
బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నవారిలో ప్రియాంక జైన్ ఒకరు. మౌనరాగం వంటి సీరియల్స్ లో నటించి ఫేమస్ అయిన ఈ ముద్దుగుమ్మ బిగ్‌బాస్ తెలుగు సీజన్- 7 లో కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసింది. విజేతగా నిలవకపోయినా తన ఆట, మాటతీరుతో బుల్లితెర ఆడియెన్స్ మనసులు గెల్చుకుంది. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చాక పలు టీవీ షోస్, ప్రోగ్రామ్స్ లోనూ చేస్తోంది ప్రియాంక. ఈ సంగతి పక్కన పెడితే బుల్లితెర నటుడు శివ కుమార్ తో ప్రేమలో ఉంది ప్రియాంక. పెళ్లికాకపోయినా ఇద్దరూ కలిసే ఉంటున్నారు. జంటగానే టీవీ షోస్, ప్రోగ్రామ్స్ లో సందడి చేస్తున్నారు. అలాగే యూట్యూబ్ వ్లాగ్స్ చేస్తూ భారీగానే సంపాదిస్తున్నారు. కాగా ఈ ఏడాదే తాము పెళ్లి చేసుకుంటామని కొన్ని రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ప్రియాంక- శివకుమార్. కచ్చితమైన డేట్ తెలియదు కానీ త్వరలోనే వీరి పెళ్లిపీటలెక్కే అవకాశముందని తెలుస్తోంది. అయితే అంతకన్నా ముందే ఒక కొత్తిల్లు కట్టుకునేందుకు రెడీ అయ్యారు. ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉన్న ఈ ప్రేమ పక్షలు గతేడాది ఏప్రిల్‌లో భూమి కొని తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇప్పుడు మంచి ముహూర్తం చూసుకుని ఇంటిపనులు మొదలుపెట్టారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదిగా పంచుకున్నారీ లవ్ బర్డ్స్.
‘కోటి రూపాయల లోన్‌తో ఇల్లు కట్టుకుంటున్నాం. ఇది కేవలం ఇటుకలతో కాదు.. ఎన్నో ఆశలతో, కలలతో నిర్మితమవుతోన్న ఇల్లు. నిలువైన గోడల్ని చూస్తుంటే మా భవిష్యత్తు కళ్ల ముందు కనిపిస్తోంది. ఇక్కడ కేవలం ఇంటికి పునాది పడలేదు. జీవితకాలపు జ్ఞాపకాలకు పునాది పడింది. మా జీవితంలో ఈ కొత్త అధ్యాయం ప్రారంభిస్తున్నందుకు ఎంతో గర్వంగా, సంతోషంగా ఉంది. ఇక్కడ మరిన్ని అందమైన జ్ఞాపకాలను కూడబెట్టుకునేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. ఇకపై ఇదే మా శాశ్వత నివాసం’ అని రాసుకొచ్చింది ప్రియాంక.
ఈ సందర్భంగా తన లవర్ శివకుమార్ తో ఇంటి పనులు చేస్తోన్న వీడియోను కూడా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన సెలబ్రిటీలు, నెటిజన్లు, సినీ అభిమానులు ప్రియాంక- శివకుమార్ లకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.