుకుంటున్న సినీ లవర్స్.
పండగొచ్చింది.. తెలుగు రాష్ట్రాలలో రెండురోజుల ముందు నుంచే జాతర.. పూనకాలు షురూ అయిపోయాయి. చాలా కాలం తరువాత బాక్సాఫీస్ దగ్గర ఇద్దరు బడా స్టార్స్ కాలుదువ్వారు. సంక్రాంతి పండగ అంటే.. తెలుగు రాష్ట్రాలలో పిండివంటలు.. కొత్తబట్టలు.. కోడి పందాలు.. ఇవే కాదు..
పండగొచ్చింది.. తెలుగు రాష్ట్రాలలో రెండురోజుల ముందు నుంచే జాతర.. పూనకాలు షురూ అయిపోయాయి. చాలా కాలం తరువాత బాక్సాఫీస్ దగ్గర ఇద్దరు బడా స్టార్స్ కాలుదువ్వారు. సంక్రాంతి పండగ అంటే.. తెలుగు రాష్ట్రాలలో పిండివంటలు.. కొత్తబట్టలు.. కోడి పందాలు.. ఇవే కాదు.. సినిమా కూడా ప్రజల జీవితంలో భాగం. కాలం మరినా.. సినిమాల తీరు మారినా.. పండగ సినిమాకి అదే క్రేజు.. అంతే మోజు.. తెలుగు సినిమా ప్రపంచ వెండితెరపై వెలుగులు విరజిమ్ముతున్నా.. టాలీవుడ్ సినిమాను చూసి ప్రపంచం మొత్తం అసూయ పడే స్థాయికి వచ్చినా.. పండగ సినిమా మాత్రం అసలు సిసలు మాస్ మసాలా ఘుమ ఘుమలతో ఉండాల్సిందే. అయితే, రకరకాల కారణాలతో కొన్ని సంవత్సరాలుగా సరైన మాస్ సినిమాలు రాలేదనే చెప్పాలి. ఒకటీ రెండూ వచ్చినా.. అవి పండగ స్థాయి మాస్ మసలాలు కాకపోవడంతో పండగ పోకముందే.. థియేటర్లు ఖాళీ అయిపోయాయి.
ఈ సంవత్సరం మళ్లీ మాస్ బాక్స్‌లు తెరుచుకున్నాయి. ఒక నిర్మాత.. రెండు సినిమాలు.. ఇద్దరు స్టార్ హీరోలు.. రెండు రోజులు.. అంతే.. సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ఒక సినిమా మాస్ జాతర తీసుకువస్తే.. ఇంకో సినిమా దానికి మించి పూనకాలు తెప్పించింది. అభిమానులు మాత్రమే కాదు సగటు ప్రేక్షకుడు కూడా రెండున్నర గంటల నుంచి మూడు గంటల పాటు.. సిసలైన పండగ సినిమా చూస్తున్నామనే ఫీల్ తెచ్చాయి. రెండు సినిమాలనూ కంపేర్ చేయడం సరైన పని కాదు.. కానీ ఒకేసారి వచ్చిన సినిమాలు కావడంతో అందరూ పోలికలు వెతకడం.. ఏది బెటర్ అనే ప్రశ్నలు సంధించడం కామన్ గా జరుగుతుంది. అందుకే రెండు సినిమాలనూ ఒకేసారి పరిచయం చేస్తే బావుంటుంది అనిపించింది.
ముందుగా బాలకృష్ణ సినిమాతో మొదలు పెడదాం. బాలకృష్ణ అఖండ సినిమాతో నేను అన్‌స్టాపబుల్ అన్నారు.. దానికి కంటిన్యూస్ గా ఇప్పుడు వీర సింహా రెడ్డితో అన్ స్టాపబుల్ 2 అని అనిపించుకున్నారు. ఈ సినిమా మీద ఎన్నో అంచనాలు ఉన్నాయి.. టీజర్.. ట్రైలర్స్ ఒక లెక్కలో ఉంటే.. అంతకు మించి బాలయ్య బాబు చెప్పిన ఒకే డైలాగ్ సినిమా వెంటనే చూసేయాలనే క్యూరియాసిటీ తీసుకువచ్చింది. అనుకున్నట్టుగానే సినిమా ఆ అంచనాలు నిలబెట్టుకుంది. ఫ్యాక్షన్.. బాలకృష్ణ ఫేవరెట్ జోన్. ఆ జోన్ లో మరే హీరోకి లేని రికార్డ్స్ బాలయ్య బాబుకి ఉన్నాయి. వీరసింహా రెడ్డి సినిమా కూడా అంతే. డబుల్ యాక్షన్ తో.. ఫ్యాన్స్ కు జాతర తీసుకువచ్చారు బాలకృష్ణ. కథ పాతదే కావచ్చు.. కథనం కొత్తగా ఉంది.. గోపీచంద్ మలినేని తన మార్క్ తో సినిమాను ఒక రేంజ్‌లో నిలబెట్టారు. బాలకృష్ణ ఒక్కరే సినిమాను మొత్తం మోశారు. ఆయన డైలాగులు.. సినిమాను మరో మెట్టు ఎక్కించాయి. రాజకీయంగా హీట్ కూడా పెంచాయి. ఎవరూ కత్తి పట్టకూడదు.. సీమ బావుండాలి.. అని కత్తి పట్టిన ఒక నాయకుడు.. తన చెల్లికే బద్ధ శత్రువుగా మారిపోతే ఏమవుతుంది? పాయింట్ ఇంతే.. సినిమా అందరినీ ఆకట్టుకునేలా వచ్చింది.
ఇక మాస్ సినిమాలకు కేరాఫ్ ఎడ్రస్ లాంటి ఇద్దరు ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే ఎలా ఉంటుంది.. మెగా మాస్ కదా. అదే కనిపించింది వాల్తేరు వీరయ్య సినిమాలో. చిరంజీవి మార్క్ కామెడీ.. రవితేజ మార్క్ మాస్.. మెగాస్టార్ మార్క్ పాటలు.. రవితేజ మార్క్ డైలాగులు.. ఓ ఇరవై ఏళ్ల క్రితం చిరంజీవి కనిపించారు. చిరంజీవికి ధీటుగా.. మాస్ మహారాజా మళ్లీ విక్రమార్కుడు అయిపోయారు. ఇద్దరు మిత్రులు.. ఒక వెన్నుపోటు.. అన్నదమ్ములు అంతర్లీనంగా ఉండే అనుబంధాలు.. వీటి మధ్యలో సాగిన సినిమా కథనం సిసలైన పండగ సినిమాలా సాగింది.
రెండు సినిమాల్లో కామన్ పాయింట్స్..
రెండు సినిమాలనూ ఏది గొప్ప అని పోల్చడం కరెక్ట్ కాదు కానీ.. రెండు సినిమాల్లో కామన్ పాయింట్స్ ఒకసారి చూద్దాం.. వీర సింహారెడ్డి గోపీచంద్ మాలినేని డైరెక్షన్. ఈయన బాలకృష్ణకు వీరాభిమాని. అటు బాబీ కొల్లి.. చిరంజీవి అంటే పడి చచ్చిపోతారు. అందుకే ఇద్దరూ కూడా తమ హీరోలకు హిట్ ఇవ్వాలనే కసితో సినిమాలు తీశారు. అది తెరమీద స్పష్టంగా కనిపించింది. బాలకృష్ణ ఫ్యాక్షన్ సినిమాలో కత్తి పట్టి కనిపించిన ఒకటి రెండు సినిమాలు తప్ప అన్నీ బాక్సాఫీస్ ను ఊచకోత కోసినవే. అలాగే చిరంజీవి గన్ను పట్టిన సినిమాలు బాక్సాఫీసు బద్దలు చేసినవే. వీరసింహా రెడ్డిలో చెల్లెలి సెంటిమెంట్.. వాల్తేరు వీరయ్యలో తమ్ముడు సెంటిమెంట్.. వీర సింహారెడ్డిలో సెకండ్ హాఫ్ చెల్లెలి పాత్ర ఒక రేంజిలో కనిపిస్తుంది.. వాల్తేరు వీరయ్యలో తమ్ముడి పాత్ర సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకు వెళుతుంది. రెండు సినిమాల్లోనూ హీరో తండ్రికి ఇద్దరు భార్యలు.. పిల్లలు ఇద్దరూ వేరు వేరు తల్లులకు పుట్టిన వాళ్లు. రెండు సినిమాల్లోనూ హీరోయిన్ ఒక్కరే. శృతి హాసన్. రెండిటిలోనూ అంతంత మాత్రం పరిధి మాత్రమే. రెండు సినిమాల్లోనూ డైలాగులు అదిరిపోతాయి. బాలకృష్ణ సినిమాలో రాజకీయంగా డైలాగ్ లు ఆయన శైలికి అద్దం పడతాయి. చిరంజీవి తన మార్క్ టైమింగ్ తో కామెడీ స్టైల్ డైలాగ్స్ తో విజిల్స్ వేయించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..